పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు నిజంగా కలవవా?

by Lakshmi Guradasi

సోషల్ మీడియాలో మనం తరచూ చూస్తూ ఉంటాం — “ఇక్కడే పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం కలుస్తాయి!” అంటూ పలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కనిపించే దృశ్యం మాత్రం నిజంగా ఆశ్చర్యకరం! రెండు విభిన్న రంగుల నీళ్లు — మధ్యలో స్పష్టంగా ఒక గీతలా కనిపిస్తుండటం చూస్తే, మనసు ఆశ్చర్యంతో కదలక మానదు.

అయితే, నిజం ఏంటంటే, ఈ రెండు సముద్రాలు కలవడం కాదనడం కాదు — అవి ఖచ్చితంగా కలుస్తాయి. కానీ అది మనకు కనిపించేలా ఒక్కసారిగా కలిసిపోవడం కాదు. ఇది కాస్త శాస్త్రీయమైన, సహజమైన ప్రక్రియ. పసిఫిక్ మరియు అట్లాంటిక్ సముద్రాల నీటిలో ఉన్న ఉప్పుతత్వం (salinity), ఉష్ణోగ్రతలు (temperature), సాంద్రత (density), నీటి ప్రవాహ దిశలు (current patterns) వంటివి భిన్నంగా ఉండటంతో, అవి కలిసే ప్రదేశంలో కొంత సేపు కలవకుండా వేర్వేరుగా ఉండేలా కనిపిస్తాయి. అందుకే మధ్యలో గీతలా కనిపించే నీటి లైన్ ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సముద్రాలు కలుస్తున్న చోట స్పష్టమైన గీత ఎందుకు కనిపిస్తుంది?

వైరల్ వీడియోల్లో మీరు చూస్తున్న రెండు సముద్రాలు కలుసుకునే అద్భుత దృశ్యం నిజానికి అలస్కా గల్ఫ్ (Gulf of Alaska) వద్ద చిత్రీకరించబడినది. అక్కడ, మంచు పర్వతాల నుంచి కరిగిన మంచునీరు, సముద్రపు ఉప్పు నీటితో కలుస్తుంది. చూడటానికి ఇది రెండు ప్రపంచాలు తారసపడినట్టే ఉంటుంది – ఒకదానికి ఒకటి కలవడానికి ఇష్టంలేనట్టు స్పష్టమైన గీతలా కనిపిస్తుంది!

  • మంచు నీరు: ఇది కొండల నుండి కారే నదుల ద్వారా సముద్రంలోకి చేరుతుంది. దీనిలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుచేత ఇది తక్కువ సాంద్రత గల నీటిగా ఉంటుంది.
  • సముద్రపు నీరు: ఇది ప్రకృతిలో సహజంగా ఉన్న ఉప్పుతో నిండిపోయి ఉంటుంది. దీని సాంద్రత ఎక్కువగా ఉంటుంది.

ఈ రెండు వేర్వేరు రకాల నీటికి కలిసిపోయే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఎక్కువ సాంద్రత ఉన్న నీరు (సముద్రపు నీరు) కిందికి పోతుంది, తక్కువ సాంద్రత గల మంచు నీరు పైకి తేలుతుంది.

ఈ వ్యత్యాసం వల్ల, ఒకే ప్రదేశంలో రెండు రంగుల నీరు ఒకదానికొకటి కలవకుండా – గీతలా కనిపిస్తూ – పక్కపక్కనే ప్రయాణిస్తుంటాయి. అదే మనం వీడియోల్లో చూస్తున్న అద్భుత దృశ్యం!

పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు కలిసే ప్రదేశం ఎక్కడ ఉంది?

వైరల్ వీడియోల వల్ల చాలామందికి అపోహే – పసిఫిక్ మహాసముద్రం మరియు అట్లాంటిక్ మహాసముద్రం కలవవు అనుకుంటారు. కానీ అసలు నిజం ఏమిటంటే, ఈ రెండు సముద్రాలు దక్షిణ అమెరికాలోని టియెర్రా డెల్ ఫ్యూగో (Tierra del Fuego) వద్ద కలుస్తాయి. అవును… అవి కలుస్తాయి! కానీ ఆ కలయిక ఒక్కసారిగా కాదు, ప్రకృతి దానంతట అదే నెమ్మదిగా జరిపే మహత్తర ప్రక్రియ.

అవి త్వరగా ఎందుకు కలిసిపోవు?

మహాసముద్రాలు నెమ్మదిగా కలిసిపోవడానికి గల ప్రధాన కారణాలు:

  1. లవణీయత (Salinity): అట్లాంటిక్ సముద్రం నీటిలో ఉప్పు శాతం (salt content) ఎక్కువగా ఉంటుంది. పసిఫిక్ సముద్రం మాత్రం కొద్దిగా తక్కువ లవణీయత కలిగి ఉంటుంది. ఉప్పు తేడా వల్ల నీటి సాంద్రత (density) మారుతుంది. అందుకే, అవి త్వరగా కలవు.
  2. ఉష్ణోగ్రత (Temperature): పసిఫిక్ సముద్రం నీరు సాధారణంగా అట్లాంటిక్ సముద్రం నీటి కంటే చల్లగా ఉంటుంది. ఉష్ణోగ్రతలో ఈ వ్యత్యాసం కూడా సాంద్రతలో తేడాలకు దారితీస్తుంది.
  3. సముద్ర ప్రవాహాలు (Ocean Currents): ఈ రెండు సముద్రాలు కలిసే ప్రాంతంలో బలమైన ప్రవాహాలు ఉంటాయి. ఒకటి ఒక దిశగా, మరొకటి ఎదురుగా నెట్టేలా ఉండడం వల్ల నీరు సులభంగా కలవడం జరగదు.

ఈ కారణాల వల్ల మనకు రెండు వేర్వేరు రంగుల సముద్రాలు పక్కపక్కనే ప్రయాణిస్తున్నట్టు కనిపించొచ్చు. అయితే సైన్స్ శాస్త్రం చెబుతున్నది స్పష్టంగా – అవి నిజంగా కలుస్తాయి… కానీ ప్రకృతి తన రీతిలో, ఓ శాంతమైన సునిశితమైన ప్రాసెస్‌లో జరుపుతుంది.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ ఫ్యాక్ట్స్ ను చూడండి.

You may also like