వారణాసి — కాశీ, అవిముక్త క్షేత్రం, ఆనందవనం… ఎన్నో నామాలతో ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర నగరం కేవలం భౌగోళికంగా ఉన్న ఒక ప్రదేశం కాదు. ఇది హిందూ ధర్మంలో మోక్షానికి ద్వారం, శివుని శాశ్వత నివాసం. పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించక ముందే వెలసిన ఆది నగరం ఇదే. సత్యయుగం నుండి కలియుగం వరకూ కాలచక్రం మారినా, యుగాలు గడిచినా తన పవిత్రతను కోల్పోని ఏకైక క్షేత్రంగా కాశీ నిలిచింది.
ఇక్కడ ప్రతి వీధి ఒక ఇతిహాసం చెబుతుంది… ప్రతి ఘాట్ ఒక ఆత్మకథ చెప్తుంది… ప్రతి శివలింగం వెనుక ఒక పురాణ గాథ దాగి ఉంది. గంగా తీరంలో వెలసిన ఈ నగరం జీవన–మరణాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంగమ స్థలం. ఇక్కడ ప్రాణం విడిస్తే శివుడే తారక మంత్రం ఉపదేశిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే వేలాది మంది తమ అంతిమ ప్రయాణానికి కాశీని ఎంచుకుంటారు.
కాలభైరవుని కాపలాలో, గంగమ్మ ఒడిలో, విశ్వనాథుడి ఆశీస్సులతో నిత్య జాగృతంగా ఉండే ఈ నగరం — మానవ జీవితానికి పరమార్థాన్ని బోధించే జీవంత దేవాలయం. వారణాసి చరిత్ర అంటే కేవలం రాజ్యాల మార్పుల కథ కాదు… అది ఆత్మ ప్రయాణ గాధ.
సృష్టికి పూర్వమే కాశీ నిర్మాణం:
వేద కాలక్రమం (Vedic Timeline) ప్రకారం, బ్రహ్మ పుట్టిన తర్వాతే సృష్టి మరియు కాలం మొదలయ్యాయి. కానీ, బ్రహ్మ కూడా పుట్టకముందే పరమేశ్వరుడు తన మంత్ర శక్తితో, మనోబలంతో ఈ కాశీ నగరాన్ని నిర్మించాడు. మన పురాణాల్లోని వేదిక్ టైమ్ లైన్ ప్రకారం, సత్య, త్రేతా, ద్వాపర, కలి అనే నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. ఇటువంటి 71 మహాయుగాలు ఒక మన్వంతరం అవుతాయి, మరియు 14 మన్వంత్రాలు కలిస్తే ఒక కల్పం అవుతుంది. సాధారణంగా ప్రతి కల్పం ముగిసినప్పుడు ప్రళయం వచ్చి భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంతమైపోతాయి. కానీ, కాశీ నగరాన్ని మాత్రం పరమేశ్వరుడు ప్రళయ కాలంలో తన త్రిశూలం మీద ఉంచి కాపాడుతాడని స్కంద పురాణం చెబుతోంది.
శివుడు కాశీని ఎందుకు నిర్మించాడు?
శివుడు ఒకరోజు ధ్యానంలో ఉన్నప్పుడు తన దివ్యదృష్టితో భవిష్యత్తును చూశాడు. రాబోయే కాలంలో బ్రహ్మ సృష్టించబోయే జీవరాశులు చేసే పాపాలు, వాటి వల్ల వారు అనుభవించే కఠినమైన శిక్షలను చూసి ఆయన మనసు చలించిపోయింది. ఆ పాపాల నుండి మనుషులను రక్షించి, వారికి సులభంగా మోక్షాన్ని ప్రసాదించడానికి ఒక శాశ్వతమైన క్షేత్రం ఉండాలని భావించి తన మంత్ర శక్తితో కాశీని నిర్మించాడు.
మణికర్ణిక ఘాట్ ఆవిర్భావం మరియు విశిష్టత:
కాశీ క్షేత్ర వైభవాన్ని పెంచడానికి శ్రీ మహావిష్ణువు వెయ్యి సంవత్సరాల పాటు ఒంటికాలిపై కఠినమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయన శరీరం నుండి వెలువడిన చెమట బిందువులు ఒక చోట చేరి ఒక చెరువులా ఏర్పడ్డాయి. విష్ణువు భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై తల ఊపినప్పుడు, ఆయన చెవికి ఉన్న కుండలం (మణి) ఆ చెరువులో పడిపోయింది. అందుకే ఆ ప్రదేశానికి ‘మణికర్ణిక ఘాట్’ అనే పేరు వచ్చింది (మణి అంటే కుండలం, కర్ణిక అంటే చెవి). ఈ ఘాట్‌లో అంత్యక్రియలు జరిగే ఎవరికైనా జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. ఇది భూమి మీద మొట్టమొదటిగా ఏర్పడిన ఘాట్ అని చెప్పవచ్చు.
