Home » హనుమంతుని తోక కి గంట | A bell on Hanuman’s tail

హనుమంతుని తోక కి గంట | A bell on Hanuman’s tail

by Lakshmi Guradasi
191 views
Hanuman tail bell significance

హనుమంతుని వాలం లో గంట:

హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్నవారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందం. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు. తోడుగా సీతమ్మ తల్లి. నీడగా లక్ష్మణుడు. మునుల దర్శనాలతో, ఋషి పుంగవుల దివ్యోపదేశాలతో, పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన – సీతమ్మ అపహరణ. ప్రాణప్రదురాలైన భార్యను వెదుకుతూ బయల్దేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదిరింది. వానర రాజుగా అన్న స్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకూ వానరుల్ని పంపాడు. రావణ లంకలో ఉన్న అమ్మ జాడను హనుమన్న కనిపెట్టాడు.

యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపిసైన్యాన్ని, భల్లూక పటాలంతో జతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్ల రణానికి తరలివెళుతున్న తమవాళ్ళను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు.

ఒకవైపు స్వామికార్యం, మరొకవైపు పేగుబంధం – ఈ రెండిటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామికార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్ళు కారుతున్నా ‘విజయోస్తు…దిగ్విజయోస్తు’ అని అంటున్నారు కుటుంబ సభ్యులు.

ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదలిపోయాడు. కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్తపడ్డాడు. తుది వీడ్కోళ్ళు ముగిసాయి. సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు –

‘ఓ వానరులారా! ప్రాణాస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ నిస్వార్థతకు నా నమోవాకాలు. నేను అఋణిని. ఎవరీ ఋణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగినవాణ్ణి. కనుక, ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో, అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను.’ అని అన్నాడు.

జనన-మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారియై వాగ్దానం చేసాడు. రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు. తమవారు తప్పక తిరిగివస్తారన్న ఆనందంతో జయఘోషను చేసింది వానర జాతి…

రామ సేవ కోసం కదలిన కపిసైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో బాటు ‘సింగిలీకలు’ అని పిలువబడే పొట్టి పొట్టి… మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడియైన గోళ్ళు – ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోళ్ళతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధతంత్రం.

రామ-రావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది. రామలక్ష్మణుల బాణధాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడ ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే. రావణుడు – కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే, తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైన, ఎత్తైన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టివున్నాయి. అవి గలగలా శబ్దం చేస్తుండగా, వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు.రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడింది.

అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో వెయ్యిమంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి. కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి, నేరుగా ఈ కోతుల పైన పడింది. గంటదేమో భారీ ఆకారం. కోతులేమో మరుగుజ్జులు. ఇంకేముంది… ఆ వెయ్యి కోతులూ గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది.

ఏ చప్పుడూ వినబడకుండా పోయింది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది. అలా కొద్దిసేపు గడిచాక, ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడ సాగింది. “మనల్ని కాపాడ్డానికి ఎవరూ రాలేదు. అప్పుడు ఒక ముసలి కోతి సహనంతో ఉందాం. రామ నామ స్మరణ చేద్దాం.’ అంది. ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామ తారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామ నామాన్ని చేయసాగాయి. అలా అలా కొద్ది కాలంలోనే, అన్ని కోతులు రామ నామ సంకీర్తనలో మునిగిపోయాయి.

ఈలోపు, గంట బైట ఏం జరిగిందో చూద్దాం! రాముడు రావణున్ని సంహరించాడు. సీతమ్మను చేపట్టాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేసాడు. ఇక అయోధ్యకు బయల్దేరాలి. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి, తన వాగ్దానాన్ని గుర్తు చేసాడు. కపిసైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ‘ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నా’ యని చెప్పాడు. మళ్ళీ లెక్కవేయమన్నాడు రాముడు. మళ్ళీ వెయ్యి తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయల్దేరాడు.

ముందు హనుమ దారి చేస్తుండగా, యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసిన రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన డాళ్ళు. వాటన్నింటి మధ్యా ఎక్కడైనా వానరులు పడివున్నారేమో స్వయంగా వెదుకుతున్నాడు రాముడు.

అంతలో, స్వామి దృష్టి ఒక గంటపై పడింది.’హనుమా…’ అన్నాడు. పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమయింది. వెంటనే తోకను పెంచి… గంటను పైకి లేపాడు.అక్కడ… ఆ గంట క్రింద… పెదవులపై రామనామం తాండవిస్తుండగా, మూసిన కళ్ళతో, రామభక్తితో వికసించిన మనసులతో కూర్చునివున్న కోతులు. సుగ్రీవుడు చకచకా లెక్కవేసాడు. వెయ్యి సింగిలీక కోతులు. లెక్కసరిపోయింది. చుట్టూవున్న వానర సైన్యం ఒకపెట్టున ‘జయ జయ రామ… జయ జయ రఘురామా” అంటూ జయఘోషను చేసింది.

అప్పటి వరకూ చీమ చిటుకుమన్న శబ్దం కూడ వినని మరుగుజ్జు కోతులు అపార పారావార ఘనఘోర తరంగ ఘోషలా వినబడిన జయజయ ధ్వానాలకు ఉలిక్కిపడ్డాయి. చటుక్కున కళ్ళు తెరిచాయి. చీకటికే అలవాటు పడినపోయిన కళ్ళతో ధగధగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక, కళ్ళకు చేతుల్ని అడ్డుపెట్టుకుని, నెమ్మదిగా చూడసాగాయి. అదిగో… ఎదురుగా… ఆజానుబాహుడు… అరవిందదళాయతాక్షుడు… నిశాచరవినాశకరుడు, భక్తకోటికి శీతకరుడు అయిన రాముడు నిలబడివున్నాడు.

అంతే… సింగిలీక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చెయ్యాలన్న ఆలోచన రాలేదు. వానరసైన్యం మరొక్కమారు జయఘోషను చేసింది. ‘జై శ్రీరామ… జై శ్రీరామా”అప్పుడు తెలిసింది ఏం చేయాలో… వెంటనే రామపాదారవిందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. ‘రాముడు మోసగాడు’ అన్న ఈ కోతిని, ‘హనుమంతుడు బుద్ధిహీనుడు’ అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదు హస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం ‘తారక మంత్రమే త్రోవ’ అన్న పండుకోతిపై ప్రసరించాయి. అలా సింగిలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది.

‘సుందరే సుందరం కపిః’ – ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట. మురిపెంగా చూసాడు ముగ్ధమోహనుడైన రాముడు. ‘హనుమా! రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా, తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో – వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుంద’ని వరమిచ్చాడు శ్రీరాముడు. వాలంలో ఘంటను కలిగిన వానరశ్రేష్టుణ్ణి దర్శించేప్పుడు, పూజించేప్పుడు ఈ సింగిలీక కథను గుర్తుచేసుకోండి.

జై శ్రీరామ్ !!!

See Also plz click on this: sri-valli-devasena-subramanya-swamy-story

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ పురాణాలు ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.