తమిళనాడులోని చిదంబరం గుడి కేవలం పెద్ద గోపురాలు, అద్భుతమైన శిల్ప కళలతో కూడిన కట్టడం మాత్రమే కాదు. దాని గర్భగుడిలో శతాబ్దాలుగా రాజులు, యోగులు, మోడరన్ సైంటిస్టులు కూడా చేదించాలనుకున్న ఒక రహస్యం దాగి ఉంది, అదే చిదంబర రహస్యం. ఈ రహస్యం విశ్వం పుట్టుకకి, మనిషి శరీరానికి ఉన్న షాకింగ్ కనెక్షన్ గురించి వివరిస్తుంది, ఈ ప్రదేశాన్ని విశ్వానికి కేంద్రం అని కూడా అంటారు. సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగ రూపంలో కనిపిస్తాడు, కానీ ఇక్కడ చిదంబరంలో ఆయన ఒక మనిషి రూపంలో, ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి రూపంలో వెలిశారు.
ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం, ఈ ప్రాంతం ఒకప్పుడు తిల్లైవనం అనే మంగ్రో ఫారెస్ట్. దీనికి అధిపతి ఉగ్రరూపిణి అయిన కాళికాదేవి. ఆమె తన శక్తిని నిరూపించుకోవడానికి శివుడితో ఒక నాట్య పోటీకి సిద్ధపడింది, దీనికి శ్రీ మహావిష్ణువు న్యాయ నిర్ణేతగా ఉన్నారు. ఈ పోటీలో ఎవరూ తగ్గకపోవడంతో, శివుడు ఒక ఉపాయం చేశారు: తన చెవికున్న కుండలాన్ని కింద పడేలా చేసుకున్నారు. ఆ కుండలాన్ని చేత్తో ముట్టుకోకుండా, తన ఎడమ కాలిని నెట్ట నిలువుగా తలపైకి ఆకాశం వైపుక ఎత్తి, బొటనవేలితో కుండలాన్ని అందుకొని చెవికి పెట్టుకున్నారు—ఇదే ఊర్ధ్వ తాండవం. నాట్య శాస్త్రం ప్రకారం స్త్రీలు బహిరంగంగా వేయకూడని భంగిమ అది కాబట్టి, కాళికాదేవి ఓటమిని ఒప్పుకుంది. ఆమె అహంకారం, కోపం తొలగిపోగా, శివుడు ఆ ప్రాంతానికి అధిపతిగా ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా వెలిశారు.
చిదంబరం గర్భగుడిని చిత్సభ లేదా జ్ఞానసభ అంటారు. ఇందులో రెండు రూపాలు కనిపిస్తాయి: ఒకటి బంగారంతో చేసిన నటరాజ స్వామి విగ్రహం (సాకారం). మరొకటి, ఆ విగ్రహం పక్కనే ఉన్న గోడకు వేలాడే నల్లటి తెర. నటరాజస్వామికి ఎంత మర్యాద ఇస్తారో, ఆ నల్లటి తెరకి కూడా రోజు పూజలు చేస్తారు. ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో పూజారి ఆ తెరని పక్కకు జరిపినప్పుడు, వెనక ఎటువంటి విగ్రహం, రూపం ఉండదు, కేవలం ఒక ఖాళీ ప్రదేశం మాత్రమే కనిపిస్తుంది. ఆ ఖాళీలోనే గాలిలో వేలాడుతున్న కొన్ని బంగారు బిల్వ పత్రాల మాల ఉంటుంది. ఆ శూన్యాన్నే చిదంబర రహస్యం అంటారు. ఆ ఏమీ లేని శూన్యమే ఆకాశ తత్వం—విశ్వం పుట్టి, అంతమయ్యే చోటు. “చిదంబరం” అనే పదానికి చిత్ (జ్ఞానం/కాన్షియస్నెస్) ప్లస్ అంబరం (ఆకాశం/స్కై), అంటే “చైతన్యం యొక్క ఆకాశం” అని అర్థం.
ఈ ఆలయ నిర్మాణం మనిషి శరీరానికి ఒక స్పిరిచువల్ బ్లూప్రింట్ లా కట్టారని స్థానిక సంప్రదాయం చెబుతుంది. ఆలయానికి ఉన్న తొమ్మిది ప్రవేశ ద్వారాలు మనిషి శరీరంలో ఉండే నవరంద్రాలకు గుర్తు. గర్భగుడి పైన ఉన్న కప్పు (పొన్నం బలం) మీద అమర్చిన 21,600 బంగారు పలకలు, ఒక ఆరోగ్యకరమైన మనిషి 24 గంటల్లో తీసుకునే సగటు శ్వాసల సంఖ్యకు ప్రతీక. ఈ పలకలను కలిపి ఉంచడానికి ఉపయోగించిన 72,000 బంగారు మేకులు, యోగశాస్త్రం ప్రకారం మనిషి శరీరంలో ఉండే మొత్తం నాడుల సంఖ్యకు గుర్తు. ఇంకా, అన్ని గుళ్లలో గర్భగుడి నడిబొడ్డున ఉంటే, చిదంబరంలో ఈ చిత్సభ కొంచెం ఎడమ వైపుకు జరిగి ఉంటుంది, ఇది మనిషి శరీరంలో గుండె స్థానాన్ని పోలి ఉంటుంది.
