ఒకానొకరోజు అడువిలో ఒంటరిగా విహరిస్తున్న ఓ జిత్తులమారి నక్కకు చాలా ఆకలేసింది. ఆహారం కోసం అడవి మొత్తం గాలించసాగింది. ఇలా వెతుకుతుండగానే చెట్టు మీద నాట్యం చేస్తున్న ఓ అందమైన నెమలి కనిపించింది. ఏదో విధంగా ఆ జిత్తులమారి నక్క మెల్లగా నెమలి నాట్యం చేస్తున్న చెట్టు దగ్గరకు వెళ్లి “మీత్రమా! నీకు ఈ వార్త తెలుసా? ఇకపై అన్ని జంతువులు కలిసిమెలిసి ఉండాలని మృగరాజు ఆదేశించారట. ఇతర జంతువులను చంపి తినడం నిషేధించిందట. ఇక నుంచి మనం స్నేహితులం. చెట్టుపై నుంచి కిందకు రా! కలిసి ఆడుకుందాం” అని అంది.
ఆ నక్క దుష్టపన్నాగం అర్థమైన నెమలి “అవును, ఆ సందేశం నాకు కూడా చేరింది” అని చెబుతూ లోలోపల ఎలాగైనా నక్కబారి నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉండగా, ఇంతలోనే “మరి ఇంకేంటి కిందకి రా! కలిసి ఆడుకుందాం” అని నక్క పిలిచింది. “అదిగో అటువైపు నుంచి మీ స్నేహితులు ఇటే వస్తున్నారు. వాళ్లను కూడా రానివ్వు.. అందరం కలిసి ఆడుకుందాం” అని సమాధానమిచ్చింది నెమలి.
దానికి “అటువైపు నుంచి వచ్చేస్నేహితులు నాకెవరూ లేరే! ఇంతకి ఎవరు వస్తున్నారు?” అని అడిగింది నక్క. అప్పుడు “మృగరాజు, దాని స్నేహితులు అయిన పులులు” అని చెప్పింది నెమలి. సింహం, పులుల పెర్లు వినగానే హడాలెత్తిపోయిన నక్క వణకడం మొదలెట్టింది. “అలా వణికిపోతున్నావేంటి” అని వెటకారంగా అడిగింది నెమలి. ఏం చెప్పాలో అర్థం కాని జిత్తులమారి నక్క భయంతో ముందువెనకా ఆలోచించకుండా అక్కడి నుంచి పారిపోయింది. చావు నుంచి తప్పించుకున్న నెమలి ఊపిరి పీల్చుకుంది.
నీతి: జిత్తులమారి బుద్ధి ఉన్నవారు ఉన్నట్లుండి మంచిగా మాట్లాడితే…అనుమానించాలి. లేకపోతే మనకే ప్రమదం.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ నీతి కథలు ను సందర్శించండి.