Secrets of golden lanka

బంగారు లంక రహస్యాలు: రావణుడి మాయా సామ్రాజ్యం మరియు అతని పతనానికి గల అసలు కారణాలు!

by Lakshmi Guradasi

Secrets of golden lanka ravana: శ్రీరాముడు రావణుడిని అంతం చేయడంతో రామాయణం ముగిసిందని అందరూ భావిస్తారు, కానీ దాని వెనుక మనకు ఊహించని ఎన్నో వీడని రహస్యాలు దాగి ఉన్నాయి. హనుమంతుడు దహనం చేసిన బంగారు లంక నిజంగానే పూర్తిగా బూడిదైపోయిందా, అసలు రామాయణ యుద్ధానికి కారణమైన సూర్పణఖ ఆ తర్వాత ఏమైంది? దేవతలు సైతం భయపడే స్థాయికి ఎదిగిన రావణుడి మాయా సామ్రాజ్యం వెనుక ఉన్న అద్భుత శక్తులు, పాతాళ లోకపు తాంత్రిక సోదరులు మరియు అతని వెనుక ఉండి నడిపించిన ఒక రహస్య వ్యూహకర్త గురించిన ఆసక్తికరమైన నిజాలను ఈ వ్యాసంలో లోతుగా తెలుసుకుందాం.

అద్భుత బంగారు లంక నిర్మాణం మరియు దాని అసలు కథ

శివపార్వతుల కోరిక – విశ్వకర్మ అద్భుత సృష్టి

చాలా కాలం క్రితం పరమశివుడు, పార్వతీ దేవి కైలాస పర్వతం మీద నివసించేవారు. ఒకరోజు పార్వతీ దేవి శివుడితో కైలాసం మీకు ఎంతో ఇష్టమైన ప్రదేశమే అయినప్పటికీ, తమకంటూ ముల్లోకాల్లో ఎక్కడా లేని విధంగా ఒక దివ్యమైన, అద్భుతమైన స్థానం ఉండాలని తన కోరికను వ్యక్తపరిచింది. ఆమె మాటలు విన్న పరమశివుడు చిరునవ్వు నవ్వి, వెంటనే దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిపించి ముల్లోకాల్లో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించవలసిందిగా ఆదేశించాడు. శివుని ఆదేశం అందగానే విశ్వకర్మ సముద్రం మధ్యలో ఉన్న త్రికూట పర్వతాన్ని ఎంచుకుని, అక్కడ ఒక అద్భుతమైన సువర్ణ నగర నిర్మాణాన్ని ప్రారంభించాడు. మెల్లగా ఆ పర్వతంపై బంగారు కాంతులు కనిపించడం మొదలయ్యాయి. విశ్వకర్మ అక్కడ ఎత్తైన రాజభవనాలు, రత్నాలతో అలంకరించిన గోడలు మరియు పెద్ద పెద్ద దర్వాజాలను ఏర్పాటు చేశాడు. ఆ రాజభవనాల వెలుగులు సముద్రం అవతలి ఒడ్డు నుంచి కూడా స్పష్టంగా కనిపించేవి. ఆ కోట కిటికీలు మరియు స్తంభాలను కూడా బంగారం, ఎన్నో విలువైన రత్నాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. నగరం లోపల అందమైన తోటలు, సరోవరాలు మరియు విశాలమైన దర్బార్లు వెలిశాయి. వీటన్నింటితో పాటు ఆ నగరానికి ఏర్పాటు చేసిన సురక్షితమైన సెక్యూరిటీ సిస్టమ్‌ను చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోయారు.

పూజ దక్షిణగా పొందిన విశ్రవసుడు – కుబేరుడి హస్తగతం

ఈ బంగారు నగరం నిర్మాణం పూర్తి కాగానే దానికి గృహప్రవేశం మరియు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేవతలు, మునులు మరియు ఎన్నో దివ్య శక్తులు ఈ పవిత్ర కార్యక్రమానికి ఆహ్వానించబడ్డారు. ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి పరమశివుడు మహర్షి విశ్రవసుడిని పంపించాడు. విశ్రవసుడు మొదటిసారి ఆ బంగారు నగరాన్ని చూసినప్పుడు, దాని అద్భుత సౌందర్యానికి కొన్ని క్షణాల పాటు ముగ్ధుడై అలాగే చూస్తూ ఉండిపోయాడు; ఎందుకంటే చుట్టూ బంగారు కాంతులు, రత్నాలతో నిండిన ఆ భవనాల నగరం సాక్షాత్తు స్వర్గంలా భాసించింది. వేద మంత్రాలతో పూజా కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన తర్వాత, భోళాశంకరుడైన శివుడు ఎంతో సంతోషించి పూజ చేసినందుకు దక్షిణగా ఏమి కావాలో కోరుకోమని విశ్రవసుడిని అడిగాడు. అప్పుడు విశ్రవసుడు కాసేపు మౌనంగా ఉండి, అందరూ షాక్ అయ్యేలా ఆ బంగారు నగరమే తనకు దక్షిణగా కావాలని కోరుకున్నాడు. అయితే పరమశివుడు దానం చేయడంలో ఎప్పుడూ వెనకడుగు వేయడు కాబట్టి, ఏమాత్రం ఆలోచించకుండా ఆ క్షణమే ఆ బంగారు నగరాన్ని విశ్రవసుడికి దానంగా ఇచ్చేశాడు. కొంతకాలం తర్వాత విశ్రవసుడి పెద్ద కుమారుడు మరియు ధర్మాత్ముడైన కుబేరుడి చేతికి ఈ లంకా నగరం వచ్చింది. కుబేరుడు ఆ లంకను తన రాజధానిగా చేసుకుని, తన వద్ద ఉన్న అంతులేని సంపదతో మరియు పుష్పక విమానంతో అక్కడ నివసించసాగాడు; అప్పటి నుండి లంక కేవలం అందమైన నగరం మాత్రమే కాకుండా ఒక అపారమైన మహా సంపదకు ప్రతీకగా మారింది.

