Kunti gadida story

కుంటి గాడిద కథ | Kunti gadida story

by Lakshmi Guradasi

కృష్ణాపురం అనే ఊరిలో ఒక బట్టల వ్యాపారి ఉండేవాడు, అతని వద్ద ఒక గాడిద ఉండేది. ఆ వ్యాపారి ప్రతిరోజూ ఆ గాడిద మీద బట్టల మూటలను వేసుకుని ఊరూరా తిరిగి అమ్ముతూ లాభాలను గడించేవాడు. తన వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న ఆ గాడిద అంటే అతడికి చాలా ఇష్టం ఉండటంతో, దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒకసారి వ్యాపారి పని నిమిత్తం పొరుగు దేశం వెళ్లాల్సి వచ్చినప్పుడు, గాడిద బాగోగులు చూసేందుకు ఒక పనివాడిని నియమించి వెళ్ళిపోయాడు.

కొంతకాలానికి వ్యాపారి తిరిగి వచ్చిన తర్వాత తన గాడిద కుంటుతూ నడవడం గమనించాడు. తను ఎంతో ఇష్టంగా చూసుకునే గాడిద అలా కుంటుతూ నడవడం చూసి తట్టుకోలేకపోయిన వ్యాపారి, ఎంతో మంది వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. గాడిద ఎందుకు అలా కుంటుతుందో ఏ వైద్యుడు కనిపెట్టలేకపోయారు. ఆ సమయంలో ఊరికి వచ్చిన ఒక జ్ఞాని అయిన సాధువు వద్దకు వ్యాపారి తన గాడిదను తీసుకుని వెళ్ళాడు.

విషయమంతా విన్న సాధువు, గాడిదను చూసుకునే పనివాడిని పిలవమన్నాడు. పనివాడు రాగానే సాధువు అసలు కారణాన్ని వివరించాడు. ఆ పనివాడు కుంటివాడు కావడంతో, నిత్యం తనతో ఉండే వ్యక్తిని అనుకరించడం వల్లనే గాడిదకు ఆ కుంటితనం వచ్చిందని ఆయన చెప్పాడు. మన చుట్టూ ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుందని, గాడిద నడక మారాలంటే దాన్ని చూసుకునే వ్యక్తిని మార్చాలని సాధువు సూచించాడు. వెంటనే యజమాని తానే ఆ గాడిదను చూసుకోవడం మొదలుపెట్టగా, కొంతకాలానికి అది యజమానిని అనుకరించి మళ్ళీ మామూలుగా నడవడం ప్రారంభించింది. మన చుట్టూ ఉండేవారి ప్రభావం మనపై తప్పనిసరిగా పడుతుందనేది ఈ కథలోని నీతి.

See Also plz click on this: Nakka gadida mamidi pandlu katha

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను చూడండి.

You may also like