Kamakhya Temple Secrets

కామాఖ్య దేవి ఆలయ రహస్యాలు మరియు చరిత్ర: శాస్త్రవేత్తలకే అందని అద్భుత శక్తిపీఠం

by Lakshmi Guradasi

భారతదేశంలో యుగయుగాల నాటి దివ్యమైన చరిత్ర, మానవ మేధస్సుకు అందని ఆధ్యాత్మిక రహస్యాలు కలిగిన అత్యంత శక్తివంతమైన క్షేత్రాలలో కామాఖ్యా దేవి ఆలయం ప్రథమ వరుసలో నిలుస్తుంది. అస్సాం రాష్ట్రంలోని గౌహతి నగరానికి సమీపంలో ఉన్న నీలాచల పర్వతంపై కొలువైన ఈ దివ్య ధామం, ప్రసిద్ధ అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా విరాజిల్లుతోంది.

సాధారణంగా దేవాలయాలలో దేవతల విగ్రహాలు ఉంటాయి, కానీ ఈ విచిత్ర క్షేత్రంలో ఎలాంటి విగ్రహం ఉండదు. అయినప్పటికీ ఇక్కడ నిత్యం విశేష పూజలు నిర్వహించబడతాయి. ఆధునిక శాస్త్రవేత్తలకు కూడా ఛేదనకాని ఎన్నో మర్మాలకు, అఘోర-తాంత్రిక సాధనలకు ఈ ఆలయం మూలస్థానంగా భాసిల్లుతోంది. లోకరీతికి భిన్నంగా, సాక్షాత్తు ఆ జగన్మాతకే ప్రతి సంవత్సరం ఋతుస్రావం (Period) కావడం, ఆ సమయంలో జరిగే అద్భుత సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. అసలు ఈ పవిత్ర శక్తిపీఠం ఎలా ఆవిర్భవించింది? దాని వెనుక ఉన్న పౌరాణిక కథనాలు, యుగయుగాల రహస్యాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కామాఖ్య ఆలయ విశిష్టత & నమ్మలేని వింతలు

భారతదేశంలోని అనేక ప్రాచీన క్షేత్రాల్లో దేవతా మూర్తుల విగ్రహాలను ఆరాధించడం ఆనవాయితీ. అయితే అస్సాంలోని నీలాచల పర్వతంపై కొలువైన కామాఖ్యా దేవి ఆలయం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైనది మరియు అనేక నమ్మలేని వింతలకు నిలయం.

విగ్రహం లేని గర్భగుడి – యోని పీఠారాధన

సాధారణంగా ఆలయాల గర్భగుడిలో రాతితో లేదా లోహంతో చేసిన విగ్రహాలు ఉంటాయి, కానీ కామాఖ్యా దేవి ఆలయంలో ఎలాంటి విగ్రహం ఉండదు. దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత, పరమేశ్వరుడు ఆమె శరీరాన్ని మోస్తూ ప్రళయ తాండవం చేయగా, శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండించాడు. అలా సతీదేవి శరీర భాగాలు పడిన 51 ప్రదేశాలు శక్తిపీఠాలుగా మారాయి. అందులో అతి ముఖ్యమైన 18 స్థానాలను అష్టాదశ శక్తి పీఠాలుగా పిలుస్తారు.

సతీదేవి యోని భాగం పూర్వకల్పంలో బ్రహ్మదేవుడు నిర్మించిన యోని మండలం ఉన్న నీలాచల పర్వతంపై పడటంతో, ఈ క్షేత్రం సృష్టికి మూలకేంద్రమైన పవిత్ర యోని పీఠంగా అవతరించింది. ఇక్కడ గర్భగుడిలో సహజసిద్ధమైన ఊట నీటితో ప్రవహించే రాతి యోని పీఠాన్నే పరాశక్తి రూపంగా భావించి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అమ్మవారి ఉత్సవాలు – ప్రతి సంవత్సరం ఋతుస్రావం రహస్యం

హిందూ సాంప్రదాయాల ప్రకారం సాధారణంగా స్త్రీలు ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్లరు. కానీ ఈ పవిత్ర క్షేత్రంలో సాక్షాత్తు ఆ జగన్మాతకే ప్రతి సంవత్సరం జూన్ మాసంలో మూడు రోజుల పాటు ఋతుస్రావం (ప్రీరియడ్స్) అవుతుంది.