రావణుడి ఆక్రమణ – రహస్య స్వరంగాలు మరియు మాయా శక్తుల అడ్డా

ఆ సమయంలో బంగారు లంకను మర్చిపోలేని మరొక రాక్షస రాజు ఉన్నాడు, అతడే సుమాలి. సుమాలి అప్పట్లో అత్యంత శక్తీవంతమైన రాక్షస రాజులలో ఒకడు. రాక్షస జాతి పోగొట్టుకున్న పాత వైభవాన్ని, శక్తులను మళ్ళీ తిరిగి సొంతం చేసుకోవాలని బలంగా ఆకాంక్షించినప్పటికీ, దేవతలను మరియు కుబేరుడిని నేరుగా ఎదిరించేంత శక్తి అతని దగ్గర లేదు. అదే సమయంలో అతని చూపు మహర్షి విశ్రవసుడిపై పడింది. విశ్రవసుడు గొప్ప తపస్వి మాత్రమే కాదు, ఎంతో తేజస్సు ఉన్న పండితుడు. రాక్షసుల బలం మరియు విశ్రవసుడి తేజస్సు కలిస్తే ప్రపంచాన్ని జయించే ఒక గొప్ప యోధుడు పుడతాడని భావించి, సుమాలి ఒక వ్యూహం ప్రకారం తన కుమార్తె కైకను (కైకసి) విశ్రవసుడి సేవ కోసం పంపించాడు. కైక ఎంతో వినయంతో సేవలు చేయడంతో వారిద్దరికీ వివాహం జరిగింది. వారి వివాహం ద్వారా పుట్టిన కుమారుడే రావణుడు. పుట్టుకతోనే అతనిలో అసాధారణ తేజస్సు ఉండేది మరియు వయసు పెరిగే కొద్దీ అతని వేద శాస్త్రాల పరిజ్ఞానం, తపశ్శక్తి గురించి ముల్లోకాల్లో చర్చలు మొదలయ్యాయి. రావణుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఎన్నో దివ్యమైన వరాలు పొందాడు. ఒకరోజు సుమాలి రావణుడిని తనతో పాటు తీసుకువెళ్ళి, దూరం నుండి ఆ బంగారు లంకను చూపిస్తూ, ఇది ఒకప్పుడు రాక్షసుల వైభవానికి ప్రతీక అని, కానీ ఇప్పుడు అది అతని సవతి సోదరుడైన కుబేరుడి చేతిలో ఉందని రావణుడి మనసులో ఆ లంకను దక్కించుకోవాలనే కోరికను రేకెత్తించాడు. సరైన సమయం రాగానే రావణుడు తన శక్తితో కుబేరుడిని ఓడించి లంకను, అతని దగ్గర ఉన్న పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

రావణుడు మరియు అతని తాత సుమాలి కలిసి ఆ లంకను కేవలం సంపదకే పరిమితం చేయకుండా, ఒక భయంకరమైన రహస్య మాయాశక్తుల అడ్డగా మార్చారు. బయట నుంచి ఎంతో అందంగా కనిపించే ఆ నగరం లోపల మాత్రం శత్రువులకు అత్యంత ప్రమాదకరమైనది. లంక భూభాగం కింద విస్తారమైన రహస్య సొరంగాల (సురంగాల) నెట్‌వర్క్ ఉండేది. కొన్ని సొరంగాలు నేరుగా రాజభవనానికి దారితీస్తే, మరికొన్ని సముద్రం ఒడ్డుకు చేరుకునేవి; ఈ సొరంగాలు మరియు వాటి దారులు కేవలం రావణుడికి, అతని అత్యంత నమ్మకస్తులకు మాత్రమే తెలిసేవి. అంతేకాకుండా రాజభవనం లోపల ఎవరికీ తెలియని అనేక రహస్య గదులు (సీక్రెట్ రూమ్స్) ఉండేవి. వీటి గురించి సాధారణ ప్రజలకే కాకుండా అక్కడ కాపలా ఉండే సైనికులకు కూడా తెలిసేది కాదు. ఆ గదులలో అత్యంత అరుదైన అస్త్ర శస్త్రాలు, యుద్ధ రహస్య గ్రంథాలు మరియు బయటి ప్రపంచానికి తెలియకుండా రావణుడు దాచిపెట్టిన ఎన్నో రహస్య వస్తువులు భద్రపరచబడి ఉండేవి. ఆ భవనంలోని కొన్ని గదులకు అసలు ద్వారాలు (డోర్స్) ఉన్నాయనే విషయం కూడా ఎవరికీ తెలిసేది కాదు. అన్నింటికంటే లంకకు ఉన్న అసలు బలం దాని ‘మాయ’. శత్రువులు లంకలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశిస్తే వారికి అసలు దిక్కులు కూడా కనిపించవు. తాము సరైన దారిలోనే వెళ్తున్నామని భావించినప్పటికీ వారు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు. ఒకచోట దారి మూసుకుపోయినట్లు కనిపిస్తుంది కానీ అసలైన దారి అక్కడే ఉంటుంది. ఈ విధంగా మాయా శక్తుల ప్రభావంతో లంక శత్రువులపాలిట ఒక పెద్ద మిస్టరీగా నిలిచింది.

