శ్రీ మాతా వైష్ణో దేవి దర్శనం అనేది కొద్దిగా సమస్యతో కూడుకున్నదే, ఎందుకంటే హిమాలయాలలో ఉండే దేవి దర్శనం కోసం కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే అంత కష్టపడి దేవి దర్శనం చేసుకొని వచ్చేస్తే మనకి ఎటువంటి తృప్తి ఉండదు. అలాకాకుండా దేవి యొక్క చరిత్ర తెలుసుకొని, అక్కడ ఉన్న పుణ్యప్రదేశాల చరిత్ర వాటి గొప్పతనాన్ని తెలుసుకొని, ఆ ప్రదేశాలను మిస్ అవ్వకుండా దర్శించుకుంటే అంత కష్టపడి అక్కడికి వెళ్లినందుకు మన జన్మ సార్ధకం అవుతుంది. ఈ వ్యాసంలో మనం దేవి చరిత్రను తెలుసుకుంటాము అదేవిదంగా అక్కడ ఉన్న పుణ్యప్రదేశాలు వాటి గొప్పతనము, చరిత్ర కూడా తెలుసుకుంటాము.
వైష్ణో దేవి మందిరం త్రికూట కొండల ఒడిలో ఉంది, ఇది బేస్ క్యాంప్ కత్రా నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది రియాసి జిల్లా లోని ప్రముఖ పట్టణాలలో ఒకటి మరియు జమ్మూ నగరానికి 63 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.
వైష్ణో దేవి చరిత్రను మనం వివరంగా పరిశీలించినట్లయితే, ఇది ముఖ్యంగా మూడు యుగాలు అయిన త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలకు సంబందించినదిగా ఉంటుంది. ముందుగా త్రేతాయుగంలో నుండి మనం మొదలెట్టినట్లయితే ప్రస్తుతం రామేశ్వరంగా పిలువబడే ప్రాంతంలో ‘రత్నాకర్ సాగరుడు’ అనే భక్తుడు ఉండేవాడు. ఈయన ఎక్కువగా అమ్మవారిని కొలుస్తుండేవాడు. ఈయనకు ఒక పాప రూపంలో అమ్మవారు వీరి ఇంట జన్మించారు. ఆ బాలికకు ‘త్రికూట’ అనే పేరును పెట్టి పెంచుకోసాగారు.
అయితే ఈ పాప విష్ణువు అంటే అపారమైన భక్తితో ఉండేది. దీనివల్ల ఆ చుట్టుపక్కలవాళ్లు ఆ పాపను వైష్ణవి అని పిలుస్తూ ఉండేవారు. అలా విష్ణువును ఆరాధిస్తూ కొంచెం యుక్తవయసుకొచ్చేసరికి ఈమెకు భక్తి ఇంకా పరాకాష్టకు చేరుకొన్నది. ఈమె నిత్యం విష్ణువు చేరుకోవాలి, విష్ణువుని పెళ్లిచేసుకోవాలి, అతనిలోనే ఐక్యమవ్వాలి అనే భావనతో ఉండేది.
ఇలా ఉండగా ఒకసారి ఈమె వాళ్ళ నాన్నగారి అనుమతి తీసుకుని మహావిష్ణువు కోసం తపస్సు చేసుకుంటాను అని చెప్పి సాగరతీరానికి చేరుకుంటారు. ఇంతలో రావణ సంహారానికి శ్రీరాముడు ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. అప్పుడు శ్రీరాముడిని చూసిన వైష్ణోదేవి మహావిష్ణురూపమని గ్రహించి శ్రీరాముని వద్దకు వెళ్లి తనను ధర్మపత్నిగా స్వీకరించమని అడుగుతుంది.
అప్పుడు శ్రీరాముడు ఈ త్రేతాయుగంలో నేను ఏకపత్నివ్రతుణ్ణి, ఇప్పుడు నిన్ను స్వీకరించడం కుదరదు, నేను కలియుగంలో కల్కి అవతారంలో నిన్ను నేను ధర్మపత్నిగా స్వీకరిస్తా, అలాగే నువ్వు కూడా కలియుగంలో భక్తరక్షణ చేయాలి అని చెప్పి, నువ్వు ఇక్కడకాదు హిమాలయ పర్వతాల్లో త్రికూటపర్వతంలో ఒక గుహ ఉంది అక్కడ దుర్గ, లక్ష్మి, సరస్వతి దేవతల శక్తీ కేంద్రీకృతమైవుంది, నువ్వు అక్కడకు వెళ్లి తపస్సుచేసుకో, కలియుగంలో బయటకు ప్రకటితమవ్వు, అలాగే వానర ప్రముఖులు నీకు అంగరక్షకులుగా ఉంటారని శ్రీరామచంద్రమూర్తి చెప్పడం జరుగుతుంది.
