ఒకానొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. పెద్దగా చదువు కోకపోయినా మంచి సమయస్ఫూర్తి తెలివితేటలు కలవాడు. ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం కొరకు గ్రామ ప్రజలందరూ ఈ రైతు దగ్గరికి వచ్చేవారు. ఒకసారి ఈ రైతు కి 50 రూపాయలు అవసరం అవుతుంది. ఆ 50 రూపాయలు సంపాదించడానికి ఆ రైతు ఒక ఉపాయం ఆలోచిస్తాడు.

ఆ గ్రామానికి పక్కనే ఉన్నా పట్టణంలో ఆ రైతుకు తెలిసిన ఒక తెలివిగల లాయర్ ఉంటాడు. ఆ రైతు ఆయన వద్దకు వెళ్లి, “లాయర్ గారు మీరు బాగా చదువుకున్న వారు మరియు తెలివితేటలు కలవారు. నేను చదువే రాని ఒక నిరక్షరాస్యుడిని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి, అలాగే మీరు నన్ను ఒక ప్రశ్న అడగండి, నేను గనుక సమాధానం చెప్పలేకపోతే 50 రూపాయలు ఇచ్చుకుంటాను ఎందుకంటే నేను పేద వాడిని నా దగ్గర అంత డబ్బులేదు!” అని అంటాడు.

అందుకు ఆ లాయర్ వీడు అమాయకుడు కదా.. అని ధైర్యంగా ఒప్పుకుంటాడు.

“రెండు తలలు, ఆరు కాళ్లు ఉన్న జంతువు ఏది ?” అని ఆ రైతు అడగగా. లాయర్ చాలాసేపు ఆలోచించి, చివరికి నేను పందెం ఓడిపోయాను అని ఒప్పుకొని 100 రూపాయలు ఇచ్చి” ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్ననే నేను నిన్ను అడుగుతున్నాను నువ్వు నాకు సమాధానం చెప్పు”, అంటాడు
దానికి ఆ రైతు ” ఈ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు లాయర్ గారు నేను కూడా పందెం ఓడిపోయాను!”

ఇదిగో నేను పందెం ఓడిపోతే మీకు ఇస్తానన్న 50 రూపాయలు అని లాయర్ చేతిలో 50 రూపాయలు పెట్టి మిగిలిన 50 తన జేబులో వేసుకుని తిరిగి ఇంటికి సంతోషంగా వెళ్ళిపోతాడు. దీనిని లాయర్ తలుచుకుని అయ్యో.. రైతుని తక్కువ అంచనా వేసానే అని కుమిలి పోతూ, ఇకపై ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని నిర్ణయించుకుంటాడు.

నీతి:

పై కధ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే “తెలివితేటలు లేకుండా చదివిన చదువు వ్యర్థం.

మరిన్ని తెలుగు కధల కొరకు తెలుగు రీడర్స్ ను సంప్రదించండి.

You may also like

Leave a Comment