చాలా కాలం క్రితం, ఒక సుదూర దేశంలో, ఒక అందమైన కోట ఉండేది. ఆ కోటలో చాలా అందమైన రాణి నివసిస్తుండేది. అయితే తనకి ఒక కూతురు ఉంటే బావుండు అనే కోరిక ఉండేది. దాంతో పాటు తన కూతురు ఎలా ఉండాలి అంటే మంచులా తెల్లని చర్మం, గులాబీలా ఎర్రటి పెదాలతో, బొగ్గులా నల్లని వెంట్రుకలతో అందంగా ఉండాలి అనుకునేది. రాణి కోరిక తీరడానికి చాలా కాలం పట్టలేదు, ఆమె ఒక అందమైన అమ్మాయికి జన్మనిచ్చింది. అలాగే ఆమెకు స్నో వైట్ అని పేరు పెట్టింది. కాలం వేగంగా గడిచింది, వారి సంతోషం కూడా ఎంతో కాలం నిలవలేదు. రాణి అనారోగ్యానికి గురై, కొంతకాలం తర్వాత మరణించింది.
తర్వాత ఆ రాజు మరొక స్త్రీని తిరిగి వివాహం చేసుకున్నాడు, కొత్త రాణి అందంగా ఉంది, కానీ ఆమె దుష్ట హృదయాన్ని కలిగి ఉండేది. అలాగే ఆమె అహంకారి మరియు అసూయపడే స్త్రీ కూడాను. ప్రతిరోజూ, కొత్త రాణి తన మాయా అద్దంలోకి చూస్తూ ఇలా అడుగుతుండేది “ఓ గోడపై ఉన్న అద్దం, ఈ ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ ఎవరు?” దానికి మాయా అద్దం తిరిగి సమాధానం ఇలా ఇస్తుండేది “ఎవరూ లేరు, మీరు చాలా అందంగా ఉన్నారు”, రాణి ఆ సమాధానంతో చాలా సంతోషంగా ఉండేది.
ఆ రాణి చెడు పనుల కారణంగా రాజ్యం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుండేది, రాజ్యంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి, రాజు కోట నుండి దూరంగా వెళ్ళినప్పుడు ఆమె ఆ రాజ్యాన్ని తన ఇష్టానుసారం చేస్తుండేది. ఇలా సంవత్సరాలు వేగంగా గడిచిపోయాయి మరియు స్నో వైట్ యువతిగా పెరిగింది.
ఒకరోజు రాణి తన మాయా అద్దంలోకి చూస్తూ ప్రశ్న అడిగింది “ఓ గోడపై ఉన్న అద్దమా, ఈ ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ ఎవరు?” దానికి మాయా అద్దం తిరిగి సమాధానంగా “నా ప్రియమైన రాణి, స్నో వైట్ చాలా అందంగా ఉంది” అని చెప్పింది. దానికి ఆ రాణి కి చాల కోపం, అసూయ కలిగాయి. కానీ మాయా అద్దం నిజం మాత్రమే మాట్లాడుతుందని రాణికి తెలుసు.
వెంటనే రాణి తన వేటగాడిని పిలిచి నువ్వు స్నో వైట్ ని అడవిలోకి తీసుకొని వెళ్లి చంపెసి, ఆమె జుట్టును తీసుకొని నాకు చూపించు అని చెపుతుంది. అపుడు వేటగాడు స్నో వైట్‌ను అడవిలోని ఒక కొండపైకి తీసుకొనివెళ్ళాడు. అతను కొండపై నుండి స్నో వైట్ను నెట్టడానికి సిద్ధమవుతూ చివరిసారిగా ఆమె మొఖం చూస్తాడు. అప్పుడు అతనికి ఆమె అందరి పట్ల ఎంత ప్రేమగా, జాలి , దయగా నడుచుకుంటుందో గుర్తుకు వచ్చి అతను తనని అలా చేయలేకపోతాడు.
అప్పుడు వేటగాడు మాట్లాడుతూ: యువరాణి స్నో వైట్, మీ సవతి తల్లి, చెడ్డ రాణి మిమ్మల్ని చంపెయాలిని నన్ను కోరింది. కానీ నిన్ను బాధపెట్టే మనసు నాకు లేదు. దయచేసి మీరు ఇక్కడే అడవిలోనే ఉండండి, రాజ్యానికి తిరిగి రాకండి అని చెప్పి వేటగాడు స్నో వైట్‌ని అడవిలో వదిలేసి కోటకు తిరిగి వెళ్తాడు. వేటగాడు కోటకు తిరిగి వచ్చి దుష్ట రాణికి జుట్టుని సమర్పిస్తాడు.
