Char dham yatra complete details telugu

చార్ ధామ్ యాత్రలో ఏయే పుణ్యక్షేత్రాలు ఉంటాయి? ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి, ఏమేమి తీసుకెళ్లాలి?

by Lakshmi Guradasi

అసలు ఈ చార్ ధామ్ యాత్ర కథ ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటి?

అసలు ఏంటీ చార్ ధామ్ యాత్ర ముచ్చట? చార్ ధామ్ యాత్ర అనే పేరు వినగానే భక్తితో ఒళ్లంతా పులకించిపోతుంది కదా! ఇది కేవలం ఒక ట్రిప్ మాత్రమే కాదు, ప్రతి హిందువు తన లైఫ్ లో ఒక్కసారైనా చేయాలని కోరుకునే ఒక పవిత్ర సాహసయాత్ర. ఉత్తరాఖండ్ లోని పవిత్ర హిమాలయ పర్వతాల్లో కొలువై ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, మరియు బద్రీనాథ్ ఈ నాలుగు క్షేత్రాలను కలిపి మనం ‘చార్ ధామ్’ అని పిలుచుకుంటాం. ఈ యాత్ర చేయడం వల్ల మన కర్మలు కాలిపోయి, పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని మన పెద్దల గట్టి నమ్మకం. అందుకే ఎంతో కష్టమైనా సరే, ఆ భగవంతుడి సాన్నిధ్యం కోసం భక్తులు వేల కిలోమీటర్లు ప్రయాణించి వస్తుంటారు.

‘బడా’ కి ‘చోటా’ కి తేడా ఏంటి ? ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఆదిశంకరాచార్యుల వారు దేశానికి నాలుగు మూలలా నాలుగు ప్రధాన క్షేత్రాలను (పూరి, రామేశ్వరం, ద్వారక, బద్రీనాథ్) ఏర్పాటు చేశారు, వీటిని ‘బడా చార్ ధామ్’ అంటారు. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ నాలుగు క్షేత్రాలను ‘చోటా చార్ ధామ్’ అని పిలుస్తారు. టూరిజం పరంగా, భక్తుల సౌకర్యం కోసం ఈ ప్యాకేజీని డెవలప్ చేశారు. ఈ యాత్రను ఒక పద్ధతి ప్రకారం చేయాలి. సవ్య దిశలో అంటే గడియారం ముల్లు తిరిగేలా… మొదట యమునోత్రి, తర్వాత గంగోత్రి, అటు నుంచి కేదార్నాథ్ వెళ్లి, చివరగా బద్రీనాథ్ లో యాత్ర ముగించడం ఆచారం.

ఏ ఏ దేవుళ్ళు ఎక్కడ కొలువై ఉంటారు? ఈ నాలుగు క్షేత్రాల్లో ఒక్కో దానికి ఒక్కో చరిత్ర ఉంది.

  • యమునోత్రి & గంగోత్రి: మన పవిత్ర నదులైన యమున, గంగమ్మ తల్లి పుట్టిన ప్రదేశాలు ఇవే. గంగమ్మ భూమి మీదకు వచ్చిన మొట్టమొదటి ప్రదేశం గంగోత్రి అని మన పురాణాలు చెబుతున్నాయి.
  • కేదార్నాథ్: ఇది శివయ్య కొలువు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది ఒకటి. మందాకిని నది ఒడ్డున, సముద్ర మట్టానికి సుమారు 3524 మీటర్ల ఎత్తులో ఈ టెంపుల్ ఉంటుంది.
  • బద్రీనాథ్: ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆదినారాయణుడిగా కొలువై ఉంటాడు. చార్ ధామ్ యాత్రలో ఇది చాలా ప్రధానమైన దేవాలయం.
Char dham yatra map details

ఆరు నెలలే ఎందుకు తెరుస్తారు? ఈ దేవాలయాలు సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే భక్తుల కోసం ఓపెన్ లో ఉంటాయి. ఎందుకంటే మిగతా ఆరు నెలలు అక్కడ మంచు బీభత్సంగా కురుస్తుంది, చలి మామూలుగా ఉండదు, అసలు మనుషులు అక్కడ ఉండలేరు. అందుకే శీతాకాలంలో గుడులు మూసేసి, దేవుడి విగ్రహాలను కింది ప్రాంతాలకు (ఉదాహరణకు కేదార్నాథ్ విగ్రహాన్ని ఉఖీమఠ్ కి) తీసుకొచ్చి పూజలు చేస్తారు. సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలలో అక్షయ తృతీయ రోజున గుడులు తెరుస్తారు, మళ్ళీ నవంబర్ లో దీపావళి తర్వాత మూసేస్తారు. ఈ ఆరు నెలల గ్యాప్ లోనే మనం ప్లాన్ చేసుకోవాలి.

ముహూర్తాలు: ప్లాన్ ఎప్పుడు వేయాలి? ఏ టైమ్ అయితే బెస్ట్?

గుడి గడప తెరిచేది ఎప్పుడంటే… చార్ ధామ్ యాత్ర ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి కుదరదు, దానికి ఒక టైమ్ ఉంటుంది. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున ఈ పుణ్యక్షేత్రాల తలుపులు తెరుస్తారు. అదే రోజున యమునోత్రి మరియు గంగోత్రి ఆలయాలను ఓపెన్ చేస్తారు. ఇక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే కేదార్నాథ్ ఆలయం, బద్రీనాథ్ టెంపుల్ ఏప్రిల్ న తెరుస్తారు. అంటే ఏప్రిల్ ఎండింగ్ కల్లా నాలుగు ధామాలు భక్తుల దర్శనానికి రెడీ అయిపోతాయన్నమాట.

