Home » మహాశివరాత్రి పూజ నియమాలు , విధానం, విశిష్టత….!!

మహాశివరాత్రి పూజ నియమాలు , విధానం, విశిష్టత….!!

by Lakshmi Guradasi
981 views
Maha shivaratri puja vidhi fasting importance

దేవాది దేవుడు పరమశివుని ప్రసన్నం కొరకై చేసే పూజల్లో శివరాత్రి ఎంతో ప్రాధాన్యమైనది. శివరాత్రి నెలకు ఒకటి చొప్పున్న పన్నెండు నెలలకు పన్నెండు శివరాత్రులు వస్తాయి.

వీటిల్లో మహాశివరాత్రి సంవత్సరకాలానికి ఒకటి మాత్రమే వస్తుంది. మహాశివరాత్రి హిందువుల పండగలలో అత్యంత ప్రముఖమైనది. ఈ మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్ధి నాడు అనగా చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తమైనపుడు సంభవిస్తుందని, పరమశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని  శివపురాణంలో చెప్పబడిందని పండితులు చెబుతున్నారు. 

మహాశివరాత్రి నాడు శివభక్తులు దేశవ్యాప్తముగా శివనామ ఆరాధనతో విశేషంగా శివాలయాలను సందర్శిస్తుంటారు. తెల్లవారుఝామునే నిద్ర లేచి శిరస్నానం చేసి సంప్రదాయ దుస్తులు ధరించి శివుడిని గృహములో పూజలు చేసి సమీప శివాలయాన్ని దర్శించుకొంటారు. శివునికి ప్రీతికరమైన బిల్వపత్రాలను, ఆవుపాలు, తేనే, పంచామృతాలతో అభిషేకింఛి తన్మయత్వం చెందుతుంటారు. రోజంతా ఉపవాసం చేసి శివనామ స్మరణతో రాత్రంతా మెలుకువగా వుండి మహాశివరాత్రి జాగారం చేసి శివకృపకు పాతృలవుతారు.

శివరాత్రి కధలు:

క్షీరసాగరమధనం:

శివరాత్రి ఎలా వచ్చిందనే కథలు పురాణంలో చాలానే ఉన్నవి. క్షీరసాగారమధనంలో కాలకూట విషం ఉద్భవించినప్పుడు దేవతలు, రాక్షషులు ఖంగారుపడ్డారు. ఈ కాలకూట విషానికి లోకాన్ని నాశనం చేసే శక్తి ఉంది. దీని నుంచి లోకాన్ని ఎలా కాపాడాలో  తెలియక దేవతలు, రాక్షషులు పరుగు పరుగున శంకరుని వద్దకు వెళ్లి శరణు వేడుకొన్నారు. అంతట ఆ మహాశివుడు లోక శ్రేయోదాయకమై గరళాన్ని మింగి తన గొంతులో దాచుకొన్నాడు. లోకాన్ని నాశనం చేసే శక్తిమంతమైన గరళాన్ని తన కంఠంలో దాచుకొన్నందున కంఠసీమ మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. అందుచేతనే ఆ పరమశివునకు నీలకంఠడనే పేరు వచ్చింది. లోకానికి ముప్పు తొలగిన ఆ రాత్రినే హిందువులు మహాశివరాత్రి గా జరుపు కొంటున్నారు. 

శివరాత్రి జాగరణ, ఫలితం :

ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతములో ఉన్న గూడెంలో కర్కసుడైన ఓ వేటగాడు ఉండేవాడు. అనుదినం అడవిలోకి వెళ్లి కిరాతకంగా ఏదేని జంతువుని వేటాడి  తన కుటుంబానికి ఆహారంగా తెస్తుండేవాడు.ఒకనాడు అడవిలో ఎప్పటివలె వేటకు వెళ్ళగా ఒక్క జంతువుకూడా కనపడక నానా యాతన పడ్డాడు. ఒక్క జంతువునైనా వేటాడకుండా తిరిగి వెళ్ళటం ఇష్టం లేక అడవంతా కలియ తిరిగాడు.ఒక్క జంతువైన కనపడలేదు సరికదా అప్పటికే చీకటి పడిన సంగతిని గమనించిన వేటగాడు తాను దట్టమైన అడవి మధ్యభాగంలో ఉన్నట్లు గుర్తించి, తన గూడెంకు చేరుకొనే అవకాశం లేక పోవటంతో, అక్కడే ఉన్న ఓ చెట్టు పైకెక్కాడు. రాత్రి సమయంలో ఆ అడవిలో కౄరమృగాలు సంచరిస్తాయి. ఇవి తలచుకున్న వేటగాడు భయంతో గజ గజలాడుతూ చెట్టు ఆకులను ఒక్కొక్కటి పీకుతూ కిందకు వేస్తున్నాడు. పడుకుని కిందకు పడితే కౄరమృగాలకు ఫలహారంగా మరిపోతననే భయంతో కునుకు దరిచేరకుండా, ధైర్యం పొందేందుకు శివనామ స్మరణ చేస్తూ గడిపాడు. అంతే సూర్యుడు ఉదయించే సరికి పరమశివుడు ప్రత్యక్షమై వేటగానికి శివలోకప్రాప్తి కలిగించాడు. వేటగాడు భయంతో ఎక్కినా ఆ చెట్టు బిల్వవృక్షం! శివనామ స్మరణతో జాగరణ చేసిన రాత్రి మహాశివరాత్రి కావడం!! 

