Home » దాసరిఘట్ట శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం: అక్షర రూపంలో పరిష్కారాలు అందించే మహిమాన్విత క్షేత్రం

దాసరిఘట్ట శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం: అక్షర రూపంలో పరిష్కారాలు అందించే మహిమాన్విత క్షేత్రం

by Lakshmi Guradasi
860 views
dasarighatta chowdeshwari temple telugu

Dasarighatta chowdeshwari temple telugu: కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా తిప్టూరుకు సమీపంగా ఉన్న దాసరిఘట్ట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం, ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక నిలయమే కాదు – వేలాది మంది భక్తుల నమ్మకానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. ప్రతి నోటి మాటకీ, ప్రతి మనసు కోరికకీ, అక్షరాల రూపంలో సమాధానాలు ఇచ్చే మహిమ ఈ అమ్మవారిదే. అందుకే ఈ దేవాలయం దక్షిణ భారతదేశమంతటా పేరు తెచ్చుకుంది.

ఇప్పటికే మీరు ఆలయ విశేషాల్లో భాగంగా, స్త్రీల సమస్యలకు పరిహారంగా జరిగే ప్రత్యేక పూజల గురించి వినే ఉంటారు. అయితే ఇది కేవలం ఆ పరిధిలోనే ఆగిపోదు. చౌడేశ్వరి అమ్మవారి ఆలయం ఎన్నో చరిత్రల్ని, అనుభూతుల్ని, భక్తి కథల్ని తనలో దాచుకొని ఉంది. ఈ పుణ్యక్షేత్ర విశేషాల్లో మరిన్ని రహస్యాలను తెలుసుకుందాం…

పురాణ కథనం (History):

పురాణ కాలంలో నందవరం ప్రాంతాన్ని పాలించిన రాజు ఒక గొప్ప శక్తి ఉపాసకుడు. మంత్రబలం ద్వారా ప్రతీరోజూ తెల్లవారు జామున నాలుగు గంటలకే కాశీకి వెళ్లి గంగానదిలో స్నానం చేసి, పునః తన రాజ్యంలోకి తిరిగివచ్చేవాడు. ఈ అద్భుతమైన శక్తిని గమనించినా, తన భర్త ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోలేకపోయిన రాణి గుండెల్లో ఓ చిన్న అనుమానం తాలూకుగా పెరిగిపోయింది.

ఒక రోజు ఆమె నేరుగా రాజును అడిగింది – “నన్ను కూడా నీతో తీసుకెళ్తావా?” అని. రాజు అంగీకరించి, ఇద్దరూ కాశీకి వెళ్లారు. కానీ అదృష్టం బాగోలేదు. ఆమెకు అప్పుడే మాసిక ధర్మం (రుతుచక్రం) వచ్చిందీ, దీనివల్ల రాజు తన మంత్రబలాన్ని కోల్పోయాడు. ఇక వారు నందవరం తిరిగి వెళ్లలేక, కాశీలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఈ విపత్కర పరిస్థితిని గమనించిన బ్రాహ్మణులు రాజుకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తమ చండీయాగ శక్తితో ఆయనను ఆదుకోవాలని, వారి సంపాదించిన పుణ్యంలో నాల్గవ భాగాన్ని రాజుకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీని ప్రతిగా, రాజు తన రాజ్యంలో వారి ధర్మకార్యాలకు స్థలం (జహగీర్) కేటాయించాడు. ఈ విధంగా రాజు మళ్లీ తన మంత్రశక్తిని పొందాడు.

కాలంతో కాశీలో కష్టకాలం మొదలైంది – భయంకరమైన దుర్భిక్షం. బ్రాహ్మణులు తమ నమ్మకం నెరవేర్చమని రాజును గుర్తు చేశారు. కానీ రాజు అహంకారంతో వారిని దూషించాడు. ఫలితంగా అతనికి రాజ్యంలో విఫలతలు మొదలయ్యాయి. సింహాసనం కదిలిపోవడం మొదలుకొని ప్రజల విశ్వాసం కోల్పోవడం వరకూ అన్నీ అతనికే ఎదురయ్యాయి.

ఈ సమయంలో బ్రాహ్మణులు చౌడేశ్వరి అమ్మవారిని ప్రార్థించారు – “దేవీ! మా రాజ్యంలోకి వచ్చి ఈ సమస్యల నుంచి రక్షించు.” దేవి వారి పిలుపు విని నందవరం రాజ్యంలో ప్రత్యక్షమయ్యారు. రాజు ముందుకు అమ్మవారు వచ్చి శాంతిని ప్రసాదించారు. అప్పుడే రాజుకు తన తప్పు తెలిసింది. హృదయపూర్వకంగా దేవిని, బ్రాహ్మణులను మన్నించమని కోరాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయిందని చెప్తుంటారు. 