అమ్మవారు ఋతుక్రమంలో ఉన్న ఈ మూడు రోజులు ఆలయ గర్భగుడి తలుపులను పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఆలయ పూజారులు సైతం లోపలికి ప్రవేశించరు. మూడు రోజుల అనంతరం ఆలయం తలుపులు తెరిచి అత్యంత వైభవంగా ‘అంబుబాచి మేళా’ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వార్షిక వేడుకల సమయంలో దేశవ్యాప్తం నుంచి వేలాది మంది యోగులు, సిద్ధులు, అఘోరాలు మరియు తాంత్రికులు ఈ క్షేత్రానికి చేరుకుని అమ్మవారిని ఉపాసిస్తారు.

ఎర్రగా మారే బ్రహ్మపుత్ర నది నీళ్లు – రక్త వస్త్ర ప్రసాదం

అమ్మవారు ఋతుక్రమంలో ఉన్న ఆ మూడు రోజులలో మరో ఆశ్చర్యకరమైన వింత జరుగుతుంది. ఆలయం పక్కనే ప్రవహించే బ్రహ్మపుత్ర నది నీరు విచిత్రంగా ఎర్రగా మారుతుంది. అమ్మవారి దివ్య ఋతుస్రావం నీటిలో కలవడం వల్లే ఈ నది నీరు ఎర్రగా మారుతుందని ఇక్కడి భక్తులు ఎంతో భక్తితో విశ్వసిస్తారు.

అంతేకాకుండా, ఋతుస్రావ సమయానికి ముందు ఆలయ తలుపులు మూసివేసేటప్పుడు, భక్తులు అమ్మవారి యోని పీఠంపై తెల్లటి వస్త్రాలను కప్పుతారు. మూడు రోజుల తర్వాత ఆలయం తెరిచి చూసేసరికి ఆ తెల్లని వస్త్రాలు ఎర్రగా మారి ఉంటాయి. పూజారులు ఆ వస్త్రాలను ఆలయం ఎదుట ఉన్న పార్వతీ కుండంలో ఉతికి ఆరబెడతారు. అత్యంత మహిమాన్వితమైన ఈ ‘రక్త వస్త్ర ప్రసాదం’ కోసం భక్తులు, సాధకులు వేలం పాటల్లో తీవ్రంగా పోటీ పడతారు.

కామాఖ్య ఆలయం వెనుక ఉన్న పౌరాణిక నేపథ్యం

ఈ పవిత్ర శక్తిపీఠం ఆవిర్భావం వెనుక ఎంతో లోతైన, అద్భుతమైన పౌరాణిక కథనాలు ఉన్నాయి. యుగయుగాల నాటి ఈ క్షేత్ర చరిత్ర బ్రహ్మదేవుని సృష్టి కాలం నుండి ప్రారంభమవుతుంది.

బ్రహ్మదేవుని అహంకారం మరియు నీలాచల పర్వత ఆవిర్భావం

సృష్టి ఆరంభంలో సమస్త చరాచర జగత్తును రచిస్తున్న సమయంలో, బ్రహ్మదేవుడికి తన శక్తుల పట్ల తీవ్రమైన అహంకారం ఏర్పడింది. ఈ సృష్టిలో నేనే అత్యంత గొప్పవాడిని, అంతా నేనే సృష్టించాననే గర్వంతో ఉన్న బ్రహ్మదేవునికి గుణపాఠం చెప్పాలని కాళికాదేవి భావించింది.

ఆ దేవి తన మాయాశక్తితో ‘కేసి’ అనే రాక్షసుడిని సృష్టించి బ్రహ్మదేవుడిని అంతం చేయమని ఆదేశించింది. రాక్షసుడి దాడికి భయపడిన బ్రహ్మదేవుడు, శ్రీమహావిష్ణువుతో కలిసి కాళికాదేవిని శరణువేడగా, అమ్మవారు తన కంటిచూపుతోనే ఆ రాక్షసుడిని భస్మం చేసింది. తన తప్పు తెలుసుకున్న బ్రహ్మదేవుడు ప్రాయశ్చిత్తం అడుగగా, హిమాలయ పర్వత సానువుల్లో ఒక పర్వతాన్ని నిర్మించి, దానిపై సృష్టికి మూలకేంద్రంగా ఉండేలా ఒక ‘యోని మండలాన్ని’, ఎప్పటికీ ఆగకుండా ప్రవహించే జలధారని స్థాపించమని కాళికాదేవి ఆదేశించింది. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు నిర్మించిన ఆ పర్వతమే నీలాచల పర్వతం, ఆ దివ్య క్షేత్రమే ప్రాగ్జ్యోతిష్యపురంగా ప్రసిద్ధి చెందింది.