ఆ తరువాత అమ్మవారు అక్కడనుండి హిమాలయాలకు రావడం జరుగుతుంది. ఇది అంతా కూడా వాల్మీకి రామాయణం లో ఉండదు. ఈ చరిథ్రను కొన్ని స్థలపురాణాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది.
ఇలా అమ్మవారు రామేశ్వరం నుండి పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటూ చివరకు హిమాలయాలకు చేరుకుంటుంది. ఇలా చేరుకున్న అమ్మవారు హిమాలయాలలో మొట్టమొదటగా ‘కౌల్ కందోలీ’ అనే ప్రదేశంను చేరుకుంటారు. ఇక్కడ అమ్మవారు చాల సంవత్సరాలు, ఇంకా చెప్పుకోవాలంటే ఒక ద్వాపరయుగం అంతా కూడా ఇక్కడే నివసించారు అని చెప్పుకుంటారు. ద్వాపరయుగంలో పాండవులు అమ్మవారిని నిత్యం దర్శించుకునేవారని కొన్ని స్థలపురాణాలు తెలియజేస్తున్నాయి.
ఇలా కొంత కాలం తరువాత కలియుగ ప్రారంభంలో ‘దేవా మాయి’ అనే మరొక ప్రదేశానికి అమ్మవారు చేరుకుంటారు. ఇక్కడ ఒక కొండమీద దాదాపు 110 సంవత్సరాలపాటు తపస్సుచేసుకున్నట్లు కొన్ని రకాల స్థలపురాణాలలు వివరిస్తున్నాయి. తరువాత త్రికూట పర్వత ప్రాంతంలో దివ్యశక్తి రూపుంలో అమ్మవారు తిరుగుతున్నారని భక్తులు నమ్మేవారు. అయితే ఈ సమయంలో గోరఖ్ నాధుడు అనే ఒక ‘అగోర’ గోర తపస్సులు, ఇంకా తాంత్రిక విద్యలు వంటివి చేసి ఆ అమ్మవారి శక్తీ సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి, చివరకు ఆ శక్తిని పొందలేక పరితపిస్తూవుంటాడు.
అయితే ఇంతలో కలియుగంలో అమ్మవారు ప్రకటించాల్సిన సమయం ఆసన్నమవుతుంది. ‘భూమిక’ అను ప్రాంతంలో శ్రీధర్ పండితుడు అను అమ్మవారి భక్తుడు ఉండేవాడు, ఇతడికి సంతానప్రాప్తి లేక ఎప్పుడూ అమ్మవారికి పూజలు చేస్తూ బాధపడుతుండేవాడు. అయితే ఒక రోజు ఆ భక్తుడు సప్తకన్యల పూజ చేస్తుండగా చివరిబాలిక వద్దకు చేరుకోగానే ఆ కన్య దివ్య తేజస్సుతో ఉన్నట్లుగా అతడికి బ్రాంతికల్గుతుంది.
తరువాత ఆ కన్య ఆ భక్తుడికి రేపు మీ ఇంట్లో పెద్ద విందు ఏర్పాటు చెయ్యి అని చెప్తుంది. అప్పుడు ఆ భక్తుడు ఎలాగా తల్లి నేను పేదవాడిని అని అనగా ఆ బాలిక ఎం పర్వాలేదు ఈ చుట్టు ప్రక్కల ఊళ్ళ వారందరిని పిలిచి పెద్ద విందు ఏర్పాటు చెయ్యి, నీకు అంతా శుభం కలుగుతుంది ఇది ఒక దైవకార్యం అని చెప్పి ఆశీర్వదించి మాయమైపోతుంది.
