రచయిత యండమూరి వీరంద్రనాథ్ గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఛార్టెర్డ్ అకౌంటెంట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాతి రోజుల్లో వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయిగా, దర్శకుడిగా, నిర్మాతగా పలు అవతారాలెత్తారు. ఈయన రాసిన నవలలు తెలుగు సాహిత్య రంగంలో సంచలనం సృష్టించాయి. అంతేకాదు.. వీటి ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కి వెండితెర మీద అలరించాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
1980వ దశకంలో చిరంజీవి- యండమూరి- ఏ కోదండరామిరెడ్డి- కేఎస్ రామారావుల కాంబినేషన్ ఒక ఊపు ఊపింది. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అప్పుడప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న ఈ నలుగురిని ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేశాయి. ఎంతటి ప్రాణ స్నేహితులైనా, ఏళ్లుగా ఎలాంటి గొడవలు లేకుండా నెట్టుకొస్తున్నా.. ఎప్పుడో ఒకసారి వారి మధ్య మనస్పర్ధలు సహజమే. ఇందుకు యండమూరి వీరేంద్రనాథ్ – చిరంజీవి సైతం అతీతం కాదు.
ఎనిమిది ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా యండమూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ చిరంజీవి తనయుడు అయిన హీరో రామ్ చరణ్‌పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. చరణ్‌ను హీరోగా నిలబెట్టేందుకు ఆయన తల్లి సురేఖ ఎంతో కష్టపడేదని, డ్యాన్స్‌లు నేర్పించేదని.. కానీ ఆ అబ్బాయి దవడ సరిగా ఉండేది కాదని తర్వాతి రోజుల్లో దానిని బాగు చేయించారని, అలాగే మరో 8 ఏళ్ల కుర్రాడు మాత్రం అద్భుతమైన ప్రతిభ కనబరిచేవాడని, ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షన్‌లో వచ్చిన అబ్బనీ తియ్యనీ దెబ్బ పాట వినగానే ఇది శివరంజనీ రాగమని చెప్పాడని, దీంతో ఇళయరాజా స్వయంగా ఆ బాబుని మెచ్చుకున్నారని.. అతనే దేవిశ్రీ ప్రసాద్ అంటూ యండమూరి చెప్పుకొచ్చారు. దేవిశ్రీ స్వశక్తితో పైకొచ్చారని ఆయన ప్రశంసించారు.
అయితే తమ హీరోను తక్కువ చేసి మాట్లాడారంటూ యండమూరిపై మెగా ఫ్యాన్స్ భగ్గుమన్నారు. సరిగ్గా ఇదే సమయంలో చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 వేదికపై నాగబాబు స్పందించారు. ఓ రచనా వ్యాసంగ నిపుణుడు, కనిపిస్తే కాళ్లకు దండం పెడతాను.. కానీ అతనొక మూర్ఖుడని.. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే అతనికి వ్యక్తిత్వమే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి కుసంస్కారి చేసే వ్యాఖ్యలు తమ కుటుంబానికి ఎలాంటి నష్టాలు కలిగించవని, వాడెవ్వడో చెప్పాల్సిన అవసరం లేదని వాడికి అర్ధమవుతాయంటూ యండమూరి వీరేంద్రనాథ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు నాగబాబు.
దీనికి యండమూరి సైతం స్పందించారు. తాను ఎప్పుడో చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నాగబాబు ఎంచుకున్న వేదిక సరైనది కాదని.. చరణ్ గురించి తానేమి తప్పుగా మాట్లాడలేదన్నారు. చరణ్ తండ్రి చిరంజీవి.. దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి ఇద్దరూ తనకు స్నేహితులేనని వీరేంద్రనాథ్ స్పష్టం చేశారు.
అయితే ఎప్పుడూ ఇలాంటి వివాదాలకు , గొడవలకు దూరంగా ఉండే చిరంజీవి ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. తనపై వచ్చే విమర్శలను ఎప్పుడూ పట్టించుకోనని, కానీ నాగబాబు తనలాగ కాదని తట్టుకోలేడన్నారు. కొందరు సంస్కారం లేకుండా మాట్లాడతారని, యండమూరి కామెంట్స్ కించపరిచేలా ఉన్నాయి కాబట్టే నాగబాబు అలాంటి మాటలు అన్నాడని చిరు చెప్పారు. నలుగురికి స్పూర్తినిచ్చేలా కామెంట్స్ ఉండాలని, కానీ సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్లు యండమూరి మాట్లాడారని మెగాస్టార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాద లేకుండా తన భార్య సురేఖను ఏకవచనంతో సంబోధించడం కూడా కరెక్ట్ కాదని ఆయన ఫైర్ అయ్యారు.
అయితే తర్వాతి రోజుల్లో వివాదం సద్దుమణగడమే కాకుండా, చిరంజీవి తన ఆటోబయోగ్రఫీ రాసే బాధ్యతను కూడా స్వయంగా యండమూరికి అప్పగించారు.
మరిన్ని ఇటువంటి సినీవిశేషాలు కొరకు తెలుగు రీడర్స్ సినీ విశేషాలు ని సందర్శించండి.