మోహమే మోక్షానికి అడ్డుకట్ట – ఓ నీతి కథ

by Lakshmi Guradasi

ఒకసారి ఒక సాధువు నడుచుకుంటూ వెళ్తూ అలసటతో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న ఇంటి యజమాని ఆయనను గమనించి, గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించాడు. మంచి భోజనం పెట్టి, రాత్రి అయ్యిందని అక్కడే విశ్రాంతి తీసుకోమని కోరాడు. మాటల్లో తన జీవిత కష్టాలు చెప్పుకుంటూ, “స్వామీ! ఈ సంసారంలో సుఖం లేదు… మీ జీవితం ఎంత హాయిగా ఉంటుంది” అని అన్నాడు. వెంటనే సాధువు, “అయితే నా వెంట రా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను” అన్నాడు. కానీ యజమాని సంకోచంతో “పిల్లలు చిన్నవాళ్లు… వాళ్లను పెద్ద చేయాలి కదా” అంటూ తప్పించుకున్నాడు.

కొన్ని సంవత్సరాల తరువాత సాధువు మళ్లీ ఆ ఇంటికి వచ్చాడు. యజమాని మరలా సాదరంగా ఆహ్వానించాడు. సాధువు మళ్లీ అదే మాట చెప్పగా, “ఇప్పుడే ఎలా స్వామీ? పిల్లల పెళ్లిళ్లు చేయాలి, వాళ్లు స్థిరపడాలి” అని చెప్పాడు. కాలం గడిచింది. మూడోసారి వచ్చినప్పుడు యజమాని, “పిల్లలకు డబ్బు విలువ తెలియదు. నేను దాచిన సంపదను కాపాడాలి. ఇంకా పెద్ద ఇల్లు కట్టాలి” అంటూ మరో కారణం చెప్పాడు. ఇలా ప్రతి సారి సంసార బంధాలే అతన్ని వెనక్కి లాగాయి.

మరికొన్ని సంవత్సరాల తరువాత సాధువు తిరిగి వచ్చేసరికి యజమాని మరణించిన సంగతి తెలిసింది. ఇంటి బయట చెట్టు కింద ఒక కుక్క కూర్చుని ఉండటం చూసి సాధువుకు అనుమానం వచ్చింది. తన జ్ఞానంతో అది ఆ యజమానే అని గ్రహించాడు. “ఇంకా మోహం విడువలేదా? నా వెంట రా” అన్నా, “నేను దాచిన డబ్బు ఎవరూ తీసుకోకుండా కాపాడాలి” అని కుక్క రూపంలో ఉన్న అతడు చెప్పాడు. కొంతకాలానికి ఆ కుక్క కూడా చనిపోయి, అదే చోట పాముగా పుట్టి సంపదను కాపాడుతూ ఉండటం సాధువు చూశాడు.

సాధువు ఇంట్లోకి వెళ్లి పిల్లలకు చెట్టు కింద ధనం ఉందని చెప్పగా, వారు కర్రలు పట్టుకుని వెళ్లి పామును చంపేశారు. తన సొంత పిల్లల చేతిలోనే మరణిస్తుండగా, ఆ యజమాని దయనీయంగా సాధువును చూశాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. జీవితమంతా సంపద, మోహం కోసం గడిపిన అతడు విముక్తి పొందలేక పునర్జన్మల చక్రంలో చిక్కుకున్నాడు.

నీతి: గృహస్థ జీవితంలో బాధ్యతలు అవసరం కానీ మోహబంధాలు మనల్ని బంధించకుండా ఉండే వివేకం ఇంకా ముఖ్యము. ఈ లోక జీవితం మాత్రమే కాదు, పరలోక శ్రేయస్సు గురించీ మనం తప్పకుండా ఆలోచించాలి.

See Also plz click on this: golden-axe-moral-story

మరిన్ని ఇటువంటి కథల కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చూడండి.

You may also like