Home » అతి పెద్ద హిందూ దేవాలయం అంకోర్ వాట్, ఎలా బౌద్ధ క్షేత్రంగా మారింది? | Angkor Wat History & Architecture Mysteries

అతి పెద్ద హిందూ దేవాలయం అంకోర్ వాట్, ఎలా బౌద్ధ క్షేత్రంగా మారింది? | Angkor Wat History & Architecture Mysteries

by Lakshmi Guradasi
543 views
Angkor wat history architecture mysteries

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయమైన అంకోర్ వాట్ (Angkor Wat) కంబోడియాలో ఉంది. భారతదేశం నుండి కంబోడియా దాదాపు 2600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అద్భుతమైన దేవాలయం వెనుక దాగి ఉన్న చరిత్ర, నిర్మాణ విశేషాలు, మరియు అది ఒకప్పుడు హిందూ దేవాలయమై ఉండి, ప్రస్తుతం బౌద్ధ దేవాలయంగా మారడానికి గల కారణాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి.

కంబోడియాలో హిందూ దేవాలయం ఎందుకు?

ప్రస్తుతం కంబోడియాలో బుద్ధిస్టులు అధికంగా నివసిస్తున్నప్పటికీ, అక్కడ ఒక హిందూ దేవాలయం ఉండటం చాలా మందిలో సందేహాన్ని రేకెత్తిస్తుంది. నిజానికి, ఒకప్పుడు ఖైమర్ సామ్రాజ్యం ఉన్నప్పుడు, అక్కడ హిందూ మతమే ప్రబలంగా ఉండేది. ప్రజలు విష్ణుమూర్తిని, మహాశివుడిని ఎక్కువగా పూజించేవారు. మన రామాయణం కూడా అక్కడ “రేంకర్” అనే పేరుతో ప్రచారంలో ఉండేది. అయితే, 12వ శతాబ్దం పూర్తవుతున్న సమయంలో, ఖైమర్ రాజ్యంలో బుద్ధిజం విస్తరించడం మొదలైంది. దీనికి ప్రధాన కారణం కింగ్ జయవర్మన్ సెవెన్. ఆయనకు హిందూ మతం పెద్దగా నచ్చేది కాదు, అందుకే బుద్ధిజంలోకి మారాడు. ఆయనే కాకుండా, ప్రజలను కూడా బుద్ధిజంలోకి మారేలా ప్రోత్సహించాడు. ఫలితంగా, ఇప్పుడు 95% మంది కంబోడియన్లు బుద్ధిజాన్ని అనుసరిస్తున్నారు.

Angkor Wat temple

అంకోర్ వాట్ చరిత్ర:

“అంకోర్ వాట్” అంటే ‘టెంపుల్ సిటీ’ అని అర్థం. ఖైమర్ రాజ్యానికి చెందిన కింగ్ సూర్యవర్మన్ II, విష్ణుమూర్తి కోసం ఈ గుడిని 402 ఎకరాల్లో కట్టించాడు. మన హిందూ పురాణాల ప్రకారం, దేవతలు మేరు పర్వతం పైన ఉంటారని ప్రతీతి. ఈ మేరు పర్వతాన్ని ప్రేరణగా తీసుకొని ఈ గుడి గోపురాలను నిర్మించారు. ఈ గోపురాల నిర్మాణం ఎంత విశిష్టంగా ఉంటుందంటే, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఇంకెక్కడా ఇలాంటి నిర్మాణం మనం చూడలేము. ఈ గుడిని కట్టించడానికి సూర్యవర్మన్‌కు సుమారు 28 సంవత్సరాలు పట్టిందని కొంతమంది చెప్తారు, అంటే 1122 నుండి 1150 మధ్య కాలంలో నిర్మించబడింది. దివాకర పండిత అనే బ్రాహ్మణుడి కోరిక మేరకు ఈ దేవాలయాన్ని సూర్యవర్మన్ కట్టించాడని కూడా అంటారు. కంబోడియా జెండా పైన కూడా ఈ దేవాలయం ఆకృతి ఉండటం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

నిర్మాణ అద్భుతాలు:

అంకోర్ వాట్ నిర్మాణంలోని అద్భుతాలలో ఒకటి ఈక్వినాక్స్ రోజున సూర్యోదయం. పగలు, రాత్రి సమానంగా ఉండే ఈక్వినాక్స్ రోజున, వేలాది మంది ప్రజలు అంకోర్ వాట్‌ను సందర్శిస్తారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే అక్కడికి చేరుకుంటారు. ఎందుకంటే, ఆ రోజు సూర్యోదయం దేవాలయం మధ్య గోపురం వెనుక నుండి కచ్చితంగా జరుగుతుంది. ఆ రోజుల్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో, ఇంత కచ్చితంగా ఈ గుడిని నిర్మించడం నిజంగా అద్భుతమైన విషయం. అప్పట్లో కంబోడియాలో పొడవును కొలవడానికి ‘హ్యాట్’ (HAT) అనే యూనిట్‌ను ఉపయోగించేవారు, ఒక హ్యాట్ 43.45 సెంటీమీటర్లకు సమానం. మన హిందూ పురాణాలలో నాలుగు యుగాలు ఉన్నాయి: కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం. ఈ యుగాల కాల పరిమితులకు, అంకోర్ వాట్ కొలతలకు మధ్య ఆశ్చర్యకరమైన సంబంధం ఉంది:

  • కలియుగం 4,32,000 సంవత్సరాలు అయితే, అంకోర్ వాట్ చుట్టూ ఉన్న నీటి కందకం వెడల్పు 432 హ్యాట్స్.
  • ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు అయితే, దేవాలయం ప్రవేశద్వారం నుండి లోపలి గోడకు దూరం 864 హ్యాట్స్.
  • త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు అయితే, ప్రవేశద్వారం నుండి సెంట్రల్ టవర్‌కు దూరం 1296 హ్యాట్స్.
  • కృతయుగం 17,28,000 సంవత్సరాలు అయితే, నీటిపై ఉన్న బ్రిడ్జ్ నుండి దేవాలయం మధ్య భాగానికి దూరం 1728 హ్యాట్స్. ఈ దేవాలయంలో ఇలాంటి ఎన్నో వింతలు ఉన్నాయి.

నిర్మాణ రహస్యం:

ఈ దేవాలయ నిర్మాణానికి ప్రధానంగా సాండ్‌స్టోన్ ఉపయోగించారు. ఒక అంచనా ప్రకారం, 15 టన్నుల బరువున్న 50 లక్షల నుండి కోటి రాళ్లను వాడారు. ఇది సుమారు 78 లక్షల టన్నుల రాళ్లకు సమానం. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సాండ్‌స్టోన్ దేవాలయానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గనుల నుండి తీసుకువచ్చారు. ఈజిప్టు పిరమిడ్లు కట్టడానికి సున్నపురాయిని 500 మీటర్ల దూరం నుండి తీసుకొచ్చారు. కానీ అంకోర్ వాట్ కోసం 40 కిలోమీటర్ల దూరం నుండి 15 టన్నుల రాళ్లను తీసుకువచ్చి, కచ్చితంగా చెక్కి, సరైన ప్రదేశంలో పెట్టి, అది కూడా కేవలం 28 సంవత్సరాలలో కట్టడం అసాధ్యమని చాలా మంది నమ్ముతారు. ఇప్పటి టెక్నాలజీతో కూడా దీన్ని కట్టలేమని అంటారు. అందుకే కొంతమంది ఇది ఏలియన్స్ నిర్మించారని, లేదా మన పూర్వీకులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని నమ్ముతారు. కొందరు పురాతన యాత్రికులు అతీత శక్తులు రాత్రికి రాత్రే ఈ గుడిని కట్టాయని చెబుతారు. ఈ గుడిని ఇంత త్వరగా ఎలా కట్టారు అన్న విషయం మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద రహస్యంగా మిగిలిపోయింది.

హిందూ దేవాలయం బౌద్ధ దేవాలయంగా ఎలా మారింది?

1177వ సంవత్సరంలో, అంటే సూర్యవర్మన్ II మరణించిన 27 సంవత్సరాల తర్వాత, హంపా రాజ్యం అంకోర్ వాట్‌ను ధ్వంసం చేసింది. ఇప్పటికీ అంకోర్ వాట్‌లో కొన్ని దెబ్బతిన్న భాగాలు ఆ దాడుల వల్ల జరిగినవే. ఆ తర్వాత ఖైమర్ రాజ్యం మళ్ళీ శక్తి పుంజుకుంది. అప్పుడు రాజుగా ఉన్న జయవర్మన్ సెవెన్, హిందూ మతం నచ్చకపోవడంతో, అంకోర్ వాట్‌ను పూర్తిగా బుద్ధిస్ట్ దేవాలయంగా మార్చాడు. ఆయన చాలా హిందూ విగ్రహాలను ధ్వంసం చేయించి, వాటి స్థానంలో బుద్ధుడి విగ్రహాలను ప్రతిష్ఠించాడు. అలా 12వ శతాబ్దంలో అంకోర్ వాట్ పూర్తిగా బుద్ధిస్ట్ దేవాలయంగా మారిపోయింది. అయితే, జయవర్మన్ సెవెన్ కట్టించిన బుద్ధ విగ్రహాలు, చిన్న గుళ్ళ నాణ్యతకు, సూర్యవర్మన్ కట్టించిన వాటి నాణ్యతకు చాలా తేడా ఉంది. ప్రస్తుతానికి కూడా సూర్యవర్మన్ కట్టించిన నిర్మాణాలు చాలా బలంగా ఉండగా, జయవర్మన్ కట్టించినవి కొద్దికొద్దిగా దెబ్బతిన్నాయి.

ప్రస్తుత స్థితి:

ప్రస్తుతం అంకోర్ వాట్‌ను ప్రపంచంలోనే ఎనిమిదవ వింతగా పిలుస్తున్నారు. దాని నిర్మాణంలోని అద్భుతాలు, చారిత్రక పరిణామాలు, మరియు దాని వెనుక దాగి ఉన్న రహస్యాలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, పరిశోధకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ విహారి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.