సతీదేవి దేహ త్యాగం – అష్టాదశ శక్తి పీఠం ఆవిర్భావం

కాలక్రమంలో దక్ష ప్రజాపతి శివునిపై ఉన్న ద్వేషంతో నిర్వహించిన యజ్ఞానికి, పిలవని పేరంటంగా వెళ్లిన సతీదేవి అక్కడ తీవ్ర అవమానానికి గురైంది. నాథునికి జరిగిన పరాభవాన్ని తట్టుకోలేక సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని సజీవ దహనం చేసుకుంది. ఈ వార్త తెలిసిన పరమేశ్వరుడు తీవ్ర కోపోద్రేకంతో సతీదేవి పార్థివ దేహాన్ని భుజాలపై వేసుకుని ప్రళయ తాండవం చేయగా ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి.

లోకరక్షణ కోసం శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండించగా, ఆమె శరీర భాగాలు పడిన 51 ప్రదేశాలు శక్తిపీఠాలుగా మారాయి. అందులో అతి ముఖ్యమైన 18 స్థానాలను అష్టాదశ శక్తి పీఠాలుగా పూజిస్తారు. అలా దేవి దేహం ఖండించబడినప్పుడు, ఆమె పవిత్రమైన యోని భాగం పూర్వంలో బ్రహ్మదేవుడు నిర్మించిన యోని మండలం ఉన్న నీలాచల పర్వతంపై పడటంతో ఇది అత్యంత శక్తివంతమైన కామాఖ్య శక్తిపీఠంగా ఆవిర్భవించింది.

మన్మధుడు-రతీదేవి తపస్సు – ‘కామరూప’ నామకరణం

సతీదేవి వియోగంతో పరమేశ్వరుడు ఘోర వైరాగ్యంలోకి వెళ్లి తపస్సులో మునిగిపోయాడు. ఆ సమయంలో తారకాసురుని సంహారం కోసం శివుని తపోభంగం చేయడానికి దేవతలు మన్మధుడిని పంపారు. మన్మధుడు ప్రయోగించిన బాణాల వల్ల పరమేశ్వరునికి తపోభంగం కలిగి, ఆగ్రహంతో మూడో కన్ను తెరవడంతో మన్మధుడు భస్మైపోయాడు.

భర్త మరణంతో శోకసంద్రంలో మునిగిన రతీదేవిని చూసి జాలిపడిన ఈశ్వరుడు, నీలాచల పర్వతంపై ఉన్న యోని పీఠం వద్ద అమ్మవారిని ఉపాసిస్తే మన్మధుడికి తిరిగి రూపం వస్తుందని చెప్పాడు. రతీదేవి ఇక్కడ వందల సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమై మన్మధుడికి పునర్జన్మ మరియు రూప సిద్ధులను ప్రసాదించింది.

కాముడు (మన్మధుడు) ఇక్కడ తిరిగి రూపం పొందడం వల్ల ఈ ప్రాంతానికి ‘కామరూప’ అని, రతీదేవి మనసులోని కామాన్ని (కోరికను) తీర్చడం వల్ల అమ్మవారికి ‘కామాఖ్యా దేవి’ అని నామకరణం జరిగింది. అనంతరం మన్మధుడు దేవశిల్పి విశ్వకర్మ సహాయంతో ఇక్కడ అమ్మవారికి తొలిసారిగా దివ్యమైన ఆలయాన్ని నిర్మించాడు.

