అయ్యప్ప స్వామి వారి చరిత్ర యుగయుగాల నాటిది, అయినప్పటికీ నేటికీ కొంతమంది శివుడికి, విష్ణువుకు సంతానం ఎలా జన్మించింది అని, కేవలం సినిమాలలో చూపించే అసంబద్ధమైన (ఇల్లాజికల్) కథలను చూసి సందేహాలను వెలిబుచ్చుతున్నారు. అయ్యప్ప స్వామి యొక్క అసలు పేరు శాస్త. శాస్త అనే పదానికి అర్థం గురుశక్తి (అయా) మరియు శాసించే శక్తి (అప్ప) అనే రెండు శక్తులు కలసి ఉన్నవాడు అని. కాబట్టే శాస్త రూపాన్ని అయ్యప్ప అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈయన సాక్షాత్తు శివుడు మరియు విష్ణువుల కలయికతో జన్మించిన హరిహర సుతుడు.
దత్తాత్రేయ స్వామి మరియు లీలాదేవి శాపం:
శాస్తా జన్మకు పునాది దత్తాత్రేయ స్వామి (త్రిమూర్తుల అంశ) మరియు లీలాదేవి (త్రిమాతల అంశ) మధ్య జరిగిన శాపభాగోతం. ఒక రోజు దత్తాత్రేయ స్వామి దాంపత్య సుఖాలపై విరక్తి చెంది సన్యాస జీవితం గడపాలని నిర్ణయించుకోగా, లీలాదేవి అడ్డుచెప్పింది. దాంతో దత్తాత్రేయ స్వామి కోపించి, లీలాదేవిని రాక్షస కులంలో మహిషానివై (దున్నపోతు ఆకారంలో ఉండే రాక్షస జాతి) జన్మించు అని శపించాడు. ప్రతిగా, లీలాదేవి కూడా, భవిష్యత్తులో దత్తాత్రేయ స్వామి మహిష్యంలా (గేదె) పుట్టి కామవాంఛతో తనను వెతుక్కుంటూ వస్తారు అని శపించింది. ఈ శాపం ఫలితంగా లీలాదేవి కరంబుడు అనే రాక్షసుడి ఇంట్లో మహిషిగా జన్మించింది.
మహిషి పెంపకంలోనే, రంబాసురుడు (కరంబుడి సోదరుడు) మరియు ఒక యక్షణి కలయిక వలన మహిషాసురుడు జన్మించాడు. ఇద్దరు తండ్రులను (కరంబుడిని ఇంద్రుడు, రంబాసురుడిని యక్షుడు) దేవతల వలన కోల్పోయిన మహిషి, మహిషాసురులు, దేవతలపై పగతో పెరిగారు. మహిషాసురుడు స్త్రీల చేతిలో తప్ప మగవారి చేతిలో మరణం లేకుండా వరం పొంది ముల్లోకాలను పీడించాడు. చివరికి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా సకల దేవతల తేజస్సు మేళవించి ఉద్భవించిన దుర్గామాత (చండికా దేవి), మహిషాసురుడితో 10 రోజులు యుద్ధం చేసి, 10వ రోజు అతని తలను ఖండించింది. ఆ రోజే మనం విజయదశమిగా జరుపుకుంటాం.
మహిషి యొక్క కఠినమైన వరం మరియు శాస్తా జననం:
తమ్ముడు మరణించడంతో, దేవుళ్ళపై మరింత కోపంతో రగిలిపోయిన మహిషి, బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసింది. మహిషి తన తమ్ముడిలా ఆవేశపరురాలు కాదు, చాలా తెలివైనది. అందుచేత, బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు, ఆమె చావు అసాధ్యం అయ్యేలా కొన్ని విచిత్రమైన కండిషన్లతో వరమడిగింది:
- తను కోరుకున్నప్పుడల్లా తన రోమకోపాల (స్కిన్ పోర్స్) నుండి లెక్కలేనంత రాక్షస సైన్యం జన్మించాలి.
