తెలుగు తేజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి(NKR) కష్ఠానికి ఎట్టకేలకు ఫలితం దక్కనుంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ విశాఖపట్నం కుర్రాడు అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు.
వచ్చే నెల 6 నుండి జరగబోయే జింబాబ్వే టీ20ల సిరీస్ కోసం వెళ్లనున్న భారత జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కనుందని తెలుస్తుంది. ఈ జింబాబ్వే పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉండనున్న నేపథ్యంలో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వనున్నారు. ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆటగాళ్లతో కూడిన యువ జట్టును జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ ఐపీఎల్ 2024 సీజన్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 33.67 సగటుతో 303 పరుగులు చేశాడు. 142.92 స్ట్రైక్‌రేట్‌తో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కీలక బ్యాటర్లంతా విఫలమైన వేళ నితీష్ కుమార్ రెడ్డి(76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసాడు. ఈ ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు తనకష్టానికి ప్రతిఫలంగా టీమిండియా పిలుపును అందుకోనున్నాడు. దీంతో అతి త్వరలోనే టీమిండియాకు ఆడాలనే తన కలను నిజం చేసుకోబోతున్నాడు.
జూలై 6 నుంచి 14 వరకు జింబాబ్వేలో భారత జట్టు పర్యటించనుంది. అయితే NKR తో పాటు ఈ ఐపీఎల్ 2024 సీజన్‌లో మెరుగైన ప్రదర్శన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, విజయ్‌కుమార్ వైశాఖ్, యశ్ దయాల్‌లకు టీమిండియా నుండి పిలుపు వచ్చినట్లు సమాచారం. వీరిని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)కు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ కుర్రాళ్లతో పాటు కాస్త సీనియర్ ఆటగాళ్లు అయిన శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు కూడా జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్త కోచ్ పర్యవేక్షణలో టీమిండియా ఈ పర్యటనకు వెళ్లనుందని సమాచారం. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియన్న విషయం మనందరికి తెలిసిందే.
మరిన్ని క్రీడావిశేషాల కొరకుతెలుగు రీడర్స్ క్రీడలుని సందర్శించండి.