నరకాసురుడు – కామాఖ్య దేవి మెట్ల రహస్యం

వరాహ స్వామి, భూదేవిల సంతానంగా నరకాసురుడి జననం

శ్రీమహావిష్ణువు హిరణ్యాక్షుడిని వధించి భూమండలాన్ని సముద్ర గర్భం నుండి రక్షించడానికి వరాహ అవతారాన్ని ధరించాడు. స్వామివారి పరాక్రమానికి ముగ్ధురాలైన భూదేవి ఆయనను భర్తగా స్వీకరించింది. అయితే, భూదేవి రజస్వలగా ఉన్న సమయంలో, ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తూ అసుర సంధ్యవేళ వరాహ స్వామిని సంగమించమని కోరింది. నిషిద్ధ సమయంలో వారి సంగమం జరగడం వల్ల రాక్షస లక్షణాలు కలిగిన వికృత రూపంతో నరకాసురుడు జన్మించాడు.

తన కుమారుడి వికృత రూపాన్ని చూసి దుఃఖించిన భూదేవి, తన బిడ్డను సంహరించవద్దని వరాహ స్వామిని వేడుకోగా, ఆయన “నా చేతులతో నేను చంపను, కానీ కాలక్రమేణా నీ చేతుల మీదుగానే ఇతని అంతం జరుగుతుంది” అని విచిత్రమైన మాట ఇచ్చాడు. ఆ తరువాత భూదేవి నరకాసురుడిని మిథిలాధిపతి జనక మహారాజు వద్దకు తీసుకువెళ్లి సకల విద్యలు, ధర్మాలను నేర్పించి గొప్ప వీరుడిగా తీర్చిదిద్దింది. నరకాసురుడు పెద్దయ్యాక, వరాహ స్వామి సూచన మేరకు ప్రాగ్జ్యోతిష్యపురానికి (నీలాచల పర్వతం) వెళ్లి అక్కడ ఉన్న కామాఖ్య యోని పీఠాన్ని మాతృసమానంగా పూజిస్తూ ధర్మబద్ధంగా పాలన సాగించాడు. అక్కడ మన్మధుడు నిర్మించి కాలక్రమంలో నశించిపోయిన ఆలయ స్థానంలో నరకాసురుడు రెండవసారి భవ్యమైన ఆలయాన్ని నిర్మించి అమ్మవారికి పరమ భక్తుడిగా మారాడు.

కామాఖ్య దేవిని వివాహం చేసుకోవాలనే నరకాసురుడి కామం

యుగాలు మారి ద్వాపర యుగం ప్రారంభమయ్యేసరికి, నరకాసురుడిలో స్వతహాగా ఉన్న రాక్షస బీజాలు మొలకెత్తడం ప్రారంభమయ్యాయి. అదే సమయంలో శోనితాపుర పాలకుడైన బాణాసురుడు అనే క్రూర రాక్షసుడితో నరకాసురుడికి మైత్రి ఏర్పడింది. స్త్రీలను భోగ వస్తువుగా భావించే బాణాసురుడు నరకాసురుడి బుద్ధిని పూర్తిగా మార్చివేశాడు. “నువ్వు పూజించే కామాఖ్య దేవి ఒక అందమైన స్త్రీ, ఆమెను పూజించడం కాదు, కామించు” అని బాణాసురుడు నరకాసురుడిలో కామాగ్నిని రగిలించాడు.

బాణాసురుడి విషపు మాటలకు లోనైన నరకాసురుడు అమ్మవారి పూజలు మానివేసి, కామాంధకారంతో కామాఖ్యా దేవిని వివాహం చేసుకోవాలని ఎన్నో వేల సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. నరకాసురుడి తపస్సుకు ప్రసన్నురాలై అమ్మవారు ప్రత్యక్షమవ్వగా, తనను వివాహం చేసుకోవాలని కోరాడు. అమ్మవారు “నువ్వు నా కుమారుడిలాంటివాడివి, నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు” అని వారించినా నరకాసురుడు వినకపోవడంతో దేవి అతనికొక పరీక్ష పెట్టాలని నిర్ణయించింది.

ఒకే రాత్రిలో మెట్ల నిర్మాణం – అమ్మవారి కోడిపుంజు మాయ

కామాఖ్యా దేవి నరకాసురుడితో, “రేపు సూర్యోదయం లోగా నీలాచల పర్వతంపై ఉన్న నా ఆలయానికి రాతి మెట్ల దారిని నిర్మించగలిగితే నిన్ను వివాహం చేసుకుంటాను” అని నిబంధన విధించింది.