చిదంబరం ఆలయం ఐదు మహాభూతాలకు అంకితం చేయబడిన పంచభూత స్థలాల్లో ఐదవది, ఇది అత్యంత మిస్టీరియస్ అయిన ఆకాశ తత్వానికి కేంద్రం. మిగిలిన నాలుగు స్థలాల్లో దేవుడు లింగ రూపంలో కనిపిస్తే, చిదంబరంలో ఆకాశానికి రూపం ఉండదు, అందుకే తెర వెనుక శూన్యాన్ని పూజిస్తారు. అద్భుతమైన విషయం ఏమిటంటే, చిదంబరం (ఆకాశం), శ్రీకాళహస్తి (వాయువు), కాంచీపురం (పృథ్వి) ఈ మూడు పంచభూత స్థలాలు దాదాపు ఒకే లాంగిట్యూడ్ మీద (సుమారు 79° ఈస్ట్ రేఖాంశంపై) నిట్ట నిలువుగా ఒకే లైన్లో ఉన్నాయి. జిపిఎస్, సాటిలైట్లు లేని వేల ఏళ్ల క్రితం ఈ ప్రదేశాలను అంత ఖచ్చితంగా ఎలా గుర్తించారనేది మిస్టరీగా మిగిలింది.
ఆ నల్లటి తెర వెనుక దాగి ఉన్న శూన్యానికి, ఆధునిక సైన్స్ సిద్ధాంతాలకు బలమైన సంబంధం ఉంది. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం, ఈ విశ్వం మొత్తం అనంతమైన శూన్యం నుంచి పుట్టింది (ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ నథింగ్), దీన్నే మన పూర్వీకులు ఆకాశ తత్వం అని పూజించారు. మరింత షాకింగ్ విషయం ఏమిటంటే, కనిపించే విశ్వం కేవలం 5% మాత్రమే కాగా, మిగిలిన 95% డార్క్ మేటర్, డార్క్ ఎనర్జీ అనే కనిపించని, అర్థం కాని శూన్య పదార్థంతో నిండి ఉందని సైన్స్ చెబుతోంది. చిదంబరం గుడిలో నల్లటి తెర (మన అజ్ఞానానికి గుర్తు) తీయగా కనిపించే శూన్యమే ఈ 95% అల్టిమేట్ రియాలిటీకి సింబల్. నటరాజస్వామి చేసేది కేవలం నాట్యం కాదు, అది కాస్మిక్ డాన్స్—అణువుల నుంచి గెలాక్సీల వరకు ప్రతిదీ ఎలా కదులుతుందో చూపిస్తుంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం, అణువులలోని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు నిరంతరం ఒకదానితో ఒకటి కొలైడ్ అవుతూ, పుడుతూ, చనిపోతూ డాన్స్ చేస్తుంటాయి. ఇది నటరాజ తాండవం లాగే నిరంతరమైన, శాశ్వతమైన కంపనం (ఎటర్నల్ వైబ్రేషన్).
ఈ మొత్తం జ్ఞానాన్ని గుడి రూపంలో మనకు అందించిన పూర్వీకులు చెప్పాలనుకున్న అంతిమ సందేశం ఏమిటంటే—అసలైన చిదంబర రహస్యం ఎక్కడో తమిళనాడులో లేదు, అది మన గుండెలో ఉంది. ఉపనిషత్తులు చెప్పిన దహారాకాశం (హృదయం లోపలి ఆకాశం) ప్రకారం, మన గుండె లోపల ఒక చిన్న ఖాళీ ప్రదేశం ఉంటుంది, అందులోనే యావత్ విశ్వం అంతా చైతన్యం రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. నటరాజస్వామి ఆనంద తాండవం చేస్తున్నట్టుగా, ఈ కాస్మిక్ డాన్స్ మీ గుండె లోపల ఉన్న దహారాకాశంలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది—అదే మీ ప్రాణశక్తి, శ్వాస, గుండె కొట్టుకోవడం. గుడిలో పూజారి తెరను తొలగించడం మన అహంను (నేను వేరు, విశ్వం వేరు అనే అజ్ఞానం) పక్కన పెట్టి, మన లోపల ఉన్న అనంతమైన చైతన్యాన్ని చూడడమే. ఆ క్షణంలో నువ్వు, నటరాజు, ఆ శూన్యం వేరు వేరు కాదు, అన్నీ ఒకటే. ఆ సత్యమే “తత్ త్వం అసి” (నువ్వే అది) అని చిదంబరం గుడి నిర్మాణ లక్ష్యం మనకు గుర్తుచేస్తుంది.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ చరిత్ర ను చూడండి.