యాత్ర చేయడానికి ‘బెస్ట్ టైమ్’ ఏది? డేట్స్ అయితే తెలిశాయి కానీ, ఎప్పుడు వెళ్తే ప్రశాంతంగా దర్శనం అవుతుంది అనేది మెయిన్ పాయింట్. వాతావరణం పరంగా చూస్తే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో వెళ్లడం అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్. ఈ టైమ్‌లో ఎండలు ఉన్నా, హిమాలయాల్లో క్లైమేట్ చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది, మంచు కూడా మరీ ఇబ్బంది పెట్టదు. ఒకవేళ మీరు మే, జూన్ నెలల్లో వెళ్తే భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ, ప్రయాణం మాత్రం సేఫ్‌గా సాగుతుంది. సెప్టెంబర్ 15 తర్వాత కూడా వెళ్లొచ్చు కానీ, అప్పుడు చలి మామూలుగా ఉండదు, వణికిపోతాం. కాబట్టి మీ బాడీ కండిషన్‌ని బట్టి ప్లాన్ చేసుకోండి.

వర్షాకాలంలో వెళ్తే సీన్ రివర్స్ అవుతుంది!, సాహసం చేయడం వేరు… రిస్క్ చేయడం వేరు. జూలై, ఆగస్టు నెలల్లో మాత్రం ఈ యాత్రకు వెళ్లకపోవడమే మంచిది. అప్పుడు హిమాలయాల్లో వర్షాలు బీభత్సంగా కురుస్తాయి. కొండ చర్యలు విరిగిపడటం (Landslides), ట్రాఫిక్ జామ్‌లు అవ్వడం చాలా కామన్. ఆగస్టులో వెళ్తే వర్షంతో పాటు మంచు కూడా కురుస్తుంది, ఆ చలికి తట్టుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి వారం రోజులు రోడ్డు మీదనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఆగస్టు నెలని యాత్ర లిస్ట్ నుంచి తీసేయడం సేఫ్!

మళ్ళీ దేవుడు నిద్రపోయేది ఎప్పుడు? (క్లోజింగ్ డేట్స్) ఈ యాత్ర కేవలం ఆరు నెలలే ఉంటుంది కదా! నవంబర్ 1వ తారీఖు (ఆదివారం) రోజున ఈ ఆలయాలను మూసివేస్తారు. సాధారణంగా దీపావళి తర్వాత రెండు రోజులకు గుడులు క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత మంచు విపరీతంగా కురవడం వల్ల మనుషులు అక్కడ ఉండలేరు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వచ్చే వరకు దేవుడి విగ్రహాలను కిందికి తీసుకొచ్చి అక్కడే పూజలు చేస్తారు. సో, ఏప్రిల్ నుంచి నవంబర్ 1 లోపు మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుంది.

రిజిస్ట్రేషన్ రచ్చ: ఇది లేకపోతే యాత్ర కష్టమే!

అసలు ఈ రిజిస్ట్రేషన్ గోల ఏంటి? చార్ ధామ్ యాత్రకు వెళ్లాలంటే గెడ్డం పెంచుకుని బ్యాగ్ సర్దేసుకుంటే సరిపోదు, అసలైన పని రిజిస్ట్రేషన్. ఇది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే యాత్ర చేసే దారిలో కొండలు విరిగిపడటం, మంచు తుఫానులు వంటి ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తాయో తెలియదు. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే గవర్నమెంట్ దగ్గర మన డేటా ఉంటుంది కాబట్టి, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనల్ని కాపాడటానికి లేదా మన ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్లకు ఈజీ అవుతుంది. ముఖ్యంగా దారిలో ఉన్న చెక్ పోస్టుల దగ్గర పోలీసులు మన బయోమెట్రిక్ పేపర్లు లేదా క్యూఆర్ కోడ్ చెక్ చేస్తారు, అవి లేకపోతే మాత్రం మనల్ని ముందుకు వెళ్లనివ్వకుండా అక్కడే ఆపేస్తారు.

ఆన్‌లైన్ లో ప్లాన్ పక్కాగా చేసుకుందాం! మనం వెళ్లకముందే ప్లాన్ పక్కాగా ఉండాలంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ బెస్ట్ ఆప్షన్. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి నెలలోనే ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. మీరు ఉత్తరాఖండ్ టూరిజం వారి అఫీషియల్ వెబ్సైట్ లేదా యాప్ లోకి వెళ్లి మీ మొబైల్ నెంబర్ తో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మనం ఏ డేట్ లో ఏ ఆలయానికి వెళ్తామో (యమునోత్రి నుంచి బద్రీనాథ్ వరకు వరుస క్రమంలో) అక్కడ మెన్షన్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయ్యాక ఒక పిడిఎఫ్ ఫైల్ వస్తుంది, దాన్ని ఫోన్ లో సేవ్ చేసుకోవడంతో పాటు ఒక కాపీ ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు కేదార్నాథ్ కు హెలికాప్టర్ లో వెళ్లాలనుకుంటే మాత్రం కేవలం ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారానే ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, బయట ఎక్కడ పడితే అక్కడ బుక్ చేసి స్కామ్స్ లో ఇరుక్కోకండి.

ఆఫ్‌లైన్ లో రిజిస్ట్రేషన్ ఎలా? జాగ్రత్తలు ఏంటి? ఒకవేళ మీరు ఆన్‌లైన్ లో చేసుకోవడం మర్చిపోతే లేదా కుదరకపోతే భయపడాల్సిన పని లేదు, హరిద్వార్ లేదా రిషికేష్ లోని సెంటర్ల దగ్గర ఆఫ్‌లైన్ లో కూడా చేసుకోవచ్చు. హరిద్వార్ లో రిషికూల్ గ్రౌండ్ లేదా రిషికేష్ లోని ఐఎస్బిటి (ISBT) బస్ స్టాండ్ దగ్గర కౌంటర్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది, సీజన్ లో రద్దీ ఎక్కువగా ఉంటే క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది, ఒక్కోసారి ఆ రోజుకు కోటా అయిపోతే మర్నాడు రమ్మని చెబుతారు. అందుకే వీలైనంత వరకు ఆన్‌లైన్ లో ముందే పని కానిచ్చేయడం బెటర్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రిజిస్ట్రేషన్ పేపర్లను ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి, హోటల్ రూమ్ లో మర్చిపోయి వెళ్తే చెక్ పోస్టుల దగ్గర మళ్ళీ రచ్చ అవుతుంది. ప్రైవేట్ వెహికల్ లో వెళ్లే వాళ్ళు కూడా తమ వెహికల్ ని పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవడం మర్చిపోవద్దు.

