Pilli addamlo andam moral story

పిల్లి అద్దంలో అందం

by Lakshmi Guradasi

ఒకరోజు ఓ పిల్లి పాలు కోసం ఒక ఇంట్లోకి దూరింది. వంటగదిని వెతుకుతూ అటూ ఇటూ తిరుగుతుండగా ఒక గదిలోకి వెళ్లింది. అక్కడ బల్లపై రంగురంగుల క్రీములు, పౌడర్లు, కాటుక, సువాసన నూనెలు కనిపించాయి. ఎదురుగా ఉన్న అద్దంలో తనను తాను చూసుకున్న పిల్లికి మరింత అందంగా కనిపించాలనే కోరిక కలిగింది. వెంటనే క్రీము రాసుకుని, పౌడర్ పట్టుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుటిపై బొట్టు దిద్దుకుని ఎంతో మురిసిపోయింది.

కొద్దిసేపటి తర్వాత వంటగదిలోకి వెళ్లి పాలు తాగి తన పిల్లల దగ్గరకు బయలుదేరింది. కానీ తల్లి పిల్లిని చూసిన వెంటనే పిల్లిపిల్లలు భయంతో దూరంగా పారిపోయాయి. రంగులు పూసుకుని వింతగా కనిపిస్తున్న ఆ ప్రాణి తమ తల్లేనని అవి గుర్తించలేకపోయాయి. తల్లి ఎంత దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించినా, పిల్లలు మరింత భయపడుతూ దూరంగా జరిగిపోయాయి.

అప్పుడు పిల్లికి తన తప్పు అర్థమైంది. వెంటనే నీటి దగ్గరకు వెళ్లి ముఖం, ఒంటిపై ఉన్న రంగులన్నీ కడిగేసుకుని తన సహజ రూపంలోకి వచ్చింది. ఆ తర్వాత పిల్లల దగ్గరకు వెళ్లగానే అవి ఆనందంగా తల్లి వద్దకు చేరి పాలు తాగసాగాయి. పిల్లి కూడా తన పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుని, నిజమైన అందం సహజత్వంలోనే ఉంటుందని గ్రహించింది.

నీతి:

మన అసలు స్వరూపం, మంచి గుణాలే నిజమైన అందం. ఇతరులను ఆకట్టుకోవడానికి మన సహజత్వాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు.

మరిన్ని ఇటువంటి కథల కోసం తెలుగు రీడర్స్ నీతి కథలు ను చూడండి.

You may also like