ఆ నిబంధనకు అంగీకరించిన నరకాసురుడు వెంటనే వేలాది మంది శిల్పులను రప్పించి, ఒకే రాత్రిలో ఆలయానికి రాతి మెట్లను శరవేగంగా నిర్మించడం ప్రారంభించాడు. తెల్లవారేసరికి మెట్ల నిర్మాణం దాదాపు పూర్తయి, కేవలం కొన్ని మెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. నరకాసురుడు గెలిచేలా ఉన్నాడని గ్రహించిన కామాఖ్యా దేవి తన దివ్య మాయాశక్తితో ఒక కోడిపుంజును సృష్టించి, సమయం కాకముందే దాన్ని కూయించింది. కోడిపుంజు కూత విన్న నరకాసురుడు సూర్యోదయం అయిపోయిందని భావించి విచారంతో మెట్ల నిర్మాణాన్ని అక్కడితోనే నిలిపివేసి వెనుదిరిగాడు.

వశిష్ట మహర్షి శాపం & ఆలయం అదృశ్యం కావడం

అదే సమయంలో బ్రహ్మర్షి అయిన వశిష్ట మహర్షి కామాఖ్యా దేవిని దర్శించుకోవడానికి నీలాచల పర్వతానికి వచ్చాడు. కానీ అప్పటికే అహంకారంతో, కామాంధకారంతో మదమెక్కిన నరకాసురుడు వశిష్ట మహర్షిని తీవ్రంగా అవమానించి, అమ్మవారి ఆలయంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నాడు.

నరకాసురుడి ప్రవర్తనకు తీవ్ర ఆగ్రహం చెందిన వశిష్ట మహర్షి, “ఓరి దుష్టుడా! మదాంధకారంతో బ్రహ్మర్షినే అవమానిస్తావా? ఏ జగన్మాతను కించపరిచావో ఆ దేవి రూపంలోనే నీ పతనం ప్రారంభమై, నీ కన్న తల్లి చేతిలోనే నీకు మరణం సంభవిస్తుంది” అని శపించాడు. అంతేకాకుండా, “నీ పాపపు అడుగులు పడిన ఈ పవిత్ర యోని పీఠం ఇకపై ఎవరికీ కనిపించకుండా భూమిలోకి అదృశ్యమైపోవుగాక! నీవు నశించి ఈ నేల పాపవిముక్తి అయ్యేంతవరకు నేను మళ్లీ ఇక్కడ అడుగుపెట్టను” అని శాపం ఇచ్చాడు.

వశిష్ట మహర్షి శాపం కారణంగా కామాఖ్య శక్తిపీఠం భూమిలోకి అదృశ్యమైపోయి దట్టమైన అరణ్యంగా మారిపోయింది. ఆ తరువాత ద్వాపర యుగంలో భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలో నరకాసురుడు సంహరించబడ్డాడు.

ఆలయ పునర్నిర్మాణం & రాజులకు తగిలిన శాపం

నరకాసురుడి సంహారం మరియు వశిష్ట మహర్షి శాపం తరువాత, కామాఖ్య శక్తిపీఠం దట్టమైన అరణ్యంలో అదృశ్యమైపోయి ఎన్నో వేల సంవత్సరాల పాటు అవ్యక్తంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత 16వ శతాబ్దంలో కోచ్ రాజవంశ కాలంలో ఈ పవిత్ర క్షేత్రం తిరిగి వెలుగులోకి వచ్చింది.

విశ్వసింహ మహారాజు అడవిలో పొందిన అద్భుత తీర్థం

సా.శ. 1520 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని కోచ్ రాజవంశానికి చెందిన విశ్వసింహుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఒకసారి కోచ్ సైన్యానికి, అహోం సైన్యానికి మధ్య భీకరమైన యుద్ధం జరగ్గా, అహోం సైన్య దాటికి తాళలేక కోచ్ సైనికులు చెల్లాచెదురయ్యారు. యుద్ధంలో తీవ్రంగా అలసిపోయిన విశ్వసింహుడు మరియు అతని తమ్ముడు శివసింహుడు చిమ్మచీకట్లో దారి తెలియక నీలాచల పర్వతంపై ఉన్న కీకారణ్యంలోకి చేరుకున్నారు.