జర్నీ ఎలా?: మన తెలుగు రాష్ట్రాల నుంచి రూట్ మ్యాప్

మన ఊర్ల నుండి హరిద్వార్ దాకా స్కెచ్ ఏంటి? చార్ ధామ్ యాత్రకు వెళ్లాలంటే మన ఆంధ్ర, తెలంగాణ నుండి ముందుగా హరిద్వార్ లేదా ఋషికేష్ చేరుకోవాలి, ఇవే ఈ యాత్రకు బేస్ క్యాంపులు. మన దగ్గర నుండి ప్రయాణానికి రైలు మార్గం అందరికంటే బెస్ట్ ఆప్షన్. నేరుగా వెళ్లాలంటే యశ్వంత్పూర్ నుండి రిషికేష్ వెళ్లే ట్రైన్ ఉంది, ఇది హిందూపూర్, అనంతపూర్, కర్నూల్, కాచీగూడ మీదుగా సాగుతుంది. యాత్ర సీజన్ లో హైదరాబాద్‌లోని చర్లపల్లి నుండి స్పెషల్ ట్రైన్స్ కూడా నడుస్తుంటాయి. ఒకవేళ ఇవి దొరకకపోతే, విజయవాడ లేదా వైజాగ్ నుండి ముందుగా ఢిల్లీ చేరుకోవాలి. గుర్తుపెట్టుకో, ట్రైన్ జర్నీ సుమారు 26 గంటలకు పైగా ఉంటుంది కాబట్టి, ముందే 3-4 నెలల క్రితమే బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలి, లేకపోతే వెయిటింగ్ లిస్ట్ తో వెనకడుగు వేయాల్సి వస్తుంది.

ఢిల్లీ రూట్: పక్కా లోకల్ బడ్జెట్ ప్లాన్! ఢిల్లీ చేరుకున్నాక అక్కడి నుండి హరిద్వార్ వెళ్లడం చాలా ఈజీ. ఢిల్లీలోని ఐఎస్‌బిటి (ISBT) కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ నుండి హరిద్వార్‌కి ప్రతి అరగంటకు బస్సులు దొరుకుతాయి. గవర్నమెంట్ బస్సులు పర్ హెడ్ సుమారు 420 రూపాయల దాకా తీసుకుంటాయి, జర్నీ టైమ్ 6 గంటలు పడుతుంది. ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి కానీ కొన్నిసార్లు సీటు ఇస్తామని చెప్పి డ్రైవర్ పక్కన కూర్చోబెట్టి స్కామ్స్ చేస్తుంటారు, కొంచెం అలర్ట్ గా ఉండాలి. మీరు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగితే మెట్రోలో న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్ కి వెళ్లి, అక్కడి నుండి రాపిడో ఆటో లేదా క్యాబ్ లో కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ కి చేరుకోవచ్చు. బడ్జెట్ తక్కువ ఉన్నవాళ్లు ఢిల్లీ వరకు ఫ్లైట్ లో వచ్చి అక్కడి నుండి బస్సులో వెళ్లడం వల్ల టైమ్, మనీ రెండు సేవ్ అవుతాయి.

ఫ్లైట్ ముచ్చట్లు: టైమ్ సేవ్ చేయాలంటే ఇటు చూడు! నీ దగ్గర బడ్జెట్ ఉండి, టైమ్ అస్సలు లేదనుకుంటే విమానం ఎక్కేయడమే బెస్ట్. హరిద్వార్‌కి దగ్గరలో డెహరాడూన్ (జాలీ గ్రాంట్) ఎయిర్ పోర్ట్ ఉంది. హైదరాబాద్ లేదా బెంగళూరు నుండి ఇక్కడికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి కానీ టికెట్ రేట్లు 6,500 నుండి 12,000 దాకా మారుతూ ఉంటాయి. ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత అక్కడి నుండి ట్యాక్సీ మాట్లాడుకుంటే గంటలో ఋషికేష్ లేదా హరిద్వార్ చేరుకోవచ్చు. అయితే డెహరాడూన్ ఎయిర్ పోర్ట్ చిన్నది కాబట్టి ఫ్లైట్స్ తక్కువగా ఉంటాయి, కాబట్టి ముందే బుక్ చేసుకోవడం ముఖ్యం.

జర్నీ టైమింగ్స్ & టిప్స్! మొత్తంగా మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లి రావడానికి కనీసం 13 నుండి 15 రోజుల ప్లాన్ ఉండాలి. కేవలం కేదార్నాథ్, బద్రీనాథ్ మాత్రమే చూడాలనుకుంటే 5-6 రోజులు సరిపోవచ్చు కానీ మొత్తం చార్ ధామ్ అంటే మాత్రం గట్టిగా ప్లాన్ చేయాలి. అలాగే చార్ ధామ్ మార్గంలో ప్రయాణం అంటే మామూలుగా ఉండదు, సుమారు 20-30 కొండలు ఎక్కి దిగాలి. వామిటింగ్స్ వచ్చే అలవాటు ఉన్నవాళ్లు ముందే టాబ్లెట్స్ వేసుకోవాలి. లాంగ్ జర్నీ కాబట్టి స్లీపర్ క్లాస్ కంటే ఏసీ కోచ్ లో వెళ్లడం వల్ల మన ఒళ్లు హూనం కాకుండా ఉంటుంది.

లోకల్ ప్రయాణం: బస్సా? ట్యాక్సీనా? ఏది ఎక్కితే కిక్కు ఉంటుంది!

