Home » తుంటరి కోతికి గుణపాఠం

తుంటరి కోతికి గుణపాఠం

by Shameena Shaik
0 comment

ఒక అడవిలో ఒక మంచి కోతి ఒక తుంటరి కోతి ఉండేవి. అవి రెండు చెట్ల మీద నుండి దూకుతూ ఎంతో సరదాగా, ఆనందంగా ఆడుతూ తిరిగేవి. తుంటరి కోతి అడవిలో ఉన్న అన్ని జంతువులను ఆటపట్టించేది. ఆ తుంటరి కోతి చేష్టలకు అన్ని భాద పడేవి. కానీ దానిని ఏమి అనలేక గమ్ముగా ఉండేవి.తుంటరి కోతి చేష్టలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి.


ఒక రోజు తుంటరి కోతి గుంపులుగా ఉన్న కప్పలను చూసి, పాము వద్దకు వెళ్లి నీకు ఆహారం చూపిస్తాను రా! అని ఆ పామును కప్పల గుంపు వద్దకు తీసుకుని వెళ్ళింది. పామును చూడగానే కప్పలు ప్రాణభయంతో గెంతుతూ, పరుగులు పెడుతుంటే ఈ తుంటరి కోతి దాన్ని చూసి ఆనందించేది. పాము పడుకుని ఉంటె చీమలను ఒక పెద్ద ఆకులో తీసుకుని వెళ్లి పాము పుట్టలో వదిలేసేది. చీమలు కుట్టి పాము విలవిల్లాడుతూ పారిపోతుంటే దాన్ని చూసి తుంటరి కోతి నవ్వేది,జింకలను అనవసరంగా భయపెట్టి పరుగులు పెట్టించేది. గాడిద కలల్లో మట్టి కొట్టి హింసించేది.

thuntari kothi

అల్లరి పనులతో తుంటరి కోతి మిగతా జంతువులను ఏడిపించడం మంచి కోతికి నచ్చేది కాదు.అల్లరి పనులు మానుకోమని చాలా సార్లు చెప్పింది. అయినా అది మారలేదు. ఆటపట్టించి వినోదమవడంలో వచ్చే సంతోషం ఆనందం నీ మట్టి బుర్రకు తెలీదు! అని హేళనగా నవ్వింది.

తుంటరి కోతికి ఒక పిల్ల ఉండేది. అదంటే తనకు విపరీతమైన ప్రేమ. ఆ పిల్ల కోతి ఒకరోజు కనిపించకుండా పోయింది. తల్లి కోతి ఎంత వెతికిన పిల్ల కోతి కనిపించలేదు. తిరిగి తిరిగి తుంటరి కోతి తన పిల్ల కనిపించక పోవడంతో విలవిల్లాడిపోయింది. తిండి నిద్ర మానేసి నీరసించి పోయింది. అప్పుడు మంచి కోతి తుంటరి కోతి పిల్లను తీసుకుని వచ్చింది. తన పిల్లను చూసిన వెంటనే తుంటరి కోతి ప్రేమతో గుండెలకు హత్తుకుంది.

‘నా పిల్ల నీకు ఎక్కడ కనిపించింది? అని మంచి కోతిని అడిగింది’ దొరకడమేంటి! నీ పిల్లను నేనే దాచి పెట్టాను, అని మంచి కోతి సమాధానం ఇచ్చింది. అలా ఎందుకు చేసావు? అని కోపంగా అడిగింది తుంటరి కోతి. ‘ఏడిపించి వినోదం పొందడంలో ఆనందం ఉందని నువ్వే చెప్పావు కదా! అందుకే నువ్వు భాదతో అల్లాడుతుంటే దాన్ని చూసి ఆనందిద్దాం అని ఆలా చేశా’ అంది మంచి కోతి.

ఒకరిని ఏడిపించి సంతోషపడటం ఎంత తప్పో… ఆ భాధ వరకు వచ్చాకే తుంటరి కోతికి అనుభవమైంది. తనకు గుణపాఠం చెప్పేందుకు మంచి కోతి అలా చేసింది అని అర్ధం చేసుకుంది. ఆ తర్వాత నుండి తుంటరి కోతి అల్లరి పనులు చెయ్యడం మానేసింది. సహకారగుణం అలవాటు చేసుకుంది. చాకచక్యంగా తుంటరి కోతిలో మార్పు తెచ్చిన మంచి కోతిని మిగతా జంతువులు అభినందించాయి.

నీతి:

ఒకరిని భాద పెడితే వచ్చే సంతోషం ఎప్పుడు శాశ్వతం కాదు. ఒకరిని ఏడ్పించి మనం పొందే సంతోషం ఎప్పుడికైనా మనకే ముప్పు తెచ్చి పెడుతుంది. కాబట్టి మనం ఎవ్వరిని భాద పెట్టి హింసించి, పక్క వాళ్ళ పతనం చూసి సంతోషించ కూడదు. వీలైతే సాయం చేద్దాం పోయేదేముంది, మహా అయితే తిరిగి వాళ్ళే సాయం చేస్తారు!

మరిన్ని తెలుగు నీతి కధల కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment