ఒకానొకప్పుడు ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఇతను రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని, ఆ కట్టెలను పట్టణంలో అమ్మి జీవనోపాధి పొందేవాడు. అతను పేదవాడు అయినప్పటికీ, అతను చాలా నిజాయితీపరుడు మరియు కష్టపడి పనిచేసేవాడు.

ఒకరోజు, ఒక నది దగ్గర కట్టెలు నరుకుతుండగా, అతని గొడ్డలి ప్రమాదవశాత్తూ అతని చేతుల నుండి జారి నది నీటిలో పడిపోయింది. నది చాలా లోతుగా ఉండడంతో రామయ్య తన గొడ్డలిని తిరిగి తీసుకోలేకపోయాడు. చివరికి అతను ఏమి చేయలేక నది ఒడ్డున నిస్సహాయంగా కూర్చుని, తన ఏకైక గొడ్డలి సాధనం లేకుండా తన పనిని ఎలా కొనసాగించాలని బాధపడుతున్నాడు. రేపటి నుండి తనకు, తన కుటుంబానికి జీవనోపాధి ఎలాగా అని ఆందోళన చెందుతున్నాడు.

ఇంతలో అక్కడ కూర్చున్న రామయ్యకు, అతని ముందు ఒక అందమైన దేవదూత ప్రత్యక్షమైంది. దేవదూత “ఎందుకు రామయ్య ఇంత దిగులుగా ఉన్నావు?” అని అడిగింది.

అప్పుడు రామయ్య “నా గొడ్డలి నదిలో పడింది, దానిని తిరిగి పొందే మార్గం లేదు. నా జీవనోపాధికి ఏకైక సాధనం అదే ” అని వివరించాడు.

దేవదూత రామయ్య పట్ల జాలిపడి అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె నదిలోకి దిగి బంగారు గొడ్డలితో బయటకు వచ్చి, “రామయ్య ఇది నీ గొడ్డలియేనా ?” అని ఆమె అడిగింది.

రామయ్య బంగారు గొడ్డలి వైపు చూసి, “కాదు, అది నా గొడ్డలి కాదు. నాది ఇనుముతో చేయబడింది.” అని చెప్పాడు.

ఆ దేవదూత మళ్లీ నదిలోకి దిగి వెండి గొడ్డలిని తెచ్చి . “రామయ్య ఇది నీ గొడ్డలియేనా ?” అని అడిగింది.

రామయ్య తల అడ్డంగా ఊపి, “లేదు, అది కూడా నా కోడలి కాదు. నాది ఇనుముతో చేసినది” అని అన్నాడు.

దేవదూత చిరునవ్వుతో మరొకసారి నదిలోకి దిగి, ఈసారి ఆమె ఒక ఇనుప గొడ్డలిని తెచ్చింది. అప్పుడు రామయ్యను “ఇది నీ గొడ్డలియేనా ?” అని అడిగింది.

రామయ్య మొహం ఆనందంతో వెలిగిపోయి, “అవును, అది నా గొడ్డలి ! తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు!” అని చెప్పాడు.

రామయ్య నిజాయితీకి ముగ్ధుడై దేవదూత ఇలా అన్నది, “నీ నిజాయితీ మెచ్చుకోదగినది. నువ్వు నిజం చెప్పావు కాబట్టి నీకు బంగారు, వెండి, ఇనుప గొడ్డళ్లు మూడు ఇస్తాను.” అని చెప్పి రామయ్యకు మూడు గొడ్డళ్లు ఇచ్చింది.

దాంతో రామయ్య చాల ఆనందపడ్డాడు, దేవదూతకు చాలా కృతజ్ఞతలు చెప్పాడు. మూడు గొడ్డళ్లతో గ్రామానికి తిరిగి వచ్చి తన కథను అందరితో పంచుకున్నాడు. గ్రామస్తులు అతని నిజాయితీని మెచ్చుకున్నారు మరియు సత్యవాది యొక్క విలువను తెలుసుకున్నారు.

నీతి: నిజాయితీకి ఎల్లప్పుడూ ప్రతిఫలం లభిస్తుంది.

మరిన్ని తెలుగు కథల కొరకు తెలుగు రీడర్స్ ను సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published