బడ్జెట్ లో బండి లాగించాలంటే బస్సే!, హరిద్వార్ లేదా ఋషికేష్ చేరుకున్నాక అసలైన కొండల ప్రయాణం స్టార్ట్ అవుతుంది. నీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటే మాత్రం గవర్నమెంట్ బస్సులు లేదా ప్రైవేట్ బస్సులు ది బెస్ట్ ఆప్షన్. హరిద్వార్ బస్ స్టాండ్ లోపల ఉత్తరాఖండ్ ఆర్టీసీ బస్సులు ఉంటే, బయట ప్రైవేట్ బస్సులు క్యూ కట్టి ఉంటాయి. ఇవి తెల్లవారుజామున 4 గంటలకే యాత్ర స్టార్ట్ చేస్తాయి. ఒక్కో ధామ్ కి టికెట్ రేట్లు ₹400 నుండి ₹1000 మధ్యలో ఉంటాయి. బస్సులో వెళ్తే సేఫ్టీ బాగుంటుంది కానీ ఒక్కటే ప్రాబ్లం… అది ఎక్కడ పడితే అక్కడ ఆగదు. నువ్వు దారిలో మంచి వాటర్ ఫాల్ చూసి ఫోటో దిగుదామన్నా, ఆపిల్ తోటల్లో ఆగుదామన్నా కుదరదు. వాడు ఎక్కడ ఆపితే అక్కడే దిగాలి, వాడు ఎప్పుడు చెబితే అప్పుడే ఎక్కాలి.

షేరింగ్ జీపులు: తక్కువ ఖర్చు, ఎక్కువ సాహసం! నువ్వు సోలోగా వెళ్తున్నావా లేక నీతో పాటు ఒకరిద్దరు ఉన్నారా? అయితే షేరింగ్ సుమోలు లేదా జీపులు ట్రై చెయ్. హరిద్వార్, ఋషికేష్ టాక్సీ స్టాండ్ల దగ్గర ఇవి దొరుకుతాయి. ఇవి ప్యాసింజర్లు నిండగానే బయలుదేరుతాయి. అయితే ఒక చిన్న చిక్కు ఉంది… వీడు బండిలో జనాలను ఫుల్ గా కుక్కేస్తాడు, కొంచెం ఇరుగ్గా కూర్చోవాల్సి వస్తుంది. కానీ బస్సు కంటే కొంచెం ఫాస్ట్ గా వెళ్తాయి. ఒక్కోసారి డైరెక్ట్ బండి దొరకకపోతే పార్ట్స్ పార్ట్స్ గా వెళ్లాల్సి ఉంటుంది (ఉదాహరణకు హరిద్వార్ నుంచి బార్కోట్, అక్కడి నుంచి జానకి చెట్టి). బడ్జెట్ లో అయిపోవాలి కానీ కొంచెం ఫాస్ట్ గా వెళ్లాలి అనుకుంటే ఇవి ఓకే.

సొంత వెహికల్ ముచ్చట: గ్యాంగ్ ఉంటే ఇదే కిక్కు! మీ దగ్గర ఒక 6 నుండి 10 మంది గ్యాంగ్ ఉంటే మాత్రం ఆలోచించకుండా ఒక ప్రైవేట్ వెహికల్ (బోలెరో, ఇన్నోవా లేదా టెంపో ట్రావెలర్) మాట్లాడుకోవడం పక్కా ప్లాన్. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, రూట్ మన ఇష్టం, స్టాపింగ్స్ మన ఇష్టం. రోజుకి సుమారు ₹5000 నుండి ₹6000 దాకా చార్జ్ చేస్తారు (డ్రైవర్ బాటాతో కలిపి). 7-సీటర్ ఎర్టిగా లేదా ఇన్నోవా అయితే రోజుకి ₹4500 నుండి ₹5500 దాకా అవుతుంది. 12 నుండి 14 మంది ఉంటే టెంపో ట్రావెలర్ బెస్ట్, దీనికి రోజుకి ₹8500 నుండి ₹9000 దాకా అడుగుతారు. గ్రూప్ గా వెళ్తే ఖర్చు అందరికీ షేర్ అవుతుంది కాబట్టి బస్సు రేటు లోనే మనకు సొంత కారులో వెళ్లిన ఫీలింగ్ వస్తుంది.

ప్యాకేజీ టూర్లు: ఏ టెన్షన్ లేని జర్నీ! మాకు ఏ గొడవ వద్దు, ఎక్కడ బండి దొరుకుతుందో, ఎక్కడ రూమ్ దొరుకుతుందో అని టెన్షన్ పడలేము అనుకుంటే ప్యాకేజీ టూర్లు ఉన్నాయి. హరిద్వార్ లో చాలా మంది టూర్ ఆపరేటర్లు ఉంటారు. వీళ్ళు ఒక్కో మనిషికి సుమారు ₹20,000 నుండి ₹30,000 తీసుకుని (బడ్జెట్ ని బట్టి) తిండి, తిప్పలు, రూములు, ప్రయాణం అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇది ఫ్యామిలీతో వెళ్లే వాళ్లకు, పెద్ద వాళ్లకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. కాకపోతే ముందే రివ్యూలు చూసి మంచి ఆపరేటర్ ని బుక్ చేసుకోవాలి, లేకపోతే స్కామ్ లో ఇరుక్కునే ఛాన్స్ ఉంది.

బ్యాగ్ లో ఏముండాలి?: మస్ట్ క్యారీ ఐటమ్స్ & ప్యాకింగ్ టిప్స్

చలికి చెక్ పెట్టే బట్టలు.. లేయరింగ్ ముఖ్యం! హిమాలయాల్లో చలి అంటే మన ఊర్లలో ఉండే చలి లాంటిది కాదు, అక్కడ టెంపరేచర్స్ -5 డిగ్రీల వరకు పడిపోతాయి. అందుకే ఒక పాత స్వెటర్ వేసుకుంటే సరిపోద్ది అనుకుంటే పొరపాటే. పక్కాగా లేయరింగ్ పద్ధతి పాటించాలి. అంటే లోపల ఒక థర్మల్ వేర్, దానిపైన ఒక టీ షర్ట్, దానిపైన మంచి ఫ్లీస్ లేదా జాకెట్ ఉండాలి. ముఖ్యంగా -5°C తట్టుకునే క్వాలిటీ జాకెట్లు (Decathlon లాంటి చోట్ల దొరుకుతాయి) తీసుకో. వీటితో పాటు మంకీ క్యాప్, చేతులకి గ్లౌజెస్, కాళ్ళకి ఉన్ని సాక్సులు ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ బరువుగా ఉన్నాయని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే కింద ఎండగా ఉన్నా పైకి వెళ్లేకొద్దీ చలి వణికిస్తుంది.