లంక నిజంగా బూడిదైందా? పురాణాల్లో లంకా దహన నిజాలు

హనుమంతుడు తగలబెట్టింది లంకనా లేక బంగారాన్నా?

హనుమంతుడు తన తోకతో లంకకు నిప్పు అంటించినప్పుడు, ఆ నగరం మొత్తం భయంకరమైన మంటల్లో చిక్కుకుంది. రావణుడి గర్వానికి ప్రతీకగా నిలిచిన ఎత్తైన రాజభవనాలు, రక్షణ కోటలతో సహా లంకలోని చాలా ప్రాంతాలు కాలి బూడిదయ్యాయి. కానీ ఇక్కడ అందరూ ఆశ్చర్యపోయే ఒక ముఖ్యమైన రహస్యం ఉంది; హనుమంతుడు లంకను తగలబెట్టాడు కానీ అందులోని బంగారాన్ని కాదు. బంగారంతో నిర్మించిన ఆ అద్భుతమైన నగరానికి లంకా దహనం వల్ల భారీ నష్టం (డ్యామేజ్) వాటిల్లినప్పటికీ, అది పూర్తిగా అంతం కాలేదు. అందువల్లనే రావణ వధ ముగిసిన తర్వాత శ్రీరాముడు ఆ లంకను విభీషణుడికి అప్పగించాడు. ఒకవేళ ఆ లంకా నగరం గనుక పూర్తిగా నాశనమై ఉంటే, విభీషణుడు అక్కడ చాలా కాలం పాటు ఎలా పరిపాలించగలిగేవాడు? విభీషణుడి సుదీర్ఘ పాలనలో లంకలో ధర్మం, న్యాయం విలసిల్లాయి. కాలక్రమేణా ఆ లంక రాక్షస లక్షణాల నుండి దూరంగా జరిగిపోవడమే కాకుండా, రావణుడి కాలంలో లంకను శాసించిన మాయలు, భయానక శక్తుల ప్రభావం కూడా క్రమంగా కనుమరుగైపోయాయి.

సూర్పణఖ ప్రతీకారం: రావణుడి పతనానికి అసలు కారణం ఇదేనా?

లక్ష్మణుడి చేతిలో అవమానం మరియు దండకారణ్య యుద్ధం

శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు దండకారణ్యంలో ప్రశాంతంగా వనవాసం చేస్తున్న సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. ఒకరోజు రావణుడి చెల్లెలు సూర్పణఖ అక్కడికి వచ్చి, తనకున్న మాయా శక్తితో ఒక అందమైన మహిళగా మారి శ్రీరాముడి ముందుకు వెళ్లి తన వివాహ ప్రతిపాదన (ప్రపోజల్) పెట్టింది. అయితే శ్రీరాముడు తనకు ముందే పెళ్ళిఅయిందని చెప్పి, ఆమెను లక్ష్మణుడి దగ్గరకు పంపించాడు. లక్ష్మణుడు కూడా ఆమె ప్రపోజల్‌ను తిరస్కరించడంతో తీవ్ర అవమానం మరియు కోపంతో రగిలిపోయిన సూర్పణఖ తన నిజరూపంలోకి వచ్చి సీతాదేవి వైపు దూసుకొచ్చింది. ఆ సమయంలోనే లక్ష్మణుడు ఆమెను అడ్డుకుని, ఆమె ముక్కు మరియు చెవులను కోసి వేసాడు. నొప్పితో వెలవెల్లాడుతూ సూర్పణఖ నేరుగా దండకారణ్యంలో ఉన్న తన సోదరులైన ఖర దూషణుల దగ్గరికి వెళ్లి జరిగిన ఘోరాన్ని చెప్పి రోదించింది.