కాశీలో మరణం – మోక్షానికి మార్గం:
హిందూ పురాణాల ప్రకారం, ఒక మనిషి చనిపోయే ముందు వారి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తే వారికి పునర్జన్మ లేకుండా మోక్షం లభిస్తుంది. అయితే, కాశీ పట్టణంలో మరణించే వారికి మరెవరో ఈ మంత్రాన్ని చెప్పనక్కర్లేదు. ఎందుకంటే, చనిపోతున్న వ్యక్తి చెవిలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. శివుని నోటి నుండి వచ్చిన ఆ మంత్రాన్ని విన్న వెంటనే, ఆ ఆత్మను తీసుకెళ్లడానికి వచ్చే యమధూతలు వెనుదిరుగుతారు మరియు శివగణాలే ఆ ఆత్మను మోక్ష మార్గంలో నడిపిస్తాయి. ఈ విషయాలన్నీ 18 మహాపురాణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని ‘కాశీ ఖండం’లో స్పష్టంగా వివరించబడ్డాయి. అందుకే పూర్వం వయసు పైబడిన వారు తమ చివరి రోజుల్లో కాశీకి వెళ్లి అక్కడే ప్రాణాలు వదిలేయడానికి ఇష్టపడేవారు.
శక్తి పీఠం మరియు అన్నపూర్ణ దేవి గాథ:
కాశీ నగరం ప్రధానమైన శక్తి క్షేత్రం కూడా. దక్ష యజ్ఞంలో అవమానానికి గురైన సతీదేవి ఆత్మహుతి చేసుకున్న తర్వాత, శివుడు ఆమె మృతదేహంతో రుద్రతాండవం చేశాడు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని 51 ముక్కలుగా చేయగా, అందులో సతీదేవి చెవి భాగం కాశీలో పడటం వల్ల ఇక్కడ ‘విశాలాక్షి అమ్మవారి శక్తి పీఠం’ ఏర్పడింది. అలాగే, ఒకసారి శివుడు ఆహారాన్ని ‘మాయ’ అని అన్నప్పుడు, పార్వతీ దేవి తన అన్నపూర్ణ శక్తితో మాయమైపోయింది. దీనివల్ల ప్రపంచమంతా కరువు ఏర్పడి అందరూ ఆకలితో ఇబ్బంది పడ్డారు. అప్పుడు పార్వతి కాశీలో అన్నపూర్ణ దేవిగా వెలిసి అందరికీ ఆహారాన్ని అందించింది. ఆహారం యొక్క ప్రాముఖ్యతను గ్రహించిన శివుడు స్వయంగా ఆమె ముందు పాత్ర పట్టుకుని భిక్ష అడిగాడు.
గంగా నది ఆగమనం మరియు భగీరథుని తపస్సు:
గంగానది భూమికి రావడానికి వెనుక ఒక గొప్ప విషాద గాథ ఉంది. సగర చక్రవర్తి అశ్వమేధ యాగం నిర్వహిస్తున్న సమయంలో ఇంద్రుడు ఆ యాగ గుఱ్ఱాన్ని దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. ఆ గుర్రాన్ని వెతుకుతూ వచ్చిన సగరుని 60 వేల మంది కుమారులు కపిల మహర్షి ధ్యానాన్ని భంగం చేయడంతో ఆయన కోపానికి గురై భస్మమైపోయారు. వారికి పిండప్రదానం జరగకపోవడంతో ఆ 60 వేల మంది ఆత్మలు అక్కడే ప్రేతాత్మలుగా మిగిలిపోయాయి.
ఈ విషాద స్థితి నుండి తమ పూర్వీకులకు విముక్తి కలిగించేందుకు త్రేతాయుగంలో భగీరథుడు ఘోర తపస్సు చేసి ఆకాశగంగను భూమికి రప్పించాడు. గంగ ప్రవాహ వేగాన్ని భూమి భరించలేకపోవడంతో శివుడు ఆమెను తన జటాజూటంలో బంధించి మెల్లగా భూమిపై విడిచాడు. కాశీ గుండా ప్రవహించే ఈ పవిత్ర గంగానదిలో అస్తికలు కలిపితే మోక్షం లభిస్తుందని విశ్వాసం. భగీరథుని పూర్వీకులకు గంగాజలం తగిలిన వెంటనే మోక్షం లభించిన ఘటన ఇందుకు నిదర్శనంగా చెబుతారు.