షూస్ ముచ్చట.. గ్రిప్ లేకపోతే రచ్చే! యాత్రలో మనం కిలోమీటర్ల కొద్దీ నడవాలి, అది కూడా రాళ్లు రప్పల దారిలో. అందుకే మామూలు చెప్పులు, ఫ్యాన్సీ షూస్ అస్సలు వేయొద్దు. మంచి గ్రిప్ ఉన్న ట్రెక్కింగ్ షూస్ ఉండాలి. ఇవి చలి నుంచి కాపాడటమే కాకుండా, దారిలో గుర్రాలు మన కాళ్ళ మీద కాలేసినా (అక్కడ అది చాలా కామన్) షూస్ కొంచెం ప్రొటెక్షన్ ఇస్తాయి. అలాగే ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు కాబట్టి ఒక రైన్ కోట్ లేదా పాంచో (Poncho) ఖచ్చితంగా బ్యాగ్ లో ఉండాలి. కింద అయితే ₹100 కే దొరుకుతాయి, పైన మాత్రం ₹250 నుంచి ₹300 దాకా లాగేస్తారు.

మందులు & ఆక్సిజన్.. హెల్త్ ముఖ్యం! హిమాలయాల్లో ఆక్సిజన్ 30 నుంచి 40 శాతం తక్కువగా ఉంటుంది, దీనివల్ల తలనొప్పి, వాంతులు రావచ్చు. అందుకే ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ రాకుండా ఉండటానికి డయామాక్స్ (Diamox) టాబ్లెట్స్ దగ్గర పెట్టుకో (డాక్టర్ ని అడిగి వాడు). జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పుల టాబ్లెట్స్ తో పాటు బ్యాండేజ్ లు, మూవ్ స్ప్రే లాంటివి మస్ట్. అవసరమైతే చిన్న ఆక్సిజన్ సిలిండర్లు కూడా దొరుకుతాయి, ఒకటి క్యారీ చేయడం మంచిది. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు తమ రెగ్యులర్ మెడిసిన్ తో పాటు కొంచెం ఎనర్జీ కోసం స్నాక్స్ (డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్) పక్కన పెట్టుకోండి.

అదర్ ఇంపార్టెంట్ ఐటమ్స్.. ఇవి మర్చిపోవద్దు! అన్నిటికంటే ముఖ్యమైనది క్యాష్! అక్కడ నెట్‌వర్క్ ఎప్పుడు పోతుందో తెలీదు, చాలా చోట్ల ఫోన్ పే, గూగుల్ పే లు పని చేయవు. అందుకే జేబులో సరిపడా నగదు ఉంచుకో. అలాగే ఒక టార్చ్ లైట్, పవర్ బ్యాంక్ ఖచ్చితంగా ఉండాలి. సన్ స్క్రీన్ లోషన్, లిప్ బామ్ కూడా తీసుకెళ్లు, లేకపోతే చలికి చర్మం పగిలిపోతుంది. ఇంకో సీక్రెట్ టిప్ ఏంటంటే… బ్యాగ్ లో సాధ్యమైనంత తక్కువ లగేజ్ పెట్టుకో. ఎక్కువ బరువు ఉంటే కొండలెక్కేటప్పుడు ఆయాసం వచ్చేస్తుంది. ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కింద క్లాక్ రూమ్స్ లో (₹100 చార్జ్ చేస్తారు) పడేసి, అవసరమైన వాటితో మాత్రమే పైకి వెళ్లు.

యమునోత్రి & గంగోత్రి: యాత్ర స్టార్టింగ్ అదిరిపోవాలి!

యమునోత్రి కథ: జానకి చెట్టి నుంచి మొదలు! ఇక అసలైన యాత్రలోకి దూకేద్దాం! సాధారణంగా చార్ ధామ్ యాత్రను సవ్య దిశలో అంటే గడియారం ముల్లు తిరిగేలా మొదట యమునోత్రి నుంచి స్టార్ట్ చేయడం మన ఆచారం. యమునోత్రికి వెళ్ళాలంటే లాస్ట్ పాయింట్ జానకి చెట్టి. ఇక్కడి నుంచే మన అసలైన సాహసం మొదలవుతుంది. జానకి చెట్టి నుంచి యమునోత్రి ఆలయానికి సుమారు 6 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాలి. దారి మొత్తం రాళ్లతో కొంచెం కష్టంగానే ఉంటుంది, పైకి వెళ్లేకొద్దీ ఆయాసం కూడా వస్తుంది. నీకు నడిచే ఓపిక లేకపోతే అక్కడ గుర్రాలు (₹3500), డోలీలు (₹8000-₹10000) లేదా ఒక వ్యక్తి వీపుపై మోసుకెళ్లే పిత్తులు (₹5000-₹6000) అందుబాటులో ఉంటాయి. రేట్లు సీజన్ బట్టి మారొచ్చు, కాబట్టి కొంచెం బేరం ఆడి సెట్ చేసుకో. గుర్రాల మీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అవి ఎప్పుడు కాళ్ల మీద తొక్కుతాయో తెలీదు.

సూర్య కుండ్ & దివ్య శిల: ఇక్కడే అసలైన మ్యాజిక్! యమునోత్రి గుడికి చేరుకోగానే అక్కడ నీకు తప్త కుండ్ కనిపిస్తుంది, ఇది భూమి లోపల నుంచి వచ్చే వేడి నీటి కొలను. చలిలో ఆ వేడి నీటి స్నానం చేస్తే వచ్చే కిక్కే వేరు. అక్కడ సూర్య కుండ్ అనే మరో హాట్ వాటర్ స్ప్రింగ్ ఉంటుంది, దాని వేడి ఎంత ఉంటుందంటే అందులో బియ్యం లేదా బంగాళదుంపలు మూట కట్టి వేస్తే కొద్దిసేపటికి ఉడికిపోతాయి. దీన్నే భక్తులు ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తుంటారు. గుడి పక్కనే దివ్య శిల ఉంటుంది, ఆలయాన్ని నిర్మించక ముందు నుంచి ఇక్కడే యమునా మాతను పూజించేవారట. యమునోత్రికి వెళ్లే దారిలో 13 కిలోమీటర్ల ముందే హనుమాన్ చెట్టి ఉంటుంది, వీలైతే అక్కడ కూడా ఆగి దర్శనం చేసుకో.

