మేడారం సమ్మక్క సారక్క జాతర అనేది తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే అతిపెద్ద గిరిజన పండుగ. ఇది భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే రెండవ అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. దాదాపు 700 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ జాతర, అన్యాయానికి వ్యతిరేకంగా గిరిజనులు సాగించిన వీరపోరాటానికి మరియు ఆ తల్లికూతుళ్ల త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి రెండేళ్లకొకసారి మాఘ మాసంలో జరిగే ఈ జాతరకు కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి ఇతర రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా లక్షలాది భక్తులు తరలివస్తారు.
సమ్మక్క జననం మరియు దైవిక బాల్యం:
చరిత్ర ఆధారంగా 13వ శతాబ్దంలో, మేడారం ప్రాంతంలో కోయ తెగకు చెందిన గిరిజనులు వేటకై దట్టమైన అడవిలోకి వెళ్లినప్పుడు, ఒక పాము పుట్టపై పసిపాప ఏడుస్తూ కనిపించింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ పాపకు పులులు, సింహాలు రక్షణగా కాపలా కాస్తున్నాయి. గిరిజన నాయకుడైన మేడరాజు ఆ పాపను దైవ ప్రసాదంగా భావించి, తన గూడానికి తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నారు. సమ్మక్క పెరిగేకొద్దీ ఆమెలో దైవిక శక్తులు ఉన్నాయని గ్రామస్థులు గుర్తించారు; ఆమె తన చేతితో ఆకుపసరు మందు ఇస్తే ఎలాంటి మొండి రోగమైనా నయమైపోయేదని భక్తుల నమ్మకం. ఆమె అసాధారణమైన బుద్ధి, సాహసం మరియు నాయకత్వ లక్షణాలతో గిరిజన సమాజానికి ఆదర్శంగా నిలిచింది.
వివాహం మరియు కుటుంబ జీవితం:
సమ్మక్క యుక్తవయస్సుకు వచ్చిన తర్వాత, మేడారం ప్రాంతాన్ని పాలించే కోయ రాజు మరియు తన మేనల్లుడైన పగిడిద్ద రాజుతో ఆమె వివాహం జరిగింది. వీరిద్దరికీ సారలమ్మ (సారక్క), నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు మరియు జంపన్న అనే కుమారుడు జన్మించారు. సారక్క కూడా తన తల్లి లాగే అసాధారణ పరాక్రమవంతురాలు మరియు ప్రజా ప్రేమికురాలు; ఆమెను గోవిందరాజుకు ఇచ్చి వివాహం చేశారు. సమ్మక్క నాయకత్వంలో మేడారం ప్రాంతం వర్ధిల్లింది, ప్రజలు శాంతియుతంగా జీవించారు. ఆమె కేవలం పాలకురాలిగానే కాకుండా, గిరిజనులకు ఒక తల్లిగా, మార్గదర్శిగా నిలిచింది.
కాకతీయులతో యుద్ధం మరియు అమరత్వం:
13వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు పాలనలో మేడారం ప్రాంతం ఉండేది. ఒకసారి వరుసగా మూడు సంవత్సరాల పాటు తీవ్రమైన కరువు రావడంతో గిరిజనులు రాజుకు కట్టాల్సిన పన్నును (కప్పం) చెల్లించలేకపోయారు. కరువు వల్ల పన్ను కట్టలేమని పగిడిద్ద రాజు వేడుకున్నప్పటికీ, కాకతీయ రాజు ఆగ్రహంతో మేడారంపై యుద్ధం ప్రకటించాడు. సంపంగి వాగు వద్ద జరిగిన భీకర యుద్ధంలో కాకతీయ సైన్యం అత్యునాత ఆయుధాలతో దాడి చేయగా, గిరిజనులు తమ దగ్గర ఉన్న విల్లులు, బాణాలు, మొండి కత్తులతో వీరోచితంగా పోరాడారు. ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు, సారక్క, గోవిందరాజు వీరమరణం పొందారు. శత్రువుల చేతిలో చిక్కడం ఇష్టం లేక సమ్మక్క కుమారుడు జంపన్న, సంపంగి వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు; అతని రక్తంతో ఆ వాగు ఎర్రగా మారిందని, అందుకే దానిని ‘జంపన్న వాగు’ అని పిలుస్తారు.
సమ్మక్క అంతర్ధానం మరియు జాతర ప్రారంభం:
తన కుటుంబమంతా యుద్ధంలో నేలకొరగడంతో సమ్మక్క స్వయంగా రణరంగంలోకి దూకి శత్రువులను చండ్రాడింది. ఆమె పరాక్రమాన్ని నేరుగా ఎదుర్కోలేక కాకతీయ సైనికులు ఆమెను వెన్నుపోటు పొడిచారు. గాయపడిన సమ్మక్క రక్తం ఓడుతూనే చిలకల గుట్ట వైపు వెళ్లి అదృశ్యమైంది. ఆమెను వెతుకుతూ వెళ్లిన భక్తులకు అక్కడ ఒక నెమలినార చెట్టు కింద కుంకుమ భరణి మాత్రమే కనిపించింది. సమ్మక్కే ఆ కుంకుమ భరణిగా మారిందని గిరిజనుల విశ్వాసం. తరువాత కాకతీయ రాజు తన తప్పు తెలుసుకుని, గిరిజనులకు పన్ను మినహాయించి జాతర నిర్వహించడానికి అనుమతించాడని ప్రతీతి.
జాతర విశిష్టత మరియు నాలుగు రోజుల ఆచారాలు:
మేడారం జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమై నాలుగు రోజుల పాటు వైభవంగా జరుగుతుంది.
- మొదటి రోజు: కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెపైకి తీసుకువస్తారు.
- రెండవ రోజు: చిలకల గుట్ట నుండి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు.
- మూడవ రోజు: కోట్లాది మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి దేవతలకు “బంగారం” (బెల్లం) తమ శరీర బరువుకు సమానంగా సమర్పిస్తారు.
- నాల్గవ రోజు: దేవతలను తిరిగి వనప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుంది. భక్తులు మొదట జంపన్న వాగులో స్నానం చేసి, తమను తాము శుద్ధి చేసుకున్న తర్వాతే అమ్మవార్లను దర్శించుకుంటారు. ఈ జాతర గిరిజన సంస్కృతికి, స్త్రీ శక్తికి మరియు ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా నిలుస్తోంది.
See Also plz click on this: bibi-nancharamma-real-story
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ చరిత్ర ను చూడండి.
