దేవుడినే శపించిన పూజారి – Pujari Shapam story

by Lakshmi Guradasi

పూర్వం శ్రీరంగనాథపురం అనే పట్టణంలో సముద్ర తీరాన ఒక పురాతనమైన వేణుగోపాల స్వామి ఆలయం ఉండేది. ఆ గుడిలో రామశర్మ అనే అనాధ పూజారి ఉండేవారు. ఆయన నిరంతరం స్వామి సేవలో గడుపుతూ, భక్తులు ఇచ్చే పళ్ళు, ప్రసాదాలతోనే తన కడుపు నింపుకునేవారు. ఆ గుడి చాలా సిధిలావస్థలో ఉన్నా, రామశర్మ మాత్రం స్వామినే నమ్ముకొని అక్కడే ఉండేవారు.

ఒకరోజు ఒక వర్తక శ్రేష్టి సంతానం కోసం వేడుకోగా, రామశర్మ అతడిని ఆశీర్వదించి ఒక మామిడి పండును ప్రసాదంగా ఇచ్చారు. రామశర్మ దీవెనల వల్ల తొమ్మిది నెలల తర్వాత ఆ వర్తకుడికి మగబిడ్డ జన్మించాడు. తన మొక్కు తీర్చుకోవడానికి వర్తకుడు ఒక బంగారు మామిడి పండును కానుకగా తీసుకువచ్చాడు. అప్పుడు పూజారి రామశర్మ బాహ్య ప్రపంచ స్పృహ లేకుండా సమాధి స్థితిలో (ధ్యానంలో) ఉన్నారు. వర్తకుడు ఆ బంగారు పండును అక్కడే ఉంచి సముద్ర స్నానానికి వెళ్ళాడు.

అదే సమయంలో, తన భార్యాపిల్లల ఆకలి తీర్చడం కోసం ఒక దొంగ అక్కడికి వచ్చాడు. పళ్ళెంలో ఉన్న బంగారు పండును చూసి, అది దేవుడు తన కోసమే ఇచ్చాడని భావించి దానిని దొంగిలించాడు. స్నానం ముగించుకుని వచ్చిన వర్తకుడు పండు కనిపించకపోవడంతో, సమాధి స్థితి నుండి అప్పుడే బయటకు వచ్చిన పూజారిపై నింద వేశాడు. రామశర్మ తాను ఏ పాపం ఎరుగనని మొరపెట్టుకున్నా వినకుండా, వర్తకుడు రాజుకు ఫిర్యాదు చేశాడు.

రాజదర్బారులో, ఆలయ కానుకలను అక్రమంగా కాజేసే కోశాధికారి కూడా పూజారిపై అబద్ధాలు చెప్పి రాజును నమ్మించాడు. ఫలితంగా, రాజు పూజారికి వంద కొరడా దెబ్బల శిక్ష విధించాడు. దెబ్బలతో శరీరం వాచిపోయి, రక్తమోడుతున్న స్థితిలో పూజారిని తిరిగి గుడి వద్ద వదిలేశారు.

తీవ్ర వేదనతో రామశర్మ దేవుడిని నిలదీశారు. అప్పుడు విగ్రహం నుండి ఒక అశరీరవాణి వినిపించింది: ఆ దొంగ తన గంపెడు సంసారం కోసం దొంగిలించాడని, కోశాధికారి అసలైన మోసగాడని, రాజు స్వార్థపరుడని దేవుడు వివరించాడు. అంతేకాకుండా, పూజారికి తగిలిన ప్రతి కొరడా దెబ్బను తాను కూడా అనుభవించానని స్వామి చెప్పారు.

కానీ, తాను అమాయకుడినని తెలిసి కూడా దేవుడు తనను ఎందుకు రక్షించలేదని రామశర్మ ఆగ్రహించారు. “నువ్వు దేవుడివి కాదు, రాతి బండవు” అని ఆక్రోశిస్తూ, ఆ ఆలయం మరియు విగ్రహం సముద్రంలో కలిసిపోవాలని శపించారు. వెంటనే సముద్రం ఉప్పెనలా పొంగి ఆలయాన్ని తనలో కలిపేసుకుంది. రాజు తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరినా, రామశర్మ విరక్తితో సముద్ర కెరటాలలోకి నడిచి వెళ్లి అదృశ్యమయ్యారు.

See Also plz click on this: lazy-crow-and-baby-parrot-story

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ స్టోరీస్ ను చూడండి.

You may also like