చెల్లెలికి జరిగిన ఈ ఘోర అవమానం గురించి వినగానే, ఆ ఇద్దరు సోదరులు ఒక పెద్ద రాక్షస సైన్యంతో యుద్ధానికి బయలుదేరారు. క్షణాల్లోనే ప్రశాంతంగా ఉన్న దండకారణ్యం ఒక భయంకరమైన రణరంగంగా మారిపోయింది. శ్రీరాముడు సీతాదేవి రక్షణ కోసం లక్ష్మణుడిని పంపించి, ఒంటరిగా వేలాది మంది రాక్షసులను ఎదుర్కొన్నాడు. ఆయన వదిలిన దివ్య బాణాల దెబ్బకు రాక్షస సైన్యం అంతా తునాతునకలైంది. చివరకు దూషణుడు, త్రిశరుడు మరియు స్వయంగా ఖరుడు కూడా శ్రీరాముడి చేతిలో ప్రాణాలు కోల్పోయారు. తన సోదరులు మరియు మొత్తం సైన్యం క్షణాల్లో నాశనం కావడం చూసిన సూర్పణఖ వెంటనే లంకకు చేరుకుని రావణుడికి జరిగిందంతా చెప్పింది. ఇక్కడి నుంచే సీతాపహరణం, లంకా యుద్ధం, ఆ తర్వాత రావణ సంహారం వరకు చరిత్ర గతిని మార్చేసిన ఎన్నో ఘటనలు జరిగాయి.

రావణుడి చేతిలో సూర్పణఖ భర్త విద్యుత్సీయుడి మరణం

రామాయణ యుద్ధం ముగిసిన తర్వాత రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు వంటి వీరులంతా చనిపోయారు కానీ సూర్పణఖ మాత్రం చరిత్ర పుటల నుంచి మాయమైపోయింది. రావణుడి పతనానికి నిజంగా ఆమె బీజం వేసిందా అనే ప్రశ్న వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ సర్గ 24 ప్రకారం, తన తాత సుమాలి మాట విని రావణుడు ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరినప్పుడు ముల్లోకాల్లో హాహాకారాలు సృష్టించాడు. ఈ విశ్వవిజయ యాత్రలో భాగంగా దారిలో కాలకేయులు అనే శక్తివంతమైన రాక్షసుల రాజ్యం కూడా ఎదురైంది. అక్కడే సూర్పణఖ భర్త అయిన విద్యుత్సీయుడు (విద్యుత్ శివుడు) రావణుడికి ఎదురుపడ్డాడు.

వాళ్లిద్దరి మధ్య రోమాలు నిక్కబొడుచుకునేలా ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. పురాణాల ప్రకారం కాలకేయ రాక్షసుల నాయకుడైన విద్యుత్సీయుడు అత్యంత శక్తివంతమైన మాయావి యోధుడు, అతని యుద్ధ కళలు మరియు మాయా శక్తుల వల్ల పెద్ద పెద్ద రాక్షస వీరుల్లో అతనికి మంచి పేరుండేది. కానీ చివరకు తన అహంకారం, కోపంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు తన దగ్గర ఉన్న ఒక శక్తివంతమైన అస్త్రంతో అతనిని చంపేశాడు. యుద్ధం గెలిచిన రావణుడు లంకకు తిరిగి రాగానే సూర్పణఖ ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడి, “ఓ రాజా! నువ్వు ప్రపంచాన్ని జయించావు కానీ నీ సొంత చెల్లెల్ని మాత్రం అనాథను చేశావు. యుద్ధంలో నా భర్తను చంపావు, ఇప్పుడు నేను విధవరాలిగా ఎక్కడికి వెళ్ళాలి?” అని నిలదీసింది. అప్పుడు రావణుడు పశ్చాత్తాపపడుతూ, యుద్ధభూమిలో అతను నాపై దాడి చేస్తున్నాడు కాబట్టి పొరపాటున చనిపోయాడని ఓదార్చాడు. దానికి పరిహారంగా ఆమెకు దండకారణ్యం అనే పెద్ద రాజ్యాన్ని అప్పగించి, ఆమె రక్షణ కోసం సోదరులైన ఖర దూషణలను 14 వేల మంది రాక్షస సైన్యంతో ఎల్లప్పుడూ అక్కడే రక్షణగా ఉంటారని మాట ఇచ్చాడు.

జానపద కథల ప్రకారం సూర్పణఖ వేసిన మాస్టర్ ప్లాన్

ఇక్కడే కథలో అత్యంత ఆసక్తికరమైన మిస్టరీ దాగుంది. వాల్మీకి రామాయణంలో సూర్పణఖ ప్రతీకారం గురించి స్పష్టమైన ఆధారాలు లేవు; కానీ మన దేశంలోని చాలా జానపద కథలు, దక్షిణ భారతదేశంలోని కొన్ని సాంప్రదాయ నమ్మకాల్లో ఈ కథకు సంబంధించి మరొక కోణం కనిపిస్తుంది. దాని ప్రకారం, సూర్పణఖ తనకు జరిగిన ముక్కు, చెవుల అవమానాన్ని మరియు అంతకంటే మిన్నగా తన భర్తను రావణుడు చంపిన ఘోరాన్ని ఎన్నటికీ మర్చిపోలేదు. రావణుడికి ఉన్న వరాలు, శక్తుల వల్ల అతనిని ఏ సాధారణ యోధుడు చంపలేడని ఆమెకు తెలుసు.

