ఒక రైతు కొన్ని మేకలను, కొన్ని పందులను పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి మేక, ఒక చిన్న పందిపిల్ల ఉండేవి. బుజ్జిమేకను వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది. పందిపిల్లెమో వాళ్ళమ్మతో బాటు బురదలో తిరిగేది. దాని ఒంటి నిండా బురద అంటుకునేది.
పందిపిల్ల ఎదురవగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ “ఛీ… నువ్వు నా దగ్గరకు రాకు. కంపు. అవతలికి పో” అని ఛీదరించుకునేది. పందిపిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు. మేక పిల్లతో ఆడుకుందామంటే అదెప్పుడూ పందిపిల్లను అసహ్యించుకునేది.
“అమ్మా నాకూ స్నానం చేయించు. ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు” అని తల్లితో అంది పందిపిల్ల.
“చూడు బంగారం, మనం మనలాగే ఉంటాం. ఇంకోలా ఉండటం మనకు కుదరదు. మన శరీరానికి చెమట పట్టే లక్షణం లేదు. అందుకే ఎప్పుడూ మనం ఒంటిని తడుపుకుంటూ ఉండాలి” అని తల్లి వివరించి చెప్పింది.
పందిపిల్లకు ఇదంతా అర్థం చేసుకునే వయసు లేదు. కాసేపు వాళ్ళమ్మతో గడిపింది. అమ్మ దాన్ని ఎంతో సముదాయించింది.
ఒకరోజు పందిపిల్ల ఒకచోట, మేక పిల్ల ఒకచోట ఆడుకుంటున్నాయి. ఇంతలో దూరంగా ఉన్న కొండల మీదుండే నక్క ఒకటి ఎలా పొంచి ఉందో చూసి మేకపిల్లని పట్టుకుందామని అటువైపు వచ్చింది. మేకపిల్ల ఒంటరిగా ఉండటంతో ఆ నక్కకి మరింత వీలు చిక్కినట్టయింది. నక్కి నక్కి వస్తున్న నక్కను చూసింది పందిపిల్ల.
“ఏయ్ పారిపో త్వరగా పారిపో… నక్కొస్తోంది..” అంటూ గట్టిగా కేకలు వేయడమే కాకుండా మేకపిల్ల పైకి దూకుతున్న నక్కకి అడ్డు వెళ్ళింది.
మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది. ఈలోగా పందిపిల్ల అరుపు విన్న రైతు పరుగెత్తుకుని వచ్చాడు. అతన్ని చూడగానే నక్క పారిపోయింది. పందిపిల్ల గాయానికి మందువేసి బాగు చేశాడు రైతు. ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్తనను తలచుకుని సిగ్గుపడింది బుజ్జిమేక. ఆ తరువాత రెండూ ప్రాణస్నేహితులయ్యాయి.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చూడండి.