ఆలయ విశేషాలు మరియు అక్షర రూప ప్రశ్న పద్ధతి :

ఈ దాసరిఘట్ట ఆలయానికి ప్రత్యేకమైన పూజా విధానం ఉంది. భక్తులు తమ సమస్యలకు పరిష్కారం అక్షర రూపంలో పొందాలనుకుంటే ఈ ఆలయాన్ని దర్శించవచ్చు. ఆలయాన్ని సందర్శించిన తర్వాత, భక్తులు ₹100 రూపాయలు టికెట్ కొనుగోలు చేసి ప్రశ్న అడగడానికి కూర్చుంటారు. ఒక ప్రదేశంలో కూర్చున్న తర్వాత, భక్తులు తమ ప్రశ్నలను రాసి, పంచలోహ విగ్రహం పైన ఉంచుతారు. ఇద్దరు గ్రామస్తులు పంచలోహ విగ్రహాన్ని తీసుకొస్తారు. ఈ పంచలోహ విగ్రహం పైన ఒక కలశం ఉంటుంది. ఈ కలశాన్ని బియ్యపు పిండిపై తిప్పుతూ రాసేటట్లుగా ఉంచుతారు.

భక్తులు తమ మనసులో లేదా ఏదైనా భాషలో ప్రశ్న అడిగినప్పుడు, ఆ ఇద్దరు గ్రామస్తులు ఆ అమ్మవారి విగ్రహాన్ని కదిలిస్తూ ఉంటారు. ఆ సమయంలో, అమ్మవారి కలశం బియ్యపు పిండిపై అక్షర రూపంలో రాసుకుంటూ వెళ్తుంది. ఈ విధంగా అక్షరాలు రాస్తున్న విషయం ఆ గ్రామస్తులకు కూడా తెలియదు. ఇది షార్ట్‌హ్యాండ్ పద్ధతిలో కన్నడ భాషలో రాయబడుతుంది. పూజారి ఆ రాసిన అక్షరాలను చూసి, భక్తులు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేస్తారు. ఈ ప్రక్రియ భక్తులకు తమ సమస్యలకు స్పష్టమైన మార్గాన్ని అందిస్తుంది.

భక్తుల విశ్వాసం మరియు అనుభవాలు :

ఈ ఆలయంలో లభించే అక్షర రూప సమాధానాలను ఎంతో మంది భక్తులు గట్టిగా విశ్వసిస్తారు. ఇప్పటివరకు ఈ పద్ధతి తప్పు అని నిరూపించిన ఆధారాలు లేవు. చాలా మంది భక్తులు దూరమైన బంధుమిత్రులను తిరిగి కలుసుకోవడానికి, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడానికి, అలాగే ఉద్యోగం, వివాహం వంటి అనేక సమస్యలకు పరిష్కారాలను ఈ ఆలయం ద్వారా పొంది ఎంతో సంతోషంగా వెళ్తారు. ఇతర జ్యోతిష్యుల వద్దకు వెళ్లి ప్రయోజనం లేని వారు ఈ అమ్మవారిని నమ్మి దర్శిస్తే తప్పక పరిష్కారం లభిస్తుందని నమ్ముతారు.

ప్రముఖుల సందర్శన మరియు ప్రాధాన్యత : 

ఈ ఆలయాన్ని ఎంతో మంది ప్రముఖులు దర్శించారు. ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కూడా 2006లో ఈ ఆలయాన్ని దర్శించగా, ఆయన భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతారని ఇక్కడ అక్షర రూపంలో ప్రెడిక్ట్ చేయబడిందని తెలుస్తోంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ అయిన రవిశంకర్ గారు కూడా ఈ అమ్మవారికి పరమ భక్తులు. ఈ అమ్మవారి మహిమల గురించి ఇప్పటికే ఎన్నో టీవీ ఛానెళ్లలో కార్యక్రమాలు వచ్చాయి, ప్రముఖులు కొనియాడారు.

ఆలయ చిరునామా మరియు ప్రయాణ వివరాలు : 

దాసరిఘట్ట శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో తిత్తూరు పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు నుండి తిత్తూరు 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ ఆలయం సమస్యలతో సతమతమయ్యే అనేక మంది భక్తులకు శాంతి మరియు పరిష్కారాన్ని అందిస్తోంది.

మరిన్ని ఇటువంటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.