అడవిలో శ్రీరాముడు ఒంటరిగా ఖర దూషణుల 14 వేల మంది రాక్షస సైన్యాన్ని క్షణాల్లో హతమార్చడం చూసినప్పుడు, రాముడే రావణుడిని అంతమొందించగల సమర్థుడని సూర్పణఖ గ్రహించింది. అందుకే కొన్ని జానపద కథల ప్రకారం, ఆమె తనను తాను ఒక పావులా వాడుకుంది. రావణుడికి ఉన్న అతి పెద్ద బలహీనత అయిన అహంకారాన్ని రేకెత్తించి, అతనిని ఎలాగైనా శ్రీరాముడితో తలపడేలా చేయాలనే ఉద్దేశంతోనే ఆమె ఒక పెద్ద పన్నాగం పన్నింది. తద్వారా రాముడి చేతిలో రావణుడు సర్వనాశనం అయ్యేలా చేసి తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకుందని ఈ కథలు వివరిస్తున్నాయి. అయితే ఈ ప్రతీకార కోణం అన్ని గ్రంథాల్లో ఒకేలా ఉండదని, ఇది కేవలం జానపద కథలు మరియు సాంప్రదాయ నమ్మకాల్లో మాత్రమే కనిపిస్తుందని గుర్తుంచుకోవాలి.

అహిరావణ – మహిరావణుల తాంత్రిక రహస్యాలు

పాతాళ లోకానికి బహిష్కరణ – కామాఖ్య దేవి ఘోర తపస్సు

రామాయణంలో రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుల గురించి అందరూ మాట్లాడుకుంటారు కానీ చరిత్ర పుటల్లో మరుగైపోయిన అద్భుత మాయా యోధులు అహిరావణ మరియు మహిరావణులు. త్రేతాయుగంలో లంకాపతి రావణుడు జన్మించిన రోజునే, అతని తల్లి కైకసి గర్భం నుండి ఈ అహిరావణ మరియు మహిరావణ అనే కవల పిల్లలు కూడా జన్మించారు. అయితే వారు పుట్టినప్పుడే సాధారణ పిల్లల్లా కాకుండా, వారి శరీరాలపై నీలం మరియు నలుపు రంగులలో భయంకరమైన తాంత్రిక గుర్తులు ఉన్నాయి. వారు జన్మించిన ఆ క్షణంలో పట్టపగలే దట్టమైన చీకటి కమ్ముకుంది, ఆకాశం నుండి అకస్మాత్తుగా వర్షం మొదలైంది మరియు భూమి మొత్తం ఒక్కసారిగా కంపించింది. వారి తండ్రి అయిన మహర్షి విశ్రవసుడు తన దివ్యదృష్టితో ఆ ఇద్దరు శిశువుల జాతకాన్ని చూడగానే భయంతో వణికిపోయాడు. వారు సాధారణ పిల్లలు కారని, సాక్షాత్తు ఈ విశ్వాన్ని మింగేసే భయంకరమైన చీకటి శక్తులని మరియు మాయాజాలాలని ఆయన గ్రహించాడు. వీరు గనుక భూలోకంలో ఉంటే సృష్టి నాశనం కావడం ఖాయమని భావించిన విశ్రవసుడు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. రావణుడికి భూమిపై ఉన్న లంక బాధ్యతలను అప్పగించి, అహిరావణ మరియు మహిరావణులను భూమిపై నుండి శాశ్వతంగా బహిష్కరించి విశ్వానికి మరో చివర ఉన్న పాతాళ లోకానికి పంపించివేశాడు.

పాతాళ లోకానికి చేరుకున్న ఆ అన్నదమ్ములు ఊరికే ఉండలేదు; అక్కడ వారు తంత్ర దేవత అయిన కామాఖ్య దేవి కోసం అత్యంత ఘోరమైన తపస్సు చేశారు. ఆ దేవి అనుగ్రహంతో పాతాళ లోకాన్ని తమ సొంతం చేసుకుని అక్కడ చక్రవర్తులుగా మారారు. పాతాళ లోకంలో వారు అంతులేని తాంత్రిక మరియు సమ్మోహన విద్యలను అభ్యసించారు. కనురెప్పపాటులో తమ రూపాలను మార్చుకోవడం, ఆకాశం నుండి అగ్ని నదులను పారించడం మరియు ప్రాణం లేని రాళ్లను సైతం ప్రాణమున్న సైన్యంగా మార్చడం వంటి అద్భుత శక్తులు వారికి లభించాయి. అంతేకాకుండా, ప్రపంచం మొత్తాన్ని క్షణాల్లో గాఢ నిద్రలోకి పంపగలిగే భయంకరమైన సమ్మోహన శక్తి కూడా వారి సొంతమైంది. అహిరావణుడు ఎంతటి గొప్ప మాంత్రికుడు అంటే, అతను తన ప్రాణాలను ఐదు వేర్వేరు దిక్కులలో వెలుగుతున్న ఐదు తాంత్రిక దీపాలలో దాచిపెట్టాడు. వారి తాంత్రిక శక్తుల భయం చూసి సాక్షాత్తు యమధర్మరాజు కూడా పాతాళ లోకంలోని ఆ ప్రాంతంలో అడుగుపెట్టడానికి వణికిపోయేవాడు. రావణుడు రాజుగా ఉన్నంత కాలం వీరిని ఎప్పుడూ గుర్తుచేసుకోలేదు; కానీ రామరావణ యుద్ధంలో మేఘనాథుడు, కుంభకర్ణుడు వంటి మహావీరులు చనిపోయినప్పుడు, దిక్కుతోచని స్థితిలో పాతాళ లోకంలోని ఆ ఇద్దరు ప్రమాదకరమైన మాయావులకు రావణుడు కబురు పంపాడు.