- తన మరణం కేవలం భూమ్మీద ఉన్నప్పుడు మాత్రమే జరగాలి.
- కేవలం శివుడికి, విష్ణువుకి పుట్టిన సంతానం మాత్రమే తనను చంపగలగాలి.
శివకేశవులకు సంతానం కలగడం అసంభవం అని భావించి, తనకు చావు రాదని గర్వంతో మహిషి ఈ మూడో కండిషన్ పెట్టింది. ఈ వరం పొందిన తర్వాత, మహిషి స్వర్గాన్ని ఆక్రమించి, దేవతలను చిత్రహింసలు పెట్టింది.
మహిషిని అంతం చేయడానికి, శివుని కోరికపై విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించాడు. పార్వతీ దేవి అనుమతితో విష్ణుమూర్తి తీసుకున్న శివ-మోహిని అవతారాన్ని చూసిన పరమేశ్వరుడు మైమర్చిపోయి ఆకర్షితుడయ్యాడు. వారి కలయికతో వీర్యస్కలనం అయి, అందులో నుండి సాక్షాత్తు ఆ హరిహర సుతుడే శాస్తగా జన్మించాడు.
కలియుగంలో మణికంఠుడిగా అవతరణ:
శాస్తా భూమి మీద జన్మించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, నేపాల్ రాజు పలింజవర్మ పెట్టిన శాపం. శాస్తా, గతంలో పలింజవర్మ కుమార్తె పుష్కలదేవిని మరియు పించక వర్మ కుమార్తె పూర్ణాదేవిని వివాహం చేసుకున్నందుకు, పలింజవర్మ కోపించి 12 సంవత్సరాలు భూమ్మీద ఒక మామూలు మనిషిలా జీవించు అని శపించాడు. రెండోది, కేరళ ప్రాంతంలో శంకరాచార్యులు శాపం కారణంగా శివభక్తులు, విష్ణు భక్తుల మధ్య ఐకమత్యం లేక, అల్లకల్లోలం అయిపోతున్న సనాతన ధర్మాన్ని తిరిగి బలపరచడానికి.
సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్న శాస్తా, కేరళ రాజైన పండల రాజు రాజశేఖరునికి ఒక దట్టమైన అడవిలో కనిపించాడు. ఆ బాలుడు మెడలో సువర్ణ గంట (మణి) ధరించి ఉన్నందున, ఆయనకు మణికంఠుడు అనే పేరు వచ్చింది. మణికంఠుడు వచ్చిన వేళ విశేషాన, పండల రాజ్యం సుభిక్షంగా మారింది, రాణికి కూడా రాజరాజు అనే సొంత కుమారుడు జన్మించాడు. మణికంఠుడిని ప్రజలు ప్రేమతో “అయ్య” “అప్ప” అని పిలిచేవారు, అది కాలక్రమేణా అయ్యప్పగా మారింది.
పులిపాలు, ఇరుముడి మరియు మహిషి వధ:
మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలని రాజు నిర్ణయించుకోగా, మంత్రి కుట్రతో రాణిని రెచ్చగొట్టాడు. రాణి తన సొంత కుమారుడిపై ఉన్న ప్రేమతో మణికంఠుడి పట్టాభిషేకాన్ని ఆపాలని నిర్ణయించుకొని, విపరీతమైన తలనొప్పి వచ్చినట్లు నటించింది. మంత్రి ఆదేశాల మేరకు వచ్చిన వైద్యులు, రాణి కోలుకోవాలంటే పులిపాలు మాత్రమే అవసరం అని చెప్పారు.
పులిపాలు తేవడానికి బయలుదేరిన మణికంఠుడికి, రాజు ఇరుముడిని (రెండు భాగాలుగా ఉన్న సంచి) ఇచ్చాడు. ఈ ఇరుముడిలో ఒకవైపు యాత్రకు అవసరమయ్యే తినుబండారాలు, ఇంకొకవైపు అడవిలో దైవారాధన (నివేదన వస్తువులు, కొబ్బరికాయ) కోసం ఉంచాడు.