తీవ్రమైన దాహంతో అల్లాడుతున్న ఆ సోదరులకు అడవిలో ఒక దివ్యమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగును అనుసరిస్తూ వెళ్లగా, అక్కడ జటలు కట్టిన జుట్టుతో, దివ్యకాంతితో ఒక వృద్ధురాలు యోని పీఠానికి పూజ చేస్తూ కనిపించింది. దాహంతో పడిపోయిన ఆ రాజులకు ఆమె యోని పీఠం నుండి ప్రవహిస్తున్న పవిత్ర తీర్థాన్ని ఇచ్చింది. ఆ తీర్థాన్ని తాగిన మరుక్షణమే రాజులకు అపరిమితమైన శక్తి వచ్చి అలసట మొత్తం మాయమైపోయింది. ఆ వృద్ధురాలి ద్వారా అది కామాఖ్యా దేవి శక్తిపీఠమని తెలుసుకున్న విశ్వసింహుడు, తన సైన్యం తిరిగి వచ్చి యుద్ధంలో గెలిస్తే ఇక్కడ భవ్యమైన ఆలయాన్ని నిర్మిస్తానని అమ్మవారికి మొక్కుకున్నాడు. అమ్మవారి కృపతో సైన్యం తిరిగి రావడమే కాక యుద్ధంలో విజయం లభించడంతో, విశ్వసింహ మహారాజు ఇక్కడ మూడవసారి ఆలయాన్ని నిర్మించాడు.

నరనారాయణ రాజు ఆలయ నిర్మాణం

విశ్వసింహ మహారాజు మరణానంతరం ఆయన కుమారుడైన నరనారాయణుడు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇతడు కామాఖ్యా దేవికి పరమ భక్తుడు. అయితే, నరనారాయణ రాజు రాజ్యంలో లేని సమయంలో ‘కాలాపహాడ్’ అనే దండయాత్రకారుడు తన సైన్యంతో వచ్చి కామాఖ్య ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు.

తన ఆరాధ్య దైవ ఆలయం ధ్వంసమైందని తెలుసుకున్న నరనారాయణ రాజు, సా.శ. 1565లో కామాఖ్య ఆలయాన్ని అత్యంత సుందరంగా తిరిగి పునర్నిర్మించాడు. ఆలయ ప్రతిష్ఠాపన సమయంలో అమ్మవారికి లక్ష మేకలను బలి ఇచ్చాడని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఆలయ నిర్మాణం నరనారాయణ రాజు నిర్మించినదే.

పూజారి కేందుకలై రహస్యం – అమ్మవారి దివ్య నాట్యం

నరనారాయణ రాజు అమ్మవారి పూజల కోసం వామాచార పద్ధతిలో నిష్ణాతుడైన కేందుకలై అనే గొప్ప సాధకుడిని ప్రధాన పూజారిగా నియమించాడు. ప్రతిరోజు అర్ధరాత్రి వేళ గర్భగుడి తలుపులు మూసుకున్నాక ఒక అద్భుతం జరిగేది. పూజారి కేందుకలై భక్తిశ్రద్ధలతో హారతి ఇస్తూ పాట పాడుతుంటే, సాక్షాత్తు కామాఖ్యా దేవి ప్రత్యక్షమై పరవశంతో నాట్యం చేసేది.

అయితే “ఈ దివ్య రహస్యాన్ని ఎవరికీ వెల్లడించకూడదు” అని అమ్మవారు కేందుకలైని ఆదేశించింది. కానీ, ఆనందం పట్టలేక కేందుకలై ఈ రహస్యాన్ని తన కుమారుడికి చెప్పడం, ఆ వార్త కాస్తా నరనారాయణ రాజు చెవిన పడటం జరిగింది. అమ్మవారి దివ్య నాట్యాన్ని ఎలాగైనా చూడాలని రాజు తపించిపోయి, పూజారిని అర్ధించాడు. రాజు కోరికను కాదనలేక కేందుకలై గర్భగుడి గోడకు ఒక చిన్న రంధ్రం చేసి, దాని ద్వారా దొంగచాటుగా చూడమని రాజుకు చెప్పాడు.