గంగోత్రి ముచ్చట: నడక లేదు, అంతా హైవేనే! యమునోత్రి అయిపోగానే మన నెక్స్ట్ టార్గెట్ గంగోత్రి. ఇక్కడ నీకు ఒక పెద్ద రిలీఫ్ ఏంటంటే, యమునోత్రి లాగా కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన పని లేదు. వెహికల్ డైరెక్ట్ గా గుడికి 300 మీటర్ల దూరం వరకు వెళ్తుంది. ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి వెళ్లే దారి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. గంగోత్రి ఆలయం భాగీరథి నది ఒడ్డున తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తుంది. ఇక్కడ గంగా నది భూమి మీదకు వచ్చిన మొట్టమొదటి ప్రదేశం అని మన పురాణాలు చెబుతున్నాయి. దర్శనం కోసం పెద్దగా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, 15-20 నిమిషాల్లోనే స్వామి దర్శనం అయిపోతుంది. ఇక్కడ భగీరథ శిల కూడా ఉంటుంది, ఇక్కడే భగీరథుడు గంగమ్మ కోసం తపస్సు చేశాడట.

హర్సిల్ వ్యాలీ & గంగా హారతి: మిస్ అయితే లాస్! గంగోత్రికి వెళ్లే దారిలో 13 కిలోమీటర్ల ముందే హర్సిల్ వ్యాలీ వస్తుంది, దీన్ని ఉత్తరాఖండ్ ‘మినీ స్విట్జర్లాండ్’ అంటారు. అక్కడ ఆపిల్ తోటలు, చెక్కతో కట్టిన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక సాయంత్రం 7:45 నిమిషాలకు గంగోత్రిలో ఇచ్చే గంగా హారతి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆ దీపాల వెలుగులో గంగమ్మ తల్లిని చూస్తుంటే వచ్చే ప్రశాంతత మాటల్లో చెప్పలేం. ఇక్కడ గంగా జలాన్ని బాటిల్స్ లో నింపుకొని కేదార్నాథ్ లో శివయ్యకు అభిషేకం చేయడానికి తీసుకెళ్లడం ఒక ఆచారం. ఇక్కడికి వెళ్లేటప్పుడు కూడా రైన్ కోట్ దగ్గర పెట్టుకో, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు.

కేదార్నాథ్ సాహసం: నడక మార్గం & హెలికాప్టర్ ముచ్చట్లు

గౌరీ కుండ్ నుంచి స్టార్ట్.. అసలైన జాతర ఇక్కడే!, యాత్రలో అసలైన కిక్కు, సాహసం ఉండేది కేదార్నాథ్‌లోనే. ఈ జర్నీ గౌరీ కుండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి కేదార్నాథ్ ఆలయానికి సుమారు 16 నుండి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది మామూలు నడక కాదు, నిట్టనిలువుగా ఉండే కొండలు ఎక్కాలి. దారి మొత్తం రాళ్లు రప్పలతో ఉంటుంది, పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఆయాసం వచ్చేస్తుంది. అందుకే నడక స్టార్ట్ చేసే ముందు గౌరీ కుండ్‌లోని వేడి నీటి కొలనులో ఒక స్నానం చేస్తే బాడీకి కొంచెం ఎనర్జీ వస్తుంది. గుర్రం మీద వెళ్లినా, నడిచి వెళ్లినా సుమారు 8 నుండి 12 గంటల టైమ్ పడుతుంది, అది నీ ఫిట్‌నెస్‌ని బట్టి ఉంటుంది .

నడక కష్టమంటే.. గుర్రాలు, డోలీలు ఉన్నాయి! అందరూ అంత దూరం నడవలేరు కదా, అందుకే అక్కడ చాలా ఆప్షన్లు ఉన్నాయి. నీకు ఓపిక లేకపోతే గుర్రాలు (ఖచ్చర్లు) తీసుకోవచ్చు, దీనికి సుమారు ₹3000 నుండి ₹5000 దాకా చార్జ్ చేస్తారు. గుర్రం మీద వెళ్లేటప్పుడు చాలా అలర్ట్‌గా ఉండాలి, అవి పక్కన ఉన్నవాళ్లను నెట్టేస్తుంటాయి లేదా మన కాళ్ల మీద తొక్కుతాయి, కొంచెం జాగ్రత్త. ఇక పెద్దవాళ్ల కోసం నలుగురు మోసే డోలీ (పల్లకీ) ఉంటుంది, దీనికి రాను పోను ₹17000 నుండి ₹18000 దాకా అడుగుతారు. అలాగే ఒక వ్యక్తి బుట్టలో వేసుకుని మోసుకెళ్లే పీతూ (Pithu) సర్వీస్ కూడా ఉంటుంది, దీనికి ₹6000 నుండి ₹9000 దాకా రేటు ఉంటుంది. రేట్లన్నీ అక్కడ ఉండే రద్దీని బట్టి మారుతుంటాయి, కాబట్టి బేరం ఆడటం మర్చిపోవద్దు.

హెలికాప్టర్ లో వెళ్లాలంటే స్కెచ్ పక్కాగా ఉండాలి! నడక వద్దు, గుర్రం వద్దు.. గాల్లో తేలుతూ స్వామిని చూడాలి అనుకుంటే హెలికాప్టర్ బెస్ట్. దీని కోసం ఫాటా, సిర్సీ లేదా గుప్తకాశీ అనే ప్లేసుల నుంచి హెలిపాడ్లు ఉంటాయి. టికెట్ రేటు రాను పోను సుమారు ₹5400 నుండి ₹8000 మధ్యలో ఉంటుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే.. హెలికాప్టర్ టికెట్లు యాత్రకు 2-3 నెలల ముందే కేవలం IRCTC లేదా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లలోనే బుక్ చేసుకోవాలి. బయట ఎవరైనా టికెట్లు ఇస్తామంటే అస్సలు నమ్మకండి, అక్కడ ఫేక్ వెబ్సైట్ల స్కామ్స్ చాలా ఎక్కువ. హెలికాప్టర్ లో వెళ్తే దర్శనం అయ్యాక మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేయొచ్చు లేదా ఒక నైట్ పైన స్టే చేసి రావచ్చు.