ఆ బాలిక చెప్పినట్టుగా శ్రీధర్ పండితుడు ఆ చుట్టుప్రక్కల ఉన్నవారందరిని పిలవడం మొదలెడతాడు. అయితే ఇలా పిలుస్తుచివరకు గోరఖ్ నాధ్ ఆశ్రమానికి కూడా వెళతాడు, అయితే అతడి శిష్యుడు భైరవ్ నాధుడు అతడిని ఆపి ఎందుకొచ్చావు అని అడగ్గా, శ్రీధర్ పండితుడు నేను విందు ఏర్పాటు చేస్తున్నాను దానికి ఆహ్వానించడానికి వచ్చానని చెప్తాడు. అప్పుడు భైరవ్ నాధుడు నీకె తిండి లేదు మా అందరికి ఎలా నువ్వు విందు భోజనం ఏర్పాటు చేస్తావు, గోరఖ్ నాధుడికి మేము 365 మంది శిష్యులము ఉన్నాము, నువ్వు ఎలా ఏర్పాటు చేస్తావని అపహాస్యంగా నవ్వుతాడు. అయితే శ్రీధర్ పండితుడు అవన్నీ పట్టించుకోకుండా బాలికతో జరిగిన సంభాషణ వివరించి విందుకు ఆహ్వానిస్తాడు. అప్పుడు భైరవ్ నాధుడుకి మనస్సులో కొద్దిగా అనుమానం వచ్చి అతడిని గురువు గారు అయిన గోరఖ్ నాధ్ వద్దకు తీసుకెళ్తాడు. గోరఖ్ నాధుడికి జరిగినదంతా వివరించగా సరే మేము తప్పకుండా విందుకు వస్తామని మాటిస్తాడు.
అలా అందరిని పిలిచి అలసిపోయి ఇంటికి వచ్చిన శ్రీధర్ పండితుడుకి అందరిని పిలిచాను, వీరందరికి భోజనం ఎలా పెట్టాలి, పెట్టక పోతే గోరఖ్ నాధుడు శపించేస్తాడేమో, ఆ బాలిక రేపు వస్తుందో రాదో అని, రకరకాల ఆలోచనలతో నిద్రపోతాడు. ఉదయాన్నే లేచేసరికి అతడు నివసించే ‘భూమిక’ ప్రాంతమంతా జనాలతో నిండిపోతుంది, ఇంతలో గోరఖ్ నాధుడు కూడా శిష్య బృందంతో అక్కడకు వస్తాడు. అది చూసి కంగారు పడుతున్న శ్రీధర్ పండితుడకు ఆ కన్య ప్రత్యక్షమై నాయన నువ్వు ఏమి కంగారు పడకు అని చెప్పి, వచ్చిన జనాన్ని బయట కుర్చోపెట్టు, గోరఖ్ నాధుని శిష్య బృందంతో లోపల కుర్చోపెట్టు అని చెప్తుంది.
అప్పుడు శ్రీధర్ పండితుడు తల్లి గోరఖ్ నాధుని శిష్య బృందం చాల మంది ఉన్నారు, ఈ చిన్న కుటీరంలో వారందరు సరిపోరేమో వారిని కూడా బయటే కుర్చోపెడతాను అంటాడు. అప్పుడు ఆ దివ్యకన్య లేదు ఇది సరిపోతుంది వారు ఎంతమంది వచ్చిన ఇంకా మరొకరికి చోటు ఉంటుంది, ఈరోజు నీ ఇళ్ళు ఒక పుష్పక విమానమవుతుంది లోపలే కుర్చోపెట్టు అని చెప్తుంది. అప్పుడు శ్రీధర్ పండితుడు వారిని లోపలకు తీసుకువచ్చి కూర్చోమంటాడు, అయితే వారందరు కూర్చోగా ఇంకా కూడా స్థలం ఉండే సరికి గోరఖ్ నాధుడు ఆశ్చర్యపోతాడు.
తరువాత భోజనానికి కూర్చున్న వారిముందు షడ్రుచులతో భోజనం ప్రత్యక్షమవుతుంది. విందుకు వచ్చిన అందరు భోజనాలు చాల బాగున్నాయి అంటూ తింటుంటారు. కానీ గోరఖ్ నాధ్, భైరవ్ నాధుడు తినకుండా ఇక్కడ ఎదో శక్తి దాగుంది, దాన్ని కనిపెడదాము అని వారు తినకుండా వుంటారు. ఇంతలో శ్రీధర్ పండితుడు వారు తినక పోవడాన్ని గమనించి స్వామి మీరు ఎందుకు తినడంలేదు అని అడుగుతాడు. అప్పడు వారు మేము తాంత్రికులమని మేము ఇవి తినము, మాకు మద్యము, మాంసము కావాలని అడుగుతారు. అప్పుడు పండితుడు లేదు స్వామి మేము బ్రాహ్మలము ఇక్కడ ఇవే దొరుకుతాయి అని బదులిస్తాడు. అయితే గోరఖ్ నాధ్, భైరవ్ నాధుడు ఇరువురు గొడవకు దిగుతారు.