స్నో వైట్ అడవిలో తిరుగుతూ ఉండగా ఆమెకు పర్వతాల దగ్గర ఉన్న ఒక చిన్న కుటీరాన్ని చూసి అందులోకి వెళుతుంది. ఆమె లోపలకి ప్రవేశించగానే, టేబుల్‌పై రుచికరమైన భోజనం ఉంటుంది. అక్కడ ఏడు చిన్న ప్లేట్లు! రుచికరమైన ఆహారంతో నిండి ఉంటాయి! స్నో వైట్ చాలా ఆకలితో ఉన్నందున ఆమె ఆహారమంతా తిన్నది. ఆ తర్వాత పక్కనే ఉన్న మరొక గది లోకి వెళ్ళగానే అక్కడ ఏడు చిన్న పడకలు ఉంటాయి. అప్పుడు ఆమె వెళ్లి వాటిమీద విశ్రాంతి తీసుకుంటుంది. బాగా అలసిపోయిన స్నో వైట్ గాఢనిద్రలోకి జారుకుంటుంది. అయితే ఆ ఇల్లు ఏడుగురు మరుగుజ్జులకు చెందినది. వారు పర్వతాలలో పనిచేస్తుంటారు. వారు సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు, వారి ఇంట్లో ఎవరో ఉన్నారని వారు గ్రహింస్తారు.
వారు “మన ఆహారాన్ని ఎవరో తిన్నారు! మన బెడ్‌లపై ఎవరో నిద్రపోతున్నారు! “అని మాట్లాడుతుండగా ఆ మరుగుజ్జులు మాటలు విని స్నో వైట్ నిద్ర లేస్తుంది. అప్పుడు ఆమె ఎవరో మరియు ఏమి జరిగిందో వారికి మొత్తం వివరిస్తుంది. నేను కోటలోకి తిరిగి వెళితే మా సవతి తల్లి నన్ను చంపుతుంది అని చెప్తుంది. ఏడు మరుగుజ్జులు స్నో వైట్ పట్ల జాలి పడి, ఆమెను వారితో పాటు ఉండనిస్తారు. వారి వద్ద ఆమె చాలా సురక్షితంగా మరియు సంతోషంగా ఉంటుంది. స్నో వైట్ చనిపోయిందని ఆ చెడ్డ రాణి నమ్ముతుంది. కొద్దీ రోజుల తరువాత రాణి మళ్లీ మాయా అద్దం దగ్గరకు వెళ్లి అడుగుతుంది. “ఈ ప్రపంచంలో అత్యంత అందమైన మహిళ ఎవరు?” అప్పుడు అద్ధం “స్నో వైట్ అందరికంటే అందంగా ఉంది!” అని చెప్తుంది. అప్పుడు రాణి ఆశ్చర్యపోయి ఆ అద్దాన్ని కానీ స్నో వైట్ చనిపోయింది గా అని అడుగుతుంది.
అప్పుడు ఆ అద్దం లేదు, స్నో వైట్ ఇంకా బతికే ఉందని, ఆ మాయా అద్దం ఆమెకు చూపిస్తుంది. మొదట ఆ చెడ్డ రాణి తన కళ్ళను నమ్మలేకపోతుంది, తరువాత చాలా కోపంతో ఊగిపోతోంది. అప్పుడు ఆ రాణి వేరేవాళ్లను నమ్మలేక నేరుగానే నేనే వెళ్లి తన పని ముగిస్తాను అని నిర్ణయించుకుంటుంది. దుష్ట రాణి ముసలి బిచ్చగత్తే వేషం వేసుకుని, విషం కలిపిన యాపిల్‌ను తీసుకుని మరుగుజ్జుల ఇంటికి వెళుతుంది. ఆ సమయంలో స్నో వైట్ ఒంటరిగా ఉంటుంది. అప్పుడు ఆ బిచ్చగత్తె “ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నేను పేద వృద్ధురాలిని మరియు నాకు చాలా చలిగా ఉంది. నేను కొంచెం సేపు మీ ఇంట్లోకి రావచ్చా?” అని అడుగుతుంది.