దారిలో మ్యాగీ ముచ్చట్లు & పక్కా జాగ్రత్తలు! కొండ ఎక్కేటప్పుడు ఆకలేస్తే దారి పొడవునా చిన్న చిన్న షాపులు ఉంటాయి. అక్కడ మ్యాగీ, బ్రెడ్ పకోడా లాంటివి ఫుల్ ఫేమస్. కింద ₹10 ఉండే వాటర్ బాటిల్ పైన ₹60 నుండి ₹80 దాకా ఉంటుంది, కాబట్టి రేట్లకు మైండ్ పోగొట్టుకోకండి. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు కాబట్టి బ్యాగ్ లో ఒక రైన్ కోట్ ఖచ్చితంగా ఉండాలి, చిన్న తుంపర పడినా చలి వణికిస్తుంది. ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి వేగంగా నడవకుండా మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళండి. పైన ఉండటానికి టెంట్లు కూడా దొరుకుతాయి, ఒక రాత్రి అక్కడ స్టే చేసి శివయ్య దర్శనం చేసుకుంటే ఆ అనుభూతే వేరు.

బద్రీనాథ్ దర్శనం & మానా గ్రామం: యాత్రలో అసలైన ముగింపు!

విష్ణుమూర్తి అదిరిపోయే స్కెచ్.. శివయ్యని ఎలా పంపించాడంటే?, కేదార్నాథ్ లో శివయ్యను చూశాక, ఇక మనం వెళ్లాల్సింది బద్రీనాథ్. ఇది అలకానంద నది ఒడ్డున, నర-నారాయణ పర్వతాల మధ్యలో ఉంటుంది. ఇక్కడ విష్ణుమూర్తి ‘ఆదినారాయణుడి’ రూపంలో కొలువై ఉంటాడు. ఈ ప్లేస్ వెనుక ఒక మాస్ స్టోరీ ఉంది. నిజానికి ఈ ప్లేస్ శివపార్వతులదట. విష్ణుమూర్తికి ఈ ప్లేస్ బాగా నచ్చి, ఒక చిన్న పిల్లోడిలా మారి ఏడుస్తుంటే, పార్వతీ దేవి జాలితో ఆ బాబుని ఇంటి లోపలికి తీసుకెళ్లిందట. శివుడు ఎంత వద్దన్నా వినకుండా లోపల పెడితే, బాబు రూపంలో ఉన్న విష్ణువు తలుపులు గెడ పెట్టేసి ఇక తీయలేదట. చేసేదేం లేక శివపార్వతులు అక్కడి నుంచి కేదార్నాథ్ కి షిఫ్ట్ అయిపోయారని పురాణాలు చెబుతున్నాయి. అలా బద్రీనాథ్ విష్ణుమూర్తి అడ్డాగా మారిపోయింది.

తప్త కుండ్ స్నానం & బద్రీనాథ్ స్పెషాలిటీస్! బద్రీనాథ్ టెంపుల్ కి వెళ్లగానే నీకు అక్కడ తప్త కుండ్ కనిపిస్తుంది. ఇది నాచురల్ గా వచ్చే వేడి నీటి కొలను. బయట గడ్డకట్టే చలి ఉన్నా, ఈ నీళ్లు మాత్రం వేడిగా భలే ఉంటాయి. ఇక్కడ స్నానం చేస్తే బాడీకి ఉన్న నొప్పులన్నీ మాయం అయిపోతాయి. టెంపుల్ పక్కనే బ్రహ్మ కపాలం అనే ప్లేస్ ఉంటుంది. దీని చరిత్ర ఏంటంటే, పూర్వం శివుడు బ్రహ్మ దేవుడి ఐదో తలని నరికేసినప్పుడు, ఆ కపాలం శివుడి చేతికి అంటుకుపోయిందట. ఈ బద్రీనాథ్ లోని ఈ ప్లేస్ కి రాగానే అది కింద పడిపోయిందని చెబుతారు. అందుకే ఇక్కడ మన పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే వాళ్లకు మోక్షం కలుగుతుందని భక్తుల గట్టి నమ్మకం. ఇక్కడికి వెళ్లేటప్పుడు మీ పూర్వీకుల పేర్లు ఒక పేపర్ మీద రాసుకెళ్లడం మర్చిపోవద్దు.

ఇండియాలోనే ఫస్ట్ విలేజ్ ‘మానా’.. ఇక్కడ మిస్ అయితే లాస్! బద్రీనాథ్ కి జస్ట్ 4 కిలోమీటర్ల దూరంలోనే మానా గ్రామం ఉంటుంది, ఇది ఇండియా-చైనా బోర్డర్ కి ఆనుకుని ఉండే మొట్టమొదటి గ్రామం. ఇక్కడికి వెళ్లాలంటే షేరింగ్ వెహికల్స్ లో ₹100 లోపే వెళ్లొచ్చు. ఈ గ్రామంలో విశేషాలు మామూలుగా ఉండవు. ఇక్కడే వ్యాస గుహ, గణేష్ గుహలు ఉన్నాయి. వ్యాస మహర్షి చెబుతుంటే వినాయకుడు మహాభారతాన్ని ఇక్కడే కూర్చుని రాశాడని చెబుతారు. అలాగే ఇక్కడే సరస్వతీ నది పుట్టుకను కూడా చూడొచ్చు. పాండవులు స్వర్గానికి వెళ్లేటప్పుడు ఈ నదిని దాటడానికి భీముడు ఒక పెద్ద బండరాయితో వంతెన వేశాడట, దాన్నే ‘భీమ్ పూల్’ అంటారు. ఇక్కడ ‘ఇండియాస్ లాస్ట్ టీ షాప్’ లో ఒక చాయ్ తాగి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తే వచ్చే కిక్కే వేరు.