శ్రీరామ లక్ష్మణుల కిడ్నాప్ – పంచముఖ ఆంజనేయుడి వీరవిహారం

రావణుడి నుండి సందేశం అందగానే అహిరావణ మరియు మహిరావణులు నేరుగా పాతాళ లోకం నుండి యుద్ధానికి బయలుదేరారు. అయితే వారు వస్తున్నారనే విషయం విభీషణుడికి ముందే తెలియడంతో, శ్రీరాముడి కుటీరం చుట్టూ గాలి కూడా చొరబడలేనంత బలమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. హనుమంతుడిని అప్రమత్తం చేయగా, హనుమంతుడు తన తోకను ఎంతగానో పెంచి శ్రీరాముడి కుటీరం చుట్టూ ఒక పెద్ద రక్షణ గోడలా మార్చాడు. కానీ అహిరావణుడు తన అత్యంత భయంకరమైన మాయను ప్రయోగించి, అచ్చం విభీషణుడి రూపంలోకి మారి హనుమంతుడిని మోసం చేసి కుటీరం లోపలికి ప్రవేశించాడు. లోపలికి వెళ్ళగానే తన తాంత్రిక శక్తులతో భయంకరమైన సమ్మోహన పొగను వదిలాడు, దాంతో హనుమంతుడితో పాటు వానర సైన్యం అంతా స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ అదును చూసి అహిరావణ, మహిరావణులు స్పృహలో లేని శ్రీరాముడిని, లక్ష్మణుడిని కిడ్నాప్ చేసి పాతాళ లోకంలోని ఒక రహస్య గుహలోకి తీసుకువెళ్ళారు. అక్కడ తమ కులదేవత ముందు ఆ ఇద్దరు దివ్య సోదరులను బలి ఇవ్వడానికి భారీ ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు.

కొద్దిసేపటికి హనుమంతుడికి మెలకువ వచ్చి తనకు జరిగిన మోసం గురించి తెలిసి కోపంతో రగిలిపోయాడు. శ్రీరాముడిని రక్షించడం కోసం హనుమంతుడు నేరుగా పాతాళ లోకంలోకి అడుగుపెట్టాడు. అక్కడ అహిరావణ, మహిరావణులు భయంకరమైన తాంత్రిక మంత్రాలు చదువుతూ శ్రీరాముడిని బలి ఇవ్వడానికి కత్తి పైకెత్తే తరుణంలో హనుమంతుడు వారిని అడ్డుకున్నాడు. అయితే ఆ ఇద్దరు రాక్షసులను చంపడం అంత సులువు కాదు; ఎందుకంటే వారి ప్రాణాలు ఐదు వేర్వేరు దిక్కులలో వెలుగుతున్న ఐదు తాంత్రిక దీపాలలో దాగి ఉన్నాయి, ఆ ఐదు దీపాలను ఒకే క్షణంలో ఒకేసారి ఆర్పివేస్తేనే వారి మరణం సంభవిస్తుంది. అప్పుడు ఆపద్బాంధవుడైన హనుమంతుడు ఆ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన పంచముఖ రూపాన్ని ధరించాడు. అందులో తూర్పున వానర ముఖం, పశ్చిమాన గరుడ ముఖం, ఉత్తరాన వరాహ ముఖం, దక్షిణాన నరసింహ ముఖం మరియు ఆకాశం వైపు హయగ్రీవ ముఖాలు ఉన్నాయి. హనుమంతుడు తన ఐదు ముఖాలతో ఒకేసారి గాలి ఊది ఆ ఐదు తాంత్రిక దీపాలను ఒకే క్షణంలో ఆర్పివేశాడు. దీపాలు ఆరిపోగానే అహిరావణ, మహిరావణుల తాంత్రిక శక్తులన్నీ క్షణంలో నశించిపోయాయి. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్న హనుమంతుడు తన గద మరియు దివ్యమైన కత్తితో వారి తలలను ఖండించి పాతాళ లోకపు అత్యంత క్రూరమైన రాక్షసులను అంతమొందించాడు. ఆ తర్వాత శ్రీరామలక్ష్మణులను బందీల నుండి విడిపించి సురక్షితంగా తీసుకువచ్చాడు. ఈ విధంగా చరిత్ర పుటలలో ఇవాల్టికీ మౌనంగా ఉండిపోయిన పాతాళ లోకపు సోదరుల ముగింపు జరిగింది.