అప్పుడు స్నో వైట్ తలుపు తెరుస్తుంది, ఆమెను చుసిన బిచ్చగత్తె ఒక్క క్షణం నిర్గాంతపోయి తరువాత ఇలా చెపుతుంది. “ఓ నా అందమైన అమ్మాయి, నేను ఒక పేద వృద్ధురాలిని, మీరు నాకు తినడానికి ఏమైనా ఇస్తే, నేను ఎప్పటికీ మీకు కృతజ్ఞురాలిని అవుతాను” అని చెపుతుంది. అప్పుడు స్నో వైట్ దయచేసి లోపలికి రండి అంటూ దుష్ట రాణిని ఇంట్లోకి అనుమతిస్తుంది. తరువాత స్నో వైట్ ఆమెకు వేడిగా ఉన్న సూప్ తెచ్చి ఇస్తుంది. అప్పుడు బిచ్చెగత్తె రూపంలో ఉన్న చెడ్డ రాణి దయచేసి ఈ యాపిల్‌ను నా కృతజ్ఞతలకు అంగీకరించండి, అని ఇస్తుంది. స్నో వైట్ చెడ్డ రాణిని గుర్తించలేక ఆ పండును కొంచెం తిన్న తర్వాత యాపిల్‌లోని విషం స్నో వైట్‌ను గాఢమైన నిద్రలోకి వెళుతుంది. అది గమనించిన రాణి చాల సంతోషపడి, ఇప్పుడు నేను మళ్ళీ అందరికంటే అందంగా ఉన్నాను అనుకొంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరుగుజ్జులు తిరిగి వచ్చేసరికి, స్నో వైట్ నిశ్చలంగా పడి ఉండటం చూస్తారు. అరెరే! స్నో వైట్‌కి ఏదో జరిగింది! అనుకుంటూ పక్కనే సగం కొరికిన ఒక ఆపిల్ ఉండడం గమనిస్తారు. యాపిల్‌లో విషం కలిపినట్లు వారు గమనిస్తారు. అప్పుడు వారికి దూరంగా వెళుతున్న పొరుగు దేశపు యువరాజు రధము కనపడుతుంది. అప్పుడు ఆ మరుగుజ్జులు అందరు ఆ యువరాజుని మా స్నో వైట్ ని బతికించమని వేడుకుంటారు. అప్పుడు ఆ యువరాజు తన దగ్గర ఉన్న వైద్యుడిని తీసుకోని స్నో వైట్ వద్దకు వస్తారు.
ఆ యువరాజు స్నో వైట్‌ని చూసి ఆమె అందానికి అవాక్కవుతాడు, అరే ఎంత అందమైన యువతి! కానీ ఆమె ఎందుకు ఇలా అయిపోయిందని అడుగుతాడు. అప్పుడు జరిగిందంతా ఆ మరుగుజ్జులు యువరాజుకి చెప్తారు. వైద్యుడు ఆమెకు వైద్యం చేసి స్నో వైట్‌ను మేల్కొల్పుతాడు. స్నో వైట్ మేల్కొనడం చూసి యువరాజు మరియు ఏడుగురు మరుగుజ్జులు చాలా సంతోషపడుతారు.
ఇలా కొద్ధి రోజుల గడిచిన తరువాత యువరాజు మళ్ళీ స్నో వైట్ ని చూడడానికి వస్తాడు. ఇలా వారి ఇరువురి మధ్యలో ప్రేమ చిగురిస్తుంది. వారి ప్రేమ రోజు రోజుకు పెరిగి పెళ్లివరకు చేరుకుంటుంది. అదే సమయంలో, తన కుమార్తెకు జరిగినదంతా తెలుసుకున్న రాజు, మాయా అద్దాన్ని పగలగొట్టి, రాణిని కోట నుండి దూరంగా పంపించి వేస్తాడు. స్నో వైట్ చివరకు తన కోటకు తిరిగి వచ్చి తన తండ్రితో కలిసి, తన తండ్రి ఆధ్వర్యంలో ఆ యువరాజుని పెళ్లి చేసుకుంటుంది. రాజు, స్నో వైట్, ప్రిన్స్ మరియు ఏడుగురు మరుగుజ్జులు అందరూ సంతోషంగా జీవిస్తారు.
కథ యొక్క నీతి:
ప్రేమ , దయ , కరుణ వంటివి మనకు ఎప్పటికైనా మేలు చేస్తాయి, అలాగే ద్వేషం, అహంకారం, అసూయా వంటివి కీడు చేస్తాయి.
మరిన్ని తెలుగు కథల కొరకు తెలుగు రీడర్స్ ను సంప్రదించండి.