రాజవంశానికి అమ్మవారి శాపం – గుడిని చూడకూడదనే నియమం

ఒకరోజు రాత్రి కేందుకలై పాడుతుండగా అమ్మవారు నాట్యం చేస్తుండగా, గోడ రంధ్రం గుండా నరనారాయణ రాజు చూడటాన్ని దేవి గమనించింది. దైవ రహస్యాన్ని బయటపెట్టినందుకు తీవ్ర ఆగ్రహానికి గురైన కామాఖ్యా దేవి, పూజారి కేందుకలై శిరచ్ఛేదం చేసి సంహరించింది.

అనంతరం దొంగచాటుగా చూసిన నరనారాయణ రాజు వైపు కోపంతో చూస్తూ – “నీచుడా! కుటిల పన్నాగంతో దైవ రహస్యాన్ని దొంగచాటుగా చూస్తావా? ఈ క్షణం నుండి నువ్వు గానీ, నీ కోచ్ రాజవంశానికి చెందిన వారు గానీ ఈ ఆలయంలోకి అడుగుపెట్టినా, లేదా కనీసం ఆలయాన్ని తలెత్తి చూసినా మీ వంశం అక్కడికక్కడే నాశనమవుతుంది” అని ఘోరమైన శాపం ఇచ్చింది.

అమ్మవారి శాపభయం వల్ల నేటికీ కోచ్ రాజవంశీకులు ఎవ్వరూ కామాఖ్య ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టరు, కనీసం ఆలయం వైపు తలెత్తి కూడా చూడరు. విశేషమేమిటంటే, ఇప్పటికీ ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు కోచ్ రాజవంశానికి చెందిన ట్రస్ట్ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి.

తాంత్రిక పూజలు & దశమహావిద్యల ఆరాధన

వామాచార పద్ధతి & అఘోర తాంత్రికుల సాధన

కామాఖ్య దేవి ఆలయం సమస్త అఘోర, తాంత్రిక, మాంత్రిక పూజలు మరియు సాధనలకు ప్రధాన మూలస్థానంగా భాసిల్లుతోంది. ఈ పవిత్ర క్షేత్రంలో దేవికి నిర్వహించే ఆరాధనా క్రమం సాధారణ దేవాలయాల కంటే పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ అమ్మవారి పూజలు సంప్రదాయ వేద మంత్రాలతో కాకుండా, పూర్తిగా తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన ‘వామాచార పద్ధతి’ లో మాత్రమే జరుగుతాయి.

ప్రతి సంవత్సరం నిర్వహించే అంబుబాచి మేళా సమయంలో దేశంలోని నలుమూలల నుండి ఎంతో మంది యోగులు, సిద్ధులు, అఘోరాలు మరియు తాంత్రికులు ఈ నీలాచల పర్వతానికి తరలివస్తారు. ఆ సమయంలో వారు ఈ పవిత్ర క్షేత్రంలో ఉండి, అమ్మవారి దివ్య కృప మరియు తాంత్రిక సిద్ధులను పొందేందుకు అత్యంత గూఢమైన వామాచార సాధనలను, తంత్ర పూజలను నిర్వహిస్తారు.

ఆలయంలో ఉండే దశమహావిద్యల దేవాలయాలు

తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే దశమహావిద్యలకు కామాఖ్య క్షేత్రంతో విడదీయరాని ప్రత్యేక సంబంధం ఉంది.

సాధారణంగా దేశంలోని ఏ ఇతర శక్తిపీఠంలోనూ కనిపించని ఒక విశేషం ఈ క్షేత్రంలో ఉంది. కామాఖ్యా దేవి ఆలయ ప్రాంగణంలోనే దశమహావిద్యలకు సంబంధించిన ప్రత్యేక దేవాలయాలు కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అందుకే తంత్ర సాధన చేసే సాధకులు తమ ఉపాసన ఫలవంతం కావడానికి ఈ దశమహావిద్యల ఆలయాలను దర్శించుకుని అమ్మవారిని ఆరాధిస్తుంటారు.

