మహాభారతంలోని అరణ్య పర్వం మనకు జీవన సత్యాలను బోధించే అద్భుత ఘట్టాలతో నిండి ఉంది. అందులో అత్యంత ప్రాముఖ్యమైనది యక్ష ప్రశ్నలు. పాండవులు వనవాసంలో ఉన్న సమయంలో జరిగిన ఈ సంఘటనలో, యమధర్మరాజు యక్షుడి రూపంలో వచ్చి ధర్మరాజును పరీక్షించడం ద్వారా మనుష్య జీవితానికి అవసరమైన విలువలను తెలియజేస్తాడు.
ఈ కథ కేవలం పురాణ సంఘటన మాత్రమే కాదు, నేటి జీవితానికి కూడా మార్గదర్శకం. సత్యం, ధర్మం, సహనం, జ్ఞానం వంటి విలువలు ఎంత ముఖ్యమో ఈ ప్రశ్నల ద్వారా స్పష్టమవుతుంది.
యక్ష ప్రశ్నల కథ ఏమిటి?
వనవాసంలో ఉన్న పాండవులు ఒకసారి దప్పికతో నీటి కోసం వెతుకుతారు. ఒక సరస్సు కనిపించగానే, ముందుగా వెళ్లిన సహోదరులు యక్షుడి హెచ్చరికను పట్టించుకోకుండా నీరు తాగి స్పృహ తప్పుతారు.
చివరగా వచ్చిన ధర్మరాజు, యక్షుడు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తన జ్ఞానం, వివేకం చూపిస్తాడు. ఫలితంగా యక్షుడు సంతోషించి అతని అన్నదమ్ములను తిరిగి ప్రాణాలతో చేస్తాడు.
72 యక్ష ప్రశ్నలు – జవాబులు (72 Yaksha Prashnalu and Answers in Telugu)
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? బ్రహ్మం.
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు.
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? ధర్మం.
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? సత్యం.
5. మానవుడు దేని వలన శ్రోత్రియుడగును? వేదం.
6. దేని వలన మహత్తును పొందును? తపస్సు.
7. మానవునికి సహాయపడునది ఏది? ధైర్యం.
8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుట వలన.
9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? అధ్యయనము వలన.
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సు వలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము కలుగుతాయి.
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? మృత్యుభయం వలన.
12. జీవన్మృతుడెవరు? దేవతలకూ, అతిథులకూ, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు.
13. భూమి కంటే భారమైనది ఏది? తల్లి (జనని రుణం).
14. ఆకాశం కంటే ఉన్నతమైనది ఏది? తండ్రి.
15. గాలికంటే వేగమైనది ఏది? మనస్సు.
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే మనస్సు బాధపడుతుందో, తాను కూడా ఇతరుల పట్ల అట్టి పనులు చేయకుండా ఉండేవాడికి సజ్జనత్వం వస్తుంది.
17. తృణం కంటే దట్టమైనది ఏది? చింత (ఆందోళన).
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప.
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యచే.
20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయటం వలన.
21. జన్మించియు ప్రాణం లేనిది ఏది? గుడ్డు.
22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? రాయి.
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన.
24. ఎల్లప్పుడూ వేగం గలదేది? నది.
25. రైతుకి ఏది ముఖ్యం? వాన.
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? వరుసగా స్వార్థం, వైద్యుడు, శీలవతి అయిన భార్య, సుకర్మ (మంచి పనులు) బంధువులవుతారు.
27. ధర్మానికి ఆధారమేది? దయదాక్షిణ్యం.
28. కీర్తికి ఆశ్రయమేది? దానం.
29. దేవలోకానికి దారి ఏది? సత్యం.
30. సుఖానికి ఆధారం ఏది? శీలం.
31. మనిషికి దైవిక స్నేహితుడు ఎవరు? భార్య లేదా భర్త.
32. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు.
33. మానవునకు జీవనాధారమేది? మేఘం.
34. మనిషి దేనివల్ల సంతసించును? దానం.
35. లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం.
36. సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం.
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస.
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు.
39. ఎవరితో సంధి శిధిలమవదు? సజ్జనులతో.
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? యాగకర్మ.
41. లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు.
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి, ఆకాశములందు.
43. లోకాన్ని కప్పివున్నది ఏది? అజ్ఞానం.
44. శ్రాద్ధవిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు.
45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ (కోరిక) విడచినచో.
46. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తికుల ధర్మం ఆచరించడం.
47. క్షమ అంటే ఏమిటి? ద్వందాలు (కష్టసుఖాలను) సహించడం.
48. సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే భయపడటం.
49. సర్వధని అని ఎవరిని అంటారు? ప్రియాప్రియాలను, సుఖ దుఃఖాలను సమంగా ఎంచువాడు.
50. జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించగలగడం.
51. దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖము కోరడం.
52. అర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండటం.
53. సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట.
54. దుఃఖం అంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటం.
55. ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం.
56. స్నానం అంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం.
57. దానం అంటే ఏమిటి? సమస్త ప్రాణుల్ని రక్షించడం.
58. పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు.
59. మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు.
60. ఏది కాయం? సంసారానికి కారణమైంది.
61. అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం.
62. డంభం అంటే ఏమిటి? తన గొప్ప తానే చెప్పుకోవటం.
63. ధర్మం, అర్థం, కామం ఎక్కడ కలియును? తన భార్యలో లేదా తన భర్తలో.
64. నరకం అనుభవించే వారెవరు? ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్ని, దేవతల్ని ద్వేషించేవాడు.
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే.
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి (స్నేహం).
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు.
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు.
69. జీవితం మొత్తము మీద సుఖముగా ఉండేవాడు ఎవరు? అప్పులేనివాడు, తనకున్న దానితో తృప్తి చెందేవాడు.
70. లోకంలో ఆశ్చర్యకరమైన విషయం ఏది? ప్రాణులు ప్రతి రోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా, మనిషి తానే శాశ్వతంగా ఉండిపోతాననుకోవడం.
71. అందరికన్నా ధనవంతుడెవరు? సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు.
72. స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు? నిందాస్తుతులు, శీతోష్ణాలు, కలిమి లేములను సమానంగా చూస్తూ, లభించిన దానితో సంతృప్తుడై ఉండేవారు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ పొడుపు కథలు ను చూడండి.