ఇంతలో అమ్మవారు మాములు స్త్రీ రూపంలో వారిముందుకు వచ్చి శాంతిపచేయాలని చూస్తుంది. అప్పుడు భైరవ్ నాధుడు ఇంకా అక్కడ ఉన్నవన్నీ ధ్వంసం చేయడం మెదలెడతాడు, దీంతో అమ్మవారు ఒక్కసారిగా ఆగ్రహించి అతడి వైపు చూడగా వారు ఇరువురు ఆ శక్తికి దూరంగా ఎగిరి పడిపోతారు. తరువాత అమ్మవారు వేగంగా త్రికూట పర్వతం వైపు వెళ్ళిపోతారు.
అది గమనించిన భైరవ్ నాధుడు అతడు కూడా త్రికూట పర్వతం వైపు వెళ్దాం అని గురువుతో చెప్తాడు. అయితే గోరఖ్ నాధుడు వద్దు నాయన ఆమె దైవస్వరూపం మనము ఆమెను పొందలేము అని చెప్తాడు. కానీ గురువు మాట వినకుండా భైరవ్ నాధుడు నేను వెళ్లి ఆ శక్తిని పొందుతాను అని చెప్పి అతను కూడా త్రికూట పర్వతం వైపు వెళతాడు. ఇలా వెళ్లిన భైరవ్ నాధుడుకి ఎంతవెతికిన దేవి కనపడక చివరకు ఒకచోట కూర్చొని తపస్సు చేయడం మొదలు పెడతాడు.
అయితే ఒకరోజు అతడికి ధ్యానంలో అమ్మవారితో పాటు ఆమెకు కాపలా ఉన్న వానరుడుకి దాహం అవుతుండడంతో అమ్మవారు ఒక బండరాయి లోకి బాణం వేసి అందులోనుండి వచ్చిన గంగతో అతడి దాహం తీర్చినట్టుగా కనపడుతుంది. ధ్యానంలో అది చూసిన భైరవ్ నాధుడు వెంటనే అక్కడకు చేరుకుని వెతకడం ప్రారంభిస్తాడు. ఇలా కొద్దిరోజులు వెతికిన తరువాత అతడు ఒక కొండలోనుండి ‘జలధార’ వస్తున్న ప్రదేశాన్ని కనుగొంటాడు. అయితే అక్కడ అమ్మవారు అతడికి కనిపించరు, మరల వెతకడం ప్రారంభిస్తాడు. ఇలా వెతుకుతూ ముందుకు వెళ్లేసరికి అక్కడ ‘అమ్మవారి పాదముద్రలు’ కనపడతాయి. ఆ పాదముద్రలు చూసిన అతడు మరింత ఉత్సాహంతో ఇంకా వెతకడం ప్రారంభిస్తాడు.
అలా వెతుకుతూ ఇంకా కొండ పైకి వెళ్లేసరికి అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక సాధువు అతడికి కనపడతాడు. ఆ సాధువును భైరవ్ నాధుడు ఇక్కడకు ఒక కన్య వచ్చింది మీకు ఏమైనా కనపడింది అని అడగ్గా, అప్పుడు సాధువు ఆమె కన్య కాదు నాయనా ఆమె సాక్షాత్తు అమ్మవారు అని చెప్పి, అదిగో ఆ కొండమీద ఎదురుగా ఉన్న ‘యోని గుహ’లో తపస్సు చేసుకుంటున్నారు అని చెప్తాడు. వెంటనే భైరవ్ నాధుడు ఆ యోని గుహలోనికి వెళ్ళాడు అయితే అమ్మవారు తన త్రిశాలాంతో వెనుకవైపు మరొక దారి చేసుకుని కొండపైన ఉన్న మరొక గుహ ‘సుందరగుహ’ లోనికి వెళ్ళిపోతుంది. అయితే అంతటితో వదలని భైరవ్ నాధుడు ‘సుందరగుహ’ లోనికి కూడా వెళ్తాడు.
