త్రిమూర్తుల్లో సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు శివుడు. ఆయనకు భక్తులెక్కువ. ఆ కోవకే పరమ శివుడి పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు. ఆయన జన్మించడంతోనే ఆతడు శివభక్తుడు. ఓ వైపు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే.. మరోవైపు మహేశ్వరుడిని ధ్యానిస్తూ ఉండేవారు. దేవాలయాల్లో ముఖ్యంగా శివాలయాల్లో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. గుడి చుట్టు ప్రదక్షణ అయిన తర్వాత… భక్తులు నందీశ్వరుడికి దణ్ణం పెట్టుకుంటారు. అనంతరం నందీశ్వరుడి కొమ్ములపై చేతి వేళ్లు ఉంచి.. ఆ మధ్యలో నుంచి శివలింగాన్ని దర్శించుకుంటారు. అయితే ఇలా ఎందుకు చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. అలాగే శివాలయాల్లోనే నందీశ్వరుడు ఉంటాడు. మిగిలిన దేవాలయాల్లో ఉండడు. ఓక వేళ ఉన్నా.. స్వామి వారికి ఎదురుగా ఉండడు ఇలా ఎందుకు అనే సందేహం వ్యక్తమవుతోంది.
శివాలయంలో నంది విగ్రహం ముందు నిలబడి, దాని కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించుకోవడం ఒక ఆచారం. దీనికి ఆధ్యాత్మిక, సాంప్రదాయపరమైన కారణాలు ఉన్నాయి. నంది, శివుడికి ఎంతో ఇష్టుడైన భక్తుడు, శివలింగాన్ని దర్శించే ముందు నందిని పూజించడం, అతని అనుమతి తీసుకోవడం ముఖ్యమని భావిస్తారు. అలాగే, నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం ద్వారా గురువు-శిష్యుల సంబంధాన్ని గౌరవించినట్లు అవుతుంది, ఎందుకంటే నంది శివుడికి గురువు లాంటివాడు.
శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుడి కంటే ముందుగా నంది దర్శనం చేసుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ లింగాన్ని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకుంటారు. పరమేశ్వరునికి నంది అనుంగభక్తుడు, ద్వారపాలకుడు కూడా. కాబట్టే నందికి అంతట ప్రాధ్యాన్యత. అందుకే లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. శివాలయంలో లింగాన్ని దర్శించుకునే సమయంలో మనసును భగవంతునిపై కేంద్రీకరించాలి. కాబట్టి, గర్భాలయంలో చిన్న అఖండ దీపం వెలిగిస్తారు. కేవలం శివాలయంలోనే నంది కొమ్ముల మధ్య నుంచి గర్భగుడిలోని శివలింగాన్ని చూస్తారు.
సాధారణంగా శివాలయానికి వెళ్లేటప్పుడు ప్రదక్షిణ చేసి పరివార దేవతల దర్శనం తర్వాత పరమశివున్ని దర్శించుకుంటాం. కొందరు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఏ శివాలయంలో అయినా పరమేశ్వరుడు శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతల్లా విగ్రహ రూపం కాకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని రూపాన్ని మనసు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న శివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనసుపై కేంద్రీకృతం చేయాలి.
అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. పృష్ఠ భాగాన్ని నిమురుతు, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వల్ల నంది అనుగ్రహం కూడా కలిగి శుభకరమైన ఫలితం దక్కుతుంది. అలాగే నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక విధానం ఉంది. కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రం, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు. అందుకనే నంది కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేసుకోవాలి. పరమేశ్వరుడు తన మూడో కన్ను తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది. కాబట్టి నేరుగా శివుని ముందుకు వెళ్లరాదని పండితులు చెబుతారు. ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే లోపలికి ప్రవేశించడాన్ని శృంగదర్శనం అంటారు.
రాశి చక్రంలోని మిథున రాశి ఆదిదంపతుల స్వరూపం… వృషభరాశి నందీశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృభరాశి, మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి, వృషభరాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వల్లే శివుడు వృషభవాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు. నందీశ్వరుడి వృషభ బాగాన్ని స్పృశిస్తూ శివుని దర్శించడం వల్ల విధి విహితం.
ఓ సారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సులో నిమగ్నమయ్యాడు. అతడి తపోదీక్షకు మెచ్చిన కైలాసనాథుడు ప్రత్యక్షమై.. వరం కోరుకోమన్నాడు. పది వేల ఏళ్లు తపస్సు చేసే శక్తిని ప్రసాదించాలంటూ పరమ శివుడిని కోరాడు. అలాగేనంటూ నందీశ్వరుడికి ఈశ్వరుడు వరమిచ్చాడు. అలా తపస్సు పూర్తి చేశాక.. నందికి ఈశ్వరుడు గణాధిపత్యం ప్రసాదించాడు. దీంతో అతడికి అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కల్పించాడు. దీంతో శ్రీశైలంలోనే కొలువు తీరేలా పరమ శివుడు అనుగ్రహించాడు. ఈ వృత్తాంతం శ్రీశైల ఖండంలో స్పష్టం చేశారు.
శివాలయంలో పరమశివుడి ఎదుట ఉండే నంది ధర్మ స్వరూపం.ఈ నంది నాలుగు పాదాలు.. చతుర్వేదాలకు ప్రతీక. కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడుస్తుందనటానికి నిదర్శనంగా.. నంది ముందర కుడిపాదం పైకి లేచి ఉంటుంది. మిగిలిన మూడూ పాదాలు లోపలికి మడిచి ఉన్నట్లు కనిపిస్తాయి. ఇక సంధ్యా సమయాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రదోష కాలమని పేర్కొంటారు. ఈ సమయంలో నందిశ్వరుడికి విశేష అర్చనలు, పూజలు చేయడం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. అయితే కాలకూట విషం తాగిన పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే, ఆయన ఉగ్రత్వాన్ని నేరుగా చూసేందుకు దేవతలు భయపడ్డారు. ఈ నేపథ్యంలో నందీశ్వరుడి వెనుక నిలబడి కొమ్ముల మధ్యలోంచి శివుడిను దర్శించారని పురాణాల కథనం. నేటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ.. భక్తులు నంది కొమ్ముల మధ్యలోంచే స్వామిని దర్శించడం సంప్రదాయంగా వస్తోంది.
See Also plz click on this: meaning-behind-rituals
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ కల్చర్ ను సందర్శించండి.