వేటగాడు శివకృపకు పాత్రుడై శివలోకప్రాప్తి చెందినట్లు మరొక కథనం!!

మహాశివరాత్రి..

మహాశివరాత్రి పూజనాడు ఆచరించాల్సిన నియమాలు : సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. ప్రవహించే నదిలో కానీ, సమీపంలో గల తటాకము లేదా చెరువులో కానీ,నూతినీటితో కానీ శిరస్నాన మాచరించాలి. రోజంతా ఉపవాస దీక్షలో ఉండాలి. రోజంతా యోగదీక్షలో ఉంటూ ఈ క్రింది మంత్రాలను పఠిస్తూ జాగారం దీక్షను ఆచరించాలి.

⟾  శివ బీజాక్షరీ మంత్రం

        ఓం నమః శివాయ

⟾ మృత్యుంజయ మంత్రం :

      ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం

      ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

⟾ రుద్రాగాయత్రి:

      ఓం తత్పురుషాయ విద్మహే

      మహా దేవాయ ధీమహి

      తన్నో రుద్ర ప్రచోదయాత్

పై మంత్రాలను మీ శక్తి మీరకు పఠించండి..

తొలిసారి రుద్రాక్ష ధరించేవారు ఈరోజు రుద్రాక్ష ధరిస్తే ఎంతో మంచిది. మహాశివరాత్రి రోజు బిల్వ పత్రాలతో పూజిస్తే మంచిది. మహాశివరాత్రి శివలింగానికి పంచామృతాల (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార)తో అభిషేకిస్తే శివకృపకు పాతృలౌతారు. 

మహాశివరాత్రి జాగరణ :

ఈరోజు పాటించేసిన నియమాల్లో జాగరణ ప్రాముఖ్యతే అధికం. మహాశివరాత్రి వచ్చిందంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో నిష్ఠతో జాగరణ నియమాన్ని ఆచరించి ఆదియోగి, దేవాది దేవుడైన ఆ పరమశివుని కృపకొరకు పోటీపడుతుంటారు. జాగరణలో ఉన్న శివభక్తుల కొరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వేదప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు…స్వస్తీ..

శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి..?

సాధారణంగా ఉపవాసం అన్నప్పుడు ఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది. ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది. దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగా మన శరీరంలో సంచితమై ఉన్న పాపాలు పోతాయి. బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల శుద్ధి అవుతాం. శుద్ధి అయితేనే సిద్ధి. కనుక ఉపవాసం చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు. ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు. కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. అది వారి శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది. మొండిగా ‘మేం పాటిస్తున్నాం’ అని చాదస్తంతో శరీరాన్ని మాత్రం బాధపెట్ట కూడదు. అలాగని శరీరాన్ని సుఖపెట్టే ప్రయత్నంలో అసలు సాధన చేయకుండా ఊరికే ఉండకూడదు. ఆహార నియంత్రణ అయినా చేయగలగాలి. రుచికోసం కాకుండా దేహధారణార్థం సాత్త్వికమైన ఫలాహారమో, క్షీరమో తీసుకుని ఉపవాస దీక్ష చేయవచ్చు. ఆహార నియంత్రణ, మెలకువ ఈ రెండింటితోనే మహాశివరాత్రి ఆరాధన చేయాలి. అలా ఒక్క శివరాత్రి నియమబద్ధంగా చేసినప్పటికీ సంవత్సరకాల శివారాధన చేసిన ఫలితం లభిస్తున్నదని శాస్త్రంలో ఉన్న విషయం…

See Also plz click on this: story-of-maha-sivaratri

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.