అడవిలో మణికంఠుడు, దత్తాత్రేయ శాపం కారణంగా భూలోకంలోకి అడుగుపెట్టిన మహిషితో భీకరమైన యుద్ధం చేశాడు. మహిషిని నేలకేసి పాడేసి, ఆమె మెడను తొక్కి భయంకరమైన నాట్యం (తాండవం) చేశాడు. మహిషి మరణించాక, ఆమె శరీరం నుండి శాపవిమోచనం పొందిన లీలాదేవి బయటకు వచ్చి, అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోమని కోరింది.
నైష్టిక బ్రహ్మచారి మరియు శబరిమల స్థాపన:
ఈ జన్మలో తాను నైష్టిక బ్రహ్మచారిని కాబట్టి వివాహం చేసుకోలేనని మణికంఠుడు లీలాదేవికి చెప్పాడు. అయితే, తన దగ్గరకు ఒక్క కన్యస్వామి (మొదటిసారి దీక్ష తీసుకున్న భక్తుడు) కూడా రాని రోజు ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అప్పటి నుండి లీలాదేవి, మాలికాపురత్తమ్మ అనే రూపంలో శబరిమల కొండపై అయ్యప్ప స్వామి కోసం ఎదురుచూస్తోంది.
పులిపాలు తేవడానికి మణికంఠుడు ఇంద్రుడితో సహా దేవతలందరినీ పులులుగా మార్చి, పులుల సైన్యంతో రాజ్యానికి తిరిగి వచ్చాడు. మణికంఠుడు రాజ్యాధికారాన్ని తన తమ్ముడికే చెందుతుందని నిరాకరించి, తాను విసరబోయే బాణం ఎక్కడైతే గుచ్చుకుంటుందో అక్కడే శబరిగిరి మీద అయ్యప్పగా కొలువు తీరుతానని చెప్పాడు. మణికంఠుడు బాణం విసిరిన చోటే నేటి శబరిమల ఆలయాన్ని నిర్మించారు. స్వయంగా విష్ణుమూర్తి ఆరవ అవతారం అయిన పరశురాముడే ఆలయానికి వచ్చి, అయ్యప్ప స్వామి వాడిన 18 ఆయుధాలను 18 మెట్ల కింద ఉంచి, ఆలయ విగ్రహ ప్రతిష్ట చేశారు. అయ్యప్ప స్వామి విగ్రహం యోగపట్టంతో కూడిన యోగాసనంలో స్థిరంగా ఉంటుంది.
మండల దీక్ష నియమాలు మరియు పరమార్థం:
అయ్యప్ప స్వామి దీక్ష సాధారణంగా 41 రోజుల పాటు ఉంటుంది. ఈ దీక్ష మనిషిని క్రమశిక్షణలో పెట్టి, చెడు అలవాట్లను (తాగుడు, పొగాకు వంటివి) దూరం చేస్తుంది. ఈ దీక్షలో పాటించే నియమాలు, మనిషి జీవితంలో కష్టాలు రావడానికి కారణమయ్యే శని మరియు రాహువు గ్రహాల ప్రభావం నుండి రక్షణ కల్పిస్తాయి.
దీక్షలో పాటించాల్సిన ముఖ్య నియమాలు:
- స్నానం: భక్తులు సూర్యోదయం కన్నా ముందే లేచి, ఉదయం మరియు సాయంత్రం చల్లని నీటితోనే స్నానం చేయాలి.
- దుస్తులు: శని ప్రభావానికి సంబంధించిన నలుపు రంగు దుస్తులను మాత్రమే ధరించాలి (కొన్ని రాష్ట్రాలలో నీలం లేదా కాషాయం రంగు దుస్తులు ధరించే వారు కూడా ఉన్నారు).
- పవిత్రత: 41 రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పెళ్లయిన వారైనా వేరే గదిలో నిద్రించడం ఉత్తమం.
