రామాపురంలో కాంతయ్య అనే ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. అతనికి తన సంపద మీద చాలా గర్వం ఉండేది. ఊరిలో ఎవరితోనూ సరిగ్గా కలిసేవాడు కాదు సరికదా, ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే తన గర్వంతో దాన్ని ఏదో ఒక రకంగా మూయించేవాడు.
ప్రతి సంవత్సరం ఊరి ప్రజలందరూ వన భోజనాలకు వెళ్లే ఆచారం ఉండేది. ఆ ఏడాది కూడా అందరూ కలిసి వన భోజనానికి వెళ్లారు. అక్కడ కూడా తన గొప్పదనాన్ని చాటుకోవాలని కాంతయ్య భావించాడు. అందుకే, కూరగాయలు తరగడానికి సాధారణ కత్తికి బదులుగా, ఇంటి సభ్యులు వారించినా వినకుండా మేలిమి బంగారంతో చేసిన కత్తిని వెంట తీసుకెళ్లాడు.
వన భోజన ప్రదేశంలో అందరూ సరదాగా ఆటపాటలు ముగించుకుని వంటలు ప్రారంభించారు. చాలా మంది వంట పూర్తి చేసుకుని తినడానికి సిద్ధమయ్యారు. కానీ, కాంతయ్య కుటుంబం మాత్రం ఇంకా కూరగాయలు కూడా కోయలేకపోయింది. దానికి కారణం, బంగారు కత్తి చూడటానికి అందంగా ఉన్నా, కూరగాయలు కోయడానికి మాత్రం అస్సలు పనికిరాలేదు.
కాంతయ్య ఇబ్బందిని గమనించిన చుట్టుపక్కల వారు తాము వండుకున్న భోజనాన్ని వారికి వడ్డించారు. అప్పుడు కాంతయ్య తన తప్పు తెలుసుకున్నాడు. ఏ వస్తువునైనా దాని అవసరాన్ని బట్టి వాడాలి కానీ, పనికిరాని చోట కూడా గొప్పలకు పోతే నష్టమే తప్ప లాభం లేదని గ్రహించాడు. అప్పటి నుంచి గర్వం వదిలేసి అందరితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చూడండి.