సుమాలి: రావణుడి వెనుక ఉన్న అసలైన వ్యూహకర్త

పోగొట్టుకున్న రాక్షస వైభవాన్ని తిరిగి తేవాలన్న ఏకైక కల

రావణుడి తాత అయిన సుమాలి కేవలం అపారమైన శారీరక బలం కలిగిన యోధుడు మాత్రమే కాదు; ఆయన అసాధారణమైన బుద్ధిశక్తి, ముందుచూపు కలిగిన గొప్ప వ్యూహకర్త. రాజకీయాలు మరియు వ్యూహ రచనలలో ఆయనకు సాటి మరెవరూ లేరు. ఒకప్పుడు ఈ అద్భుత బంగారు లంక రాక్షసుల హస్తగతంగా ఉండేదని ప్రాచీన కథల ద్వారా తెలుస్తోంది. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారిపోవడంతో రాక్షస జాతి లంకను వదిలి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ పరాభవాన్ని, అవమానాన్ని సుమాలి తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేకపోయాడు. రాక్షసులు కోల్పోయిన ఆధిపత్యాన్ని, పూర్వ వైభవాన్ని ఎలాగైనా తిరిగి తీసుకురావాలని ఆయన ఏళ్ల తరబడి తన మనసులో ఒకే ఒక్క కలగంటూ జీవించాడు.

ఆ సమయంలో తన మనవడైన రావణుడిలో ఉన్న అసాధారణ ప్రతిభను, అఖండ పరాక్రమాన్ని మరియు తెలివితేటలను చూసినప్పుడు, తన అసంపూర్ణ కలను నిజం చేయగల సమర్థుడు అతడేనని సుమాలి బలంగా విశ్వసించాడు. అందుకే ఆయన తరచుగా రావణుడికి వారి పూర్వీకుల శౌర్యం గురించి, తాము కోల్పోయిన బంగారు లంక వైభవం గురించి మరియు రాక్షస వంశపు గొప్పతనం గురించి కథలు కథలుగా చెప్పేవాడు. ఈ కథలు వింటూ పెరగడం వల్లే మెల్లగా రావణుడిలో కూడా అవే ఆలోచనలు, లంకను సాధించాలనే బలమైన ఆకాంక్ష మొలకెత్తాయి.

సాదాసీదా రాజుగా కాకుండా ప్రపంచ విజేతగా మార్చిన గురువు

తన తాత మనసులో నాటిన ఆశయాల ప్రభావంతోనే రావణుడు కఠోరమైన తపస్సు చేయడం, ఆపై బ్రహ్మదేవుని నుండి ముల్లోకాలను శాసించగల దివ్య వరాలను పొందడం, ఆ తర్వాత తన సామ్రాజ్య విస్తరణను చేపట్టడం వంటివన్నీ జరిగాయి. కేవలం లంకకు రాజుగా మారి సంతోషపడితే సరిపోదని, ముల్లోకాలు మారుమోగిపోయేలా ఒక అజేయమైన మహా సామ్రాజ్యాన్ని స్థాపించాలని సుమాలి ఎప్పుడూ రావణుడికి నూరిపోస్తూ ఉండేవాడు. ఆ ప్రేరణతోనే రావణుడు తన సవతి సోదరుడైన కుబేరుడిపై దండెత్తి, అతనిని ఓడించి లంకతో పాటు దివ్యమైన పుష్పక విమానాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఎన్నో జానపద కథలు రావణుడు లంకను స్వాధీనం చేసుకోవడాన్ని సుమాలి కన్న పాత కల యొక్క నెరవేర్పుతోనే ముడిపెడతాయి.

లంకను కైవసం చేసుకున్న తర్వాత రావణుడి దృష్టి కేవలం లంకకే పరిమితం కాలేదు; అతని కీర్తి, పరాక్రమం మరియు ప్రభావం చాలా దూరం వరకు విస్తరించాయి. క్రమక్రమంగా అతని పేరు ముల్లోకాలలో ఒక భయానికి, అజేయమైన బలానికి ఒక సింబల్‌గా మారిపోయింది. అందుకే ఎన్నో పురాణాలలో సుమాలిని కేవలం రావణుడి తాతగా మాత్రమే కాకుండా, అతని మనసులో ఒక సాధారణ రాజుగా మిగిలిపోకుండా జగజ్జేతగా మారాలనే బలమైన కాంక్షకు బీజం వేసిన అసలైన గురువుగా, వ్యూహకర్తగా గుర్తుంచుకుంటారు.

రావణుడు చనిపోయిన తర్వాత లంకకు ఏమైంది?