- నిషిద్ధాలు: పాదరక్షలు ధరించకూడదు. మెత్తటి పరుపు లేదా దుప్పట్ల మీద పడుకోకూడదు, నేలపై లేదా చాపపై పడుకోవాలి. షేవింగ్, హెయిర్ కట్ (శవరం) లేదా గోర్లు కత్తిరించడం నిషిద్ధం.
- వ్యసనాలు: మద్యం, ధూమపానం, పొగాకు, పాన్ కిల్లి లాంటివి చేయరాదు.
- ఆహారం: మాంసాహారం లేదా మసాలాలు వేసిన వంటలను భుజించరాదు, సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం.
- నడవడిక: హింసతో కూడుకున్న పనులు, ఆలోచనలు, మాటలకు దూరంగా ఉండాలి, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి, అబద్ధాలు ఆడరాదు.
- గౌరవం: భక్తులు తమ భార్యతో సహా స్త్రీలందరినీ దేవతా స్వరూపులుగా (మాత) భావించాలి. వారిపై అరవడం లేదా సేవలు చేయించుకోవడం చేయకూడదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు “అయ్యప్ప” లేదా “స్వామి” అని సంబోధించాలి.
- పూజ: ఉదయం మరియు సాయంత్రం ఆలయాన్ని (చిన్నదైనా సరే) దర్శించుకోవాలి.
శబరిమల: స్త్రీల ప్రవేశ నియమం
శబరిమల ఆలయంలో 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన స్త్రీలకు ప్రవేశం లేదు. దీనికి కారణం అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి కావడం. అంతేకాకుండా, కన్యస్వాములు రాని రోజు మాలికాపురత్తమ్మను (లీలాదేవి) వివాహం చేసుకుంటానని అయ్యప్ప స్వామి ఇచ్చిన మాట కూడా ఈ నియమానికి కారణం.
ఈ నియమం వెనుక శాస్త్రీయ దృక్పథం కూడా ఉంది. ఆలయాలు శక్తి ఉత్పన్నమయ్యే ప్రదేశాలలో నిర్మిస్తారు. ఆలయాల్లోని కుండలిని శక్తి (ధ్వజస్తంభం, మూలమూర్తి ద్వారా) శరీరంలో కింద భాగాల నుండి పై భాగాలకు వెళ్లేలా చేసి ప్రశాంతతను, జ్ఞానాన్ని పెంచుతుంది. అయితే, స్త్రీలకు ఋతుస్రావం (పీరియడ్స్) సమయంలో శక్తి సహజంగా కింద భాగాలకు స్రవిస్తూ ఉంటుంది. అత్యంత శక్తివంతమైన ఈ క్షేత్రానికి ఋతుస్రావ సమయంలో వెళ్లినట్లయితే, గుడిలోని పైకి ప్రవహించే శక్తి, స్త్రీలోని కిందకు ప్రవహించే శక్తి వల్ల కలిగే సూక్ష్మ శరీర మార్పుల వలన విపరీతమైన కడుపు నొప్పి, రక్తం ఎక్కువగా స్రవించడం, నెలసరి సరైన సమయంలో రాకపోవడం లేదా గర్భం దాల్చకపోవడం వంటి భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ఋతుస్రావం జరిగే వయస్సులో ఉన్న స్త్రీలు (10-50 సంవత్సరాలు) రాకూడదని చెప్తారు.
ఈ నియమాలు స్త్రీలను చిన్నచూపు చూడటం కాదని, మన సంస్కృతి ఎప్పుడూ స్త్రీ మూర్తినే (సీతారాములు, రాధాకృష్ణులు, గౌరీ శంకరులు వంటి పేర్లలో) ముందుగా తలుచుకుంటుంది. కేవలం పదేళ్ల లోపు చిన్నారులను మరియు 65 ఏళ్లు దాటిన ఆడవారిని మాత్రమే శబరిమలకు అనుమతిస్తారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ చరిత్ర ను చూడండి.