అయితే గుహ ద్వారం వద్ద ఉన్న వానరుడు అడ్డగించడంతో అతడిని కూడా భైరవ్ నాధుడు ఓడించి లోనికి వెళతాడు. దాంతో ఆగ్రహించిన అమ్మవారు భైరవ్ నాధుడు ఎదురుగా ప్రత్యక్షమై తన కడ్గంతో అతడి శిరస్సును ఒక్కసారిగా కండిస్తుంది. అతని మొండెం అమ్మవారి పాదాల వద్ద పడిపోతుంది. అయితే అతడి తలమాత్రం పైన ఒక కొండ మీద పడుతుంది. తరువాత తప్పు తెలుసుకున్న భైరవ్ నాధుడు తల్లి ఇంతకాలం నేను, నా గురువు నీకోసం తపస్సు, ధ్యానం చేశాం కానీ తపస్సు ద్వారా మీ సాక్షాత్కరం పొందకుండా తాంత్రికవిద్యలు ప్రయోగించాము మమ్ములను క్షమించుతల్లి అని వేడుకుని, నీ చరిత్రలో నేనొక పాపాత్మాడిగా మిగిలిపోయాను అని పశ్యత్తాపంతో దుక్కిస్తాడు.
అప్పుడు అమ్మవారు నాయన నువ్వు బాధపడకు ఆ కొండమీద నీ శిరస్సు ఎప్పటికీ అలానే ఉంటుంది. నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతివారు నిన్ను కూడా తప్పకుండ దర్శనం చేసుకుంటారు, అలా చేస్తేనే యాత్ర సఫలం అయ్యి ఫలితాలను పొందుతారు అని అమ్మ వారు భైరవ్ నాధుడుకి వరం ఇస్తుంది. అలా ఆ ‘భైరవ్ నాధుడి శిరస్సు’ అలానే కొండ మీద ఇప్పటివరకు ఉంది, యాత్రకు వచ్చిన భక్తులు తప్పక దర్శనం చేసుకుంటారు.
ఈ సంఘటన జరిగిన తరువాత అమ్మవారు ‘సుందర గుహ’లో దుర్గ, లక్ష్మి, సరస్వతి సమేతంగా త్రిమాతల స్వరూపంలో వెలిశారు. ఇదిలా ఉండగా అసలు సంఘటన మొదలైన శ్రీధర్ పండితుడు అమ్మవారి కృప తనమీద లేదని తపించసాగాడు. ఒకరోజు అతడు నిద్రిస్తుండగా స్వప్నంలో అమ్మవారు అతడిని తీసుకువెళ్లి తను సృష్టించిన జలపాతాన్ని, పాదముద్రల్ని, అక్కడ జరిగిన విషయాలను, వివరిస్తూ చివరకు సుందర గుహ లోని అమ్మవారి పీఠం వద్దకు తీసుకెళ్ళుతుంది. వెంటనే శ్రీధర్ పండితుడు నిద్రనుండి మేల్కొని వెంటనే కొండపైకి వెళ్లి సుందర గుహలో పాకుతూ లోనికి వెళ్లేసరికి అక్కడ అమ్మవారి దివ్యమైన పీఠం అతడికి దర్శనమిస్తుంది. వెంటనే అతడు ఆనందంతో అమ్మవారికి పూజాభిషేకాలు నిర్వహిస్తాడు.
అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై నాయన నీకు రెండు వరాలను ప్రసాదిస్తున్నాను. అందులో మొదటిది నీకు పిల్లలు లేరు కదా అందుకోసం నీకు నలుగురు మగ బిడ్డలను ప్రసాదిస్తున్నాను. నీ తరువాత కూడా నీవంశమే నాకు పూజలు చేస్తుంటారు అని చెప్తుంది. దీని ప్రకారమే ఇప్పటికి కూడా ఈ వంశం వారే అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. రెండవ వరం ఏంటంటే నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను. ఈ జన్మే నీకు చివరిది, ఈ జన్మ తరువాత నీవు ముక్తిని పొంది నాలో ఐక్యమవుతావు అని చెప్తుంది.
ఇది కలియుగంలో జరిగిన అమ్మ వారి మొత్తం చరిత్ర. ఈ వైష్ణో దేవి చరిత్ర ఒకసారి తెలుసుకొని తరువాత అమ్మవారి దర్శనం, అలాగే కత్రా లో ఉండే అమ్మ వారి ముఖ్యమైన ప్రదేశాల చరిత్రను తెలుసుకుంటూ దర్శనం చేసుకుంటే భక్తులకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇందులో మనము కౌల్ కందోలీ, దేవా మాయి, భూమిక, ‘జలధార’ అమ్మవారి పాదముద్రలు, యోని గుహ, సుందరగుహ, భైరవ్ నాధుడి శిరస్సు వంటి వైష్ణో దేవి పుణ్యక్షేత్ర ప్రదేశాల చరిత్ర గురించి తెలుసుకున్నాము. చరిత్ర తెలుసుకున్నతరువాత శ్రీ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర సందర్శన ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది. 🙏ధన్యవాదాలు||