కామాఖ్య ఆలయ దర్శనం మార్గదర్శి (Travel Guide)

ఆలయానికి ఎలా చేరుకోవాలి? (గౌహతి, అస్సాం)

కామాఖ్య దేవి శక్తిపీఠం అస్సాం రాష్ట్రంలోని ప్రధాన నగరమైన గౌహతికి సమీపంలో ఉన్న పవిత్రమైన నీలాచల పర్వతంపై కొలువుదీరి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి చేరుకోవడానికి రవాణా మార్గాలు:

  • విమాన మార్గం (Air): గౌహతిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బొర్దొలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ (GAU) నుండి కామాఖ్య ఆలయం సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానాశ్రయం నుండి టాక్సీ లేదా క్యాబ్ ద్వారా నీలాచల పర్వతంపై ఉన్న ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.
  • రైలు మార్గం (Rail): ఆలయానికి అతిసమీపంలో ‘కామాఖ్య రైల్వే స్టేషన్’ (KYQ) (సుమారు 3 కి.మీ) ఉంది. అలాగే ప్రధానమైన ‘గౌహతి జంక్షన్’ (GHY) నుండి ఆలయం సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేశంలోని అన్ని ముఖ్య నగరాల నుండి గౌహతికి ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
  • రోడ్డు మార్గం (Road): గౌహతి సెంట్రల్ బస్ స్టాండ్ నుండి నీలాచల పర్వతం పైకి నిరంతరం అస్సాం టూరిజం బస్సులు, టాక్సీలు మరియు ఆటోలు అందుబాటులో ఉంటాయి.

దర్శనం వేళలు, అంబుబాచి మేళా సమయం

  • సాధారణ దర్శనం వేళలు: ఆలయం ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంటుంది. (విశేష రోజుల్లో వేళల్లో మార్పులు ఉండవచ్చు).
  • అమ్మవారి ఋతుక్రమం & ఆలయం మూసివేత: ప్రతి సంవత్సరం జూన్ మాసంలో (ఆషాఢ మాసంలో) అమ్మవారి వార్షిక ఋతుస్రావం జరిగే మూడు రోజుల పాటు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. ఈ సమయంలో పూజారులకు కూడా గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు.
  • అంబుబాచి మేళా ఆరంభం: మూడు రోజుల అనంతరం నాలుగో రోజున ఆలయం తలుపులు తెరిచి అత్యంత వైభవంగా ‘అంబుబాచి మేళా’ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో అమ్మవారి పవిత్ర ‘రక్త వస్త్ర ప్రసాదం’ పొందేందుకు మరియు దర్శనం కోసం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు, సాధకులు, అఘోరాలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

Read also: guwahati kamakhya temple full details

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. కామాఖ్య దేవి ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు?

సతీదేవి పవిత్ర యోని భాగం ఇక్కడ పడటం వల్ల విగ్రహం లేకుండా సహజ ఊట నీటితో ప్రవహించే రాతి యోని పీఠాన్నే ఆరాధిస్తారు.

2. ‘అంబుబాచి మేళా’ ఎప్పుడు జరుగుతుంది? దీని ప్రత్యేకత ఏమిటి?

అమ్మవారి వార్షిక ఋతుస్రావ సమయం ముగిసిన తర్వాత నిర్వహించే ఈ అంబుబాచి మేళా తాంత్రిక, సాధన సిద్ధులకు అత్యంత ప్రసిద్ధి చెందినది.

3. అమ్మవారి ఋతుస్రావ సమయంలో బ్రహ్మపుత్ర నది నీరు ఎందుకు ఎర్రగా మారుతుంది?

అమ్మవారి దివ్య ఋతుస్రావ జలాలు నదిలో కలవడం వల్లే బ్రహ్మపుత్ర నది నీరు ఎర్రగా మారుతుందని భక్తులు విశ్వసిస్తారు.

4. కామాఖ్య ఆలయంలో ఇచ్చే ‘రక్త వస్త్ర ప్రసాదం’ అంటే ఏమిటి?

ఋతుస్రావ సమయంలో యోని పీఠంపై కప్పిన తెల్లటి వస్త్రం ఎర్రగా మారిన పిమ్మట, దానిని పార్వతీ కుండంలో ఉతికి ప్రసాదంగా అందిస్తారు.

5. కోచ్ రాజవంశీకులు కామాఖ్య ఆలయాన్ని ఎందుకు దర్శించుకోరు?

అమ్మవారి దివ్య నాట్యాన్ని రాజు దొంగచాటుగా చూసినందుకు, ఆయన వంశీకులు గుడిని చూసినా లేదా అడుగుపెట్టినా నాశనమవుతారని దేవి శపించింది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ ఫ్యాక్ట్స్ ను చూడండి.

You may also like