జాగ్రత్తలు & బడ్జెట్ ముచ్చట్లు! బద్రీనాథ్ లో మిగతా చోట్ల కంటే రేట్లు కొంచెం గట్టిగానే ఉంటాయి, రూములు ₹1500 నుండి ₹2000 వరకు ఉండొచ్చు. ఇక్కడ తెలుగు వాళ్ల కోసం ఆంధ్ర ఆశ్రమం కూడా ఉంది, అక్కడ తక్కువ రేటుకే స్టే దొరుకుతుంది. బద్రీనాథ్ కి వెళ్లే దారిలో ‘గ్లేషియర్స్’ (మంచు గడ్డలు) దగ్గర ఫోటోలు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి ఎప్పుడు విరుగుతాయో తెలీదు. అలాగే నైట్ పూట ఇక్కడ 0 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ ఉంటుంది, కాబట్టి మంచి జాకెట్లు వేసుకోవడం మర్చిపోవద్దు. బద్రీనాథ్ దర్శనం అయిపోయిందంటే నీ చార్ ధామ్ యాత్ర సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయినట్టే!

కొత్త రూల్స్ & జాగ్రత్తలు: స్కామ్స్ నుంచి జాగ్రత్త!

రీల్స్ పిచ్చి వద్దు.. దేవుడిని ప్రశాంతంగా చూసుకో! ఈ మధ్య కాలంలో అందరికీ సోషల్ మీడియా పిచ్చి బాగా ముదిరిపోయింది కదా! దేవుడిని దర్శనం చేసుకోవడం కంటే ఆ రీల్స్ చేయడం, ఫోటోలు దిగడం మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందుకే గవర్నమెంట్ 2026 నుంచి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. ముఖ్యంగా కేదార్నాథ్ లాంటి ఆలయాల లోపల మొబైల్ ఫోన్లు అస్సలు అలవ్ చేయట్లేదు, అక్కడ ఫోటోగ్రఫీ గాని, వీడియోలు తీయడం గాని నేరం. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు. సో, ఫోన్ ని రూమ్ లో గాని లేదా క్లాక్ రూమ్ లో గాని పడేసి, ఆ శివయ్యని, విష్ణుమూర్తిని కళ్ళ నిండా నింపుకుని ప్రశాంతంగా దర్శనం చేసుకో. ఇవి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు కాబట్టి వాటి మర్యాదను కాపాడటం మన బాధ్యత.

హెలికాప్టర్ టికెట్ల స్కామ్.. జాగ్రత్త సుమా! చార్ ధామ్ యాత్రలో అన్నిటికంటే పెద్ద స్కామ్ ఈ హెలికాప్టర్ టికెట్ల దగ్గరే జరుగుతుంది. చాలా మంది కేదార్నాథ్ కి నడవలేక హెలికాప్టర్ కోసం వెతుకుతుంటారు, దీన్ని ఆసరాగా తీసుకుని ఫేక్ వెబ్సైట్లు పుట్టుకొచ్చాయి. వాట్సాప్ లో మెసేజ్ చేసి, “మేము టికెట్ బుక్ చేస్తాం, గూగుల్ పే చేయండి” అని అడిగితే అస్సలు నమ్మకండి. హెలికాప్టర్ టికెట్లు కేవలం IRCTC లేదా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లలోనే బుక్ చేసుకోవాలి. మీరు గనక మోసపోతే ఆ కొండల మీద ఎవరికీ చెప్పుకోలేరు, డబ్బులు పోవడమే కాకుండా యాత్ర కూడా పాడవుతుంది. కాబట్టి పక్కాగా గవర్నమెంట్ సైట్లలోనే ముందే బుక్ చేసుకోండి.

ఆక్సిజన్ తిప్పలు.. హెల్త్ ముఖ్యం! హిమాలయాల్లో ఆక్సిజన్ లెవెల్స్ సుమారు 30% నుంచి 40% వరకు తక్కువగా ఉంటాయి. దీనివల్ల హై ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ వచ్చి తలనొప్పి, వాంతులు, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే యాత్రకు వెళ్లే ముందే డాక్టర్ ని సంప్రదించి డయామాక్స్ (Diamox) లాంటి టాబ్లెట్స్ దగ్గర పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఏదో కుర్రోళ్లం కదా అని కొండల మీద పరుగులెత్తకండి, ఆక్సిజన్ అందక ఇబ్బంది పడతారు. మెల్లగా, ప్రశాంతంగా అడుగులు వేస్తూ వెళ్ళండి. అలాగే మీ రెగ్యులర్ మెడిసిన్ తో పాటు జ్వరం, జలుబు మందులు కూడా క్యారీ చేయండి, ఎందుకంటే అక్కడ మెడికల్ షాపులు దొరకడం చాలా కష్టం.

జేబులో నగదు & చివరగా ఒక చిన్న మాట! హిమాలయ పర్వతాల్లో సిగ్నల్స్ ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలీదు. చాలా చోట్ల ఫోన్ పే, గూగుల్ పే లు పని చేయవు, ఏటీఎమ్ లు కూడా దొరకవు. అందుకే ఖచ్చితంగా సరిపడా నగదు (Cash) మీ దగ్గర ఉంచుకోండి. అలాగే మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్ పేపర్లు, ఆధార్ కార్డు ఎప్పుడూ మీ బ్యాగ్ లోనే ఉండాలి, ఎక్కడ చెక్ పోస్ట్ ఉన్నా అవి అడుగుతారు. యాత్రలో ఓపిక చాలా ముఖ్యం, వాతావరణం బాలేకపోయినా లేదా రద్దీ ఎక్కువగా ఉన్నా టెన్షన్ పడకుండా దేవుడిని తలుచుకుంటూ ముందుకు వెళ్ళండి. అంతా ఆ దైవమే చూసుకుంటాడు!

See Also:

బద్రీనాథ్ క్షేత్రం

గంగోత్రి క్షేత్రం

కేదార్నాథ్ క్షేత్రం

రిషికేశ్ పూర్తి పర్యటన

మరిన్ని ఇటువంటి విహారి యాత్రల కోసం తెలుగు రీడర్స్ విహారి ను చుడండి.

You may also like