AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15వ తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయని ఈవో రామారావు తెలిపారు. లోక కళ్యాణార్థం పండితుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిత్యం చండీపారాయణ, రుద్రపారాయణలు, ఉదయం, సాయంత్రం పూజాహారతి, మంత్రపుష్పాలు నివేదన చేస్తారన్నారు. 15న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని చెప్పారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో మొదటిసారిగా వారాహి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జులై 6 నుంచి 15 వరకు 9 రోజుల పాటు ఈ నవరాత్రులు జరుగుతాయని శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో రామారావు ఆదివారం నాడు వెల్లడించారు. జులై 6న ఆషాడం మొదలవుతుందని, నెలరోజులపాటు ఆలయంలో ఆషాడమాస సారె మహోత్సవం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అమ్మవారికి భక్తులు సారె సమర్పణకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.
ఇక, జులై 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ.. అమ్మవారికి బోనాలు సమర్పిస్తుందని పేర్కొన్నారు. జులై 19 నుంచి మూడు రోజులపాటు శాకాంబరీ దేవి ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. మహానివేదన సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీఐపీ దర్శనాలు ఉండవన్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈవో ఆదేశించారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ వార్తలును సందర్శించండి.