సత్య హరిశ్చంద్రుడు మరియు హరిశ్చంద్ర ఘాట్:
తన జీవితంలో ఎన్నడూ అబద్ధం చెప్పని రాజు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడు పెట్టిన కఠిన పరీక్షలో భాగంగా తన రాజ్యాన్ని, కుటుంబాన్ని వదులుకుని కాశీలో కాటికాపరిగా పనిచేశాడు. తన సొంత కుమారుడు చనిపోయినప్పుడు కూడా ధర్మం తప్పకుండా పనిచేసిన ఆయన నిబద్ధతకు శివుడు మెచ్చి మోక్షం ప్రసాదించాడు. ఆయన పేరు మీదుగానే నేడు ‘హరిశ్చంద్ర ఘాట్’ పిలువబడుతోంది. ఈ ఘాట్‌లో అంత్యక్రియలు జరిగే వారికి కూడా మోక్షం లభిస్తుందని శివుడు వరం ఇచ్చాడు.
కాలభైరవుడు: కాశీ క్షేత్ర పాలకుడు
బ్రహ్మదేవునికి ఒకప్పుడు ఐదు తలలు ఉండేవి. తన అహంకారంతో తానే సర్వోన్నత సృష్టికర్తనని గర్వించిన సమయంలో, శివుని మూడవ కన్ను నుండి కాలభైరవుడు ఉద్భవించి బ్రహ్ముని ఐదవ తలను ఖండించాడు. ఆ కారణంగా బ్రహ్మహత్య పాతకం అంటుకున్న కాలభైరవుడు, దానిని తొలగించుకోవడానికి పన్నెండు సంవత్సరాల పాటు లోక సంచారం చేసి చివరకు కాశీకి చేరుకున్నాడు. కాశీలో అడుగుపెట్టిన వెంటనే ఆ పాపం నివృత్తి అయి, బ్రహ్మ కపాలం నేలపై పడిపోయి భస్మమైంది.
అనంతరం శివుడు కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా (కోత్వాల్‌గా) నియమించాడు. ఆయన అనుమతి లేనిదే యమధర్మరాజు కూడా కాశీలో ప్రవేశించలేడని వరం ప్రసాదించాడు. అంతేకాక, కాశీలో ఎవరైనా చేసే పూజలు ముందుగా కాలభైరవుడికే చేరి, ఆ తరువాతే శివునికి అర్పితమవుతాయని శివుడు ప్రకటించాడు.
ఆది శంకరాచార్యులు మరియు కాలభైరవాష్టకం:
శంకరాచార్యులు కేరళలోని కాలడిలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో ఆయన జన్మించడం విశేషం. కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే వేద పాఠాలు పూర్తి చేసిన ఆయన, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి ఆయన కాలు ముసలి (మకరం / crocodile) పట్టుకున్న సమయంలో, అది తన ప్రాణాలు తీయడానికి కాదు — తనను ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపించడానికే వచ్చిందని గ్రహించారు. ఆ సంఘటన ద్వారానే తల్లి నుండి సన్యాసానికి అనుమతి పొందారు.
8వ శతాబ్దంలో కేరళలో జన్మించిన ఆది శంకరాచార్యులు తన 12వ ఏట కాశీని సందర్శించారు. మణికర్ణిక ఘాట్ సమీపంలో ధ్యానం చేస్తున్న సమయంలో ఆయనకు కాలభైరవుని భయంకరమైనదీ, దివ్యమైనదీ అయిన రూప దర్శనం కలిగింది. ఆ అనుభూతి వేళ ఆయన నోటి నుండి సహజంగా వెలువడిన శక్తివంతమైన స్తోత్రమే ‘కాలభైరవాష్టకం’. ఈ స్తోత్రాన్ని పఠిస్తే ప్రతికూల శక్తులు నశిస్తాయని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
వారణాసి కేవలం ఒక చారిత్రక నగరం కాదు; అది విశ్వాసం, భక్తి మరియు మోక్షానికి సజీవ సాక్ష్యం. మణికర్ణిక ఘాట్ చితిమంటల నుండి గంగా హారతి వెలుగుల వరకు, కాశీలోని ప్రతి అణువు శివమయం. ఈ నగరం మానవుడికి జీవితం యొక్క అశాశ్వతతను మరియు ఆత్మ యొక్క శాశ్వతత్వాన్ని గుర్తుచేస్తూనే ఉంటుంది.
See Also plz click on this: varanasi-kashi-vishwanath-temple
kashi-vishwanath-temple-map-and-overview
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ చరిత్ర ను చూడండి.
