Home » గెర్కిన్ పంట – వివరాలు

గెర్కిన్ పంట – వివరాలు

by Vinod G
0 comment

గెర్కీన్ అనేది సాధారణంగా రుచికరమైన ఊరగాయ దోసకాయను సూచించడానికి ఉపయోగించే పదం. చూడడానికి అచ్చం దోసతీగ లాగా కనిపించే ‘గెర్కిన్’ పైరు కీరదోసకాయను పోలి ఉంటుంది. దొండకాయ మాదిరిగానే కనిపిస్తుంది. సరైన అవగాహన, సూచనలతో వ్యవసాయం చేస్తే మంచి దిగుబడి, రాబడి సొంతం చేసుకోవచ్చు. రైతులుకు లాభాలు తీసుకొచ్చే పంటల్లో ‘గెర్కీన్ దోస’ కూడా ఒకటి. మనదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో గెర్కిన్ ను సాగు చేస్తున్నారు.

గెర్కిన్ ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు:

మనిషి శరీరంలోని నీటి శాతాన్ని పెంచడం, క్యాన్సర్ కారకాలను తగ్గించడ, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టే మందుల తయారీకి గెర్కిన్ ను ఎక్కువగా వినియోగిస్తారు.

gerkin forming details

తెలుగు రాష్ట్రాలలో అనుకూలత :

గెర్కిన్ సాగుకు తెలుగు రాష్ట్రాల్లో అనుకూల వాతావరణ ఉండడంతో కొన్ని కంపెనీలు బై బ్యాక్ ఒప్పందంతో విత్తనాలు, ఎరువులు అందించి సాగు చేయిస్తున్నాయి. కంపెనీ ప్రతినిధుల సలహాలు, సూచనలతో పంట సాగు చేసి రైతులు మంచి దిగుబడి సాధిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను అర్జిస్తున్నారు.

భూమి రకము – పంట కాలం:

గెర్కిన్ అన్ని రకాల భూముల్లో పండుతుంది. ఇసుక నేలల్లో  బాగా అనుకూలం. ఈ పంట వేయడానికి ఫిబ్రవరి రెండో వారం అనుకూలం. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ కారణంగా ప్రస్తుతం రైతులు గ్రీన్ హౌస్లలో ఏడాది పొడవునా పండిస్తున్నారు.

విత్తన దశ:

దుక్కి దున్ని మూడు లేదా నాలుగు అడుగులు వెడల్పుల్లో బోదెలు తయారు చేయాలి. బోదె బోదెకు మధ్య ఒక అడుగు వెడల్పులో కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 300 నుండి 650 గ్రాముల విత్తనం అవసరం. విత్తనాలను 1-2 సెంటీమీటర్లు లోతులో 90 * 60 సెంటీమీటర్ల దూరంతో నాటుకోవాలి.

యాజమాన్య పద్దతులు:

విత్తనాలు నాటిన దగ్గర నుంచి అవి మొలకెత్తి వరకు వెంట వెంటనే నీరు పారించాలి. మొలకలు వచ్చిన తర్వాత ఆరు నుంచి తొమ్మిది రోజులు మధ్యలో నీళ్లు అందించాలి. విత్తిన 25 రోజుల తర్వాత మొక్కలను భూమి పైకి లేపాలి. తీగలు వేయడం ప్రారంభించాక పందిర్లు వేసి మొక్కలను పైకి పెరగనివ్వాలి.

పంట కోత:

30 నుండి 35 రోజుల్లో పంట కోతకుకు సిద్ధంగా ఉంటుంది. గ్రేడ్ ని బట్టి ధర లభిస్తుంది. గ్రేడ్ నిర్ణయించడానికి ప్రతిరోజు పండ్లను కోయాలి. ప్రతి రోజు పండ్లను కోయడం వలన మంచి గ్రేడ్ ని పొందవచ్చు. నీడలోనే పండ్లను సేకరించాలి. పండ్లపై నీరు చల్లకూడదు. పండ్ల సేకరణకు జ్యూట్ బ్యాగులు మాత్రమే ఉపయోగించాలి. కోసిన పంటను అదే రోజు సాయంత్రం ఫ్యాక్టరీకి రవాణా చేయాలి. పరిశ్రమకు పంపిన రోజే ప్రాసెస్ చేయకుంటే పంట నాణ్యత కోల్పోతుంది.

దిగుబడి:

90 రోజుల్లో హెక్టారుకు 10 నుండి 12 టన్నుల దిగుబడి వస్తుంది. ఇది నేల పోషక స్థితి, వాతావరణం, రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

ధర మరియు మార్కెటింగ్ :

సాధారణ దోసకాయ ధరతో పోలిస్తే గెర్కిన్ ధర రెండు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. దేశీ రకం దోసకాయ కేజీకి 20 రూపాయలు వస్తుంటే గెర్కిన్ రకం కొనాలి అంటే 100 రూపాయలు వరకు పెట్టాలి. రైతులు మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచి రాబడి సొంతం చేసుకోవచ్చు.

ఇలాంటి మరిన్ని విశేషాల కోసం తెలుగు రీడర్స్ వెబ్సైటు ను సంప్రదించండి.

You may also like

Leave a Comment