విభీషణుడి ధర్మ పాలన మరియు లంకలో వచ్చిన మార్పులు

రామాయణ యుద్ధంలో శ్రీరాముడి చేతిలో రావణుడు సంహరించబడిన తర్వాత, లంకా నగర చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. లంకా దహనం సమయంలో హనుమంతుడు అంటించిన మంటల వల్ల నగరంలోని రాజభవనాలకు, కోటలకు భారీ నష్టం వాటిల్లినప్పటికీ, బంగారం ఎప్పటికీ కాలిపోదు కాబట్టి ఆ సువర్ణ నగరం పూర్తిగా నాశనం కాలేదు. అందువల్లనే రావణ వధ ముగిసిన వెంటనే శ్రీరాముడు లంకా సామ్రాజ్యానికి విభీషణుడిని రాజుగా పట్టాభిషేకం చేసి, ఆ నగర బాధ్యతలను అతనికి అప్పగించాడు.

విభీషణుడు లంకను రాజధానిగా చేసుకుని సుదీర్ఘ కాలం పాటు అత్యంత ధర్మబద్ధంగా పరిపాలించాడు. రావణుడి కాలంలో లంక అంతటా విస్తరించి ఉన్న రాక్షస అరాచకాలు, భయానక వాతావరణం విభీషణుడి పాలనలో పూర్తిగా మారిపోయాయి. ఆయన రాజ్యంలో ధర్మం, న్యాయం మరియు శాంతి వెల్లివిరిశాయి. కాలక్రమేణా లంకా నగరం రాక్షస లక్షణాల నుండి పూర్తిగా విముక్తమైంది. అంతేకాకుండా, రావణుడు మరియు అతని తాత సుమాలి సృష్టించిన భయంకరమైన మాయలు, శత్రువులను ముంచేసే తాంత్రిక శక్తుల ప్రభావం కూడా విభీషణుడి పవిత్ర పాలనలో మెల్లమెల్లగా కనుమరుగైపోయాయి.

మహాభారత కాలంలో లంక వైభవం – విభీషణుడిని కలిసిన సహదేవుడు

రామాయణ యుగం ముగిసి, యుగాలు మారినప్పటికీ లంకా నగరం యొక్క వైభవం తగ్గలేదు. ద్వాపర యుగంలో మహాభారత కాలంలో కూడా ఈ బంగారు లంక ప్రస్తావన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మహాభారత సభాపర్వంలో ఉన్న చారిత్రక కథనం ప్రకారం… పాండవ సోదరులలో చిన్నవాడైన సహదేవుడు రాజసూయ యాగం కోసం దక్షిణ దిశగా జైత్రయాత్రకు బయలుదేరాడు. ఆ యాత్రలో భాగంగా ఆయన సముద్ర తీరానికి చేరుకుని, లంకను పాలిస్తున్న విభీషణుడికి కబురు పంపాడు.

రాముడి పరమ భక్తుడైన విభీషణుడు పాండవుల ప్రతినిధిగా వచ్చిన సహదేవుడిని ఎంతో గౌరవించాడు. విభీషణుడు సహదేవుడికి స్వాగతం పలికి, లంకలో ఉన్న అపారమైన సంపద నుండి అత్యంత విలువైన రత్నాలు, ముత్యాలు మరియు లెక్కలేనంత ధనాన్ని కానుకలుగా సమర్పించి పాండవుల సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు. ఈ సంఘటనను బట్టి రామాయణ కాలం ముగిసి, ద్వాపర యుగం వచ్చేసరికి కూడా లంక అంతే అపారమైన సంపదతో, సువర్ణ వైభవంతో విలసిల్లిందని మనకు తెలుస్తోంది.

కలియుగారంభంలో సముద్ర గర్భంలో విలీనం – వీడని మిస్టరీ

ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైన తరుణంలో ఈ భూమిపై ఎన్నో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాచీన పురాణాలు మరియు సాంప్రదాయ నమ్మకాల ప్రకారం, కలియుగం మొదట్లో ప్రకృతిలో సంభవించిన భయంకరమైన భౌగోళిక మార్పుల వల్ల సముద్రాల రూపురేఖలు మారిపోయాయి మరియు భూమి ఆకారం కూడా మారిపోయింది. ఆ సమయంలోనే ద్వారక వంటి ఎన్నో ప్రాచీన నగరాల వలె, ఈ బంగారు లంక కూడా మెల్లమెల్లగా సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెబుతారు.

ఇవాల్టికీ లంక యొక్క అసలు ఉనికి ఎక్కడ ఉంది, అది నిజంగా ఎక్కడ మునిగిపోయింది అనే విషయాలపై ఎన్నో భిన్నమైన వాదనలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ శాస్త్రీయంగా గానీ, ఖచ్చితంగా గానీ ఆ సువర్ణ లంక రహస్యం ఏంటనేది ఎవరికీ పూర్తిగా తెలియదు. బహుశా అందుకే, బంగారు లంక అనేది కేవలం ఒక నగరం మాత్రమే కాకుండా, యుగయుగాలుగా మానవాళిని ఆశ్చర్యపరుస్తున్న ఒక అంతుచిక్కని మహా మిస్టరీగా మిగిలిపోయింది.

Read also: సిగిరియా: రావణుడి అద్భుత కోట రహస్యాలు..

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ ఫ్యాక్ట్స్ ను చూడండి.

You may also like