Home » అల్లరి కోడి పిల్ల – మొక్కజొన్న గింజ

అల్లరి కోడి పిల్ల – మొక్కజొన్న గింజ

by Lakshmi Guradasi
16 views
Allari kodi pilla katha

ఒక గ్రామంలో ఒక కోడి తన ముగ్గురు పిల్లలతో నివసించేది. ఆ ముగ్గురిలో రెండు కోడి పిల్లలు తల్లి మాటను క్రమం తప్పకుండా వినేవి, కానీ మూడవ పిల్ల మాత్రం చాలా అల్లరిది. అది అప్పుడప్పుడు తల్లి మాట వినకుండా ఒంటరిగా తిరుగుతూ ఉండేది.

ఒకరోజు తల్లి కోడి తన పిల్లలతో కలిసి ఆహారం వెతుకుతుండగా, ఒకచోట మొక్కజొన్న గింజలు పడి ఉండటం చూసింది. వెంటనే తల్లి కోడి, “పిల్లలూ, ఆ మొక్కజొన్న గింజలను ఎవరూ తినకూడదు, అవి మీ గొంతులో చిక్కుకుంటాయి” అని హెచ్చరించింది. కానీ అల్లరి పిల్ల తల్లి మాటను లెక్కచేయకుండా, అమ్మ చూడటం లేదని భావించి ఒక మొక్కజొన్న గింజను తినడానికి ప్రయత్నించింది. అది మింగలేక పోవడంతో దాని గొంతులో చిక్కుకుపోయింది.

తన బిడ్డ పడుతున్న అవస్థను చూసిన తల్లి కోడి, గొంతులో చిక్కుకున్న గింజను వదిలించడానికి నీళ్లు తేవాలని నిర్ణయించుకుంది. ఆమె వెంటనే కొలను దగ్గరకు వెళ్లి నీళ్లు అడిగింది. అయితే కొలను, నీళ్లు తీసుకోవడానికి ఒక కప్పు తీసుకురమ్మని చెప్పింది,. దానితో తల్లి కోడి ఒక వృద్ధురాలి దగ్గరకు వెళ్లి కప్పు కావాలని కోరింది. ఆ బామ్మ ఒక అరిటాకు తీసుకువస్తే కప్పు చేసిస్తానని, అయితే అంతకంటే ముందు తాను కింద పడేసిన సూదిని వెతికి ఇవ్వాలని కోరింది.

తల్లి కోడి సూదిని వెతికి ఇచ్చి, అరిటాకు కోసం అరటి చెట్టు దగ్గరకు వెళ్ళింది. అరటి చెట్టు తన గెల చాలా బరువుగా ఉందని, తోటమాలిని పిలిచి దాన్ని కోయిస్తే ఆకు ఇస్తానని చెప్పింది. తల్లి కోడి తోటమాలి దగ్గరకు వెళ్లి బ్రతిమిలాడగా, అతను ఒక నిబంధన విధించాడు. వారం రోజుల పాటు కోడి పెట్టే గుడ్లన్నీ తనకే ఇవ్వాలని కోరగా, తన బిడ్డ ప్రాణం కాపాడటం కోసం కోడి అందుకు సమ్మతించింది.

చివరికి తోటమాలి అరిటాకును కోయగా, కోడి దాన్ని తీసుకుని బామ్మ దగ్గరకు వెళ్లి కప్పు తయారు చేయించుకుంది. ఆ కప్పుతో కొలను నుండి నీరు తీసుకువచ్చి తన బిడ్డకు తాగించింది. నీరు తాగగానే ఆ పిల్ల కోడికి ఉపశమనం కలిగి, గొంతులో చిక్కుకున్న గింజ పోయింది. అప్పుడు ఆ కోడి పిల్ల తన తప్పు తెలుసుకుని, “నన్ను క్షమించు అమ్మ, ఇక మీదట నువ్వు చెప్పినట్లే వింటాను” అని ప్రాధేయపడింది. తల్లి ఎప్పుడూ తన బిడ్డల మంచి కోసమే చెబుతుందని ఆ కోడి పిల్ల గ్రహించింది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.