గోకర్ణం, మన దేశంలోనే అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి. ఇది త్రిస్థల క్షేత్రాలలో ఒకటిగా పేరుపొందింది — మిగిలిన రెండు రామేశ్వరం మరియు వారణాసి. ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో, అరేబియా సముద్ర తీరాన ఆకర్షణీయమైన ప్రకృతి వీక్షణల మధ్య వెలసినది. తూర్పున సిద్దేశ్వర క్షేత్రం, ఉత్తరాన గంగావళి నది, దక్షిణాన అగనాసిని నది ఉండగా, పడమట వైపు అనంతమైన సముద్రం ఉన్న గోకర్ణం పర్యాటకులకు, భక్తులకు, ధ్యానదాతలకు అపూర్వమైన అనుభూతిని అందిస్తుంది.
గోకర్ణ దర్శనానికి అఖండమైన ప్రాముఖ్యత ఉంది. కర్ణాటక రాష్ట్రంలో నెలకొని ఉన్న ఈ క్షేత్రం, మహాబలేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు పరమశివుని ఆత్మలింగాన్ని ప్రత్యక్షంగా దర్శించగలుగుతారు. గోకర్ణలో ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు భక్తులకు దర్శనం అందుబాటులో ఉంటుంది. మహాబలేశ్వర ఆలయం మాత్రమే కాక, వినాయకుని ఆలయం, సుందరమైన అరేబియా సముద్ర తీరం కూడా భక్తులను ఆకర్షించే ముఖ్య విశేషాలు. శివరాత్రి, కార్తీక మాసం లాంటి ప్రత్యేక పర్వదినాల్లో ఇక్కడ విశేష పూజలు, ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల పాపములను నివారించుకోవచ్చు, పుణ్యఫలాలను పొందవచ్చు అనే విశ్వాసం భక్తులలో ఉంది.
పురాణ గాథ – రావణుడు, ఆత్మలింగం, గణేశుని సాహసం:
సకల పురాణాలలోను గోకర్ణ క్షేత్రానికి ప్రాధాన్యత ఉంది. స్కంద పురాణంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా దీని ప్రాముఖ్యత వివరించి ఉంది.
ఒకప్పుడు రావణాసురుడు శివుడిని ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు ఫలించి ప్రత్యక్షమైన శివుడు, కావలసిన వరం కోరమన్నాడు. రావణుడు శివుని ఆత్మలింగంను కోరగా, శివుడు ఒక నిబంధనతో ఆ లింగాన్ని అందజేశాడు – “లంకకు చేరేవరకు ఈ లింగాన్ని భూమిపై పెట్టకూడదు” అని. దీనికి భయపడిన దేవతలు, లోకాల రక్షణ కోసం విష్ణువు, గణపతి తో సహా పలువురు దేవుళ్లను వేడుకున్నారు.
రావణుడు ఆత్మలింగాన్ని తీసుకుని లంక వైపుగా ప్రయాణిస్తున్న సమయంలో, సంధ్యాకాలం సమీపించగా తాను సంధ్యావందనం చేయాలనే ఆలోచన గుర్తుకువచ్చింది. కానీ అతని రెండు చేతులలో ఆత్మలింగం ఉండటంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో, దేవతల ప్రార్థనతో వినాయకుడు బాలరూపంలో రావణుడికి ఎదురు పడ్డాడు. రావణుడు వినాయకుడిని ఈ ఆత్మలింగాన్ని పట్టుకో నేను సంధ్యావందనం చేసి వస్తాను అనే సహాయం కోరతాడు.
అందుకు బాల రూప వేషధారి వినాయకుడు రావణునితో, “నీ సంధ్యావందనం చేసుకునేంతవరకు నేను ఈ లింగాన్ని పట్టుకుని ఉంటాను. కానీ ఒక నిబంధన పెట్టాడు – “మూడు సార్లు పిలిస్తాను, రాకపోతే నేలపై లింగాన్ని పెట్టేస్తాను” అని చెప్పాడు.
రావణుడు అంగీకరించి సంధ్యావందనానికి వెళ్లాడు. కానీ ఆలస్యం అయింది. వినాయకుడు త్వరగా మూడు సార్లు పిలిచి, స్పందన లేకపోవడంతో ఆత్మలింగాన్ని భూమిపై ఉంచేశాడు. ఆ క్షణమే ఆ లింగం భూమిలోనికి బలంగా నాటుకుపోయింది.
తిరిగి వచ్చిన రావణుడు ఎంతగా ప్రయత్నించినా, ఆ లింగాన్ని పైకి ఎత్తలేకపోయాడు. ఆ కోపంతో గణపతికి తలపై మొట్టికాయ వేశాడు, ఆ ప్రభావంగా గోకర్ణ గణపతి విగ్రహానికి నొక్కు (బెల్లం) లాంటి ఆకృతి కనిపిస్తుంది. అప్పటి నుంచి ఆత్మలింగం అక్కడే ఆవిర్భవించి, మహాబలేశ్వర రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నది.
శైవ పంచ క్షేత్రాలు – ఆత్మలింగంతో ఏర్పడిన ఐదు లింగ క్షేత్రాలు
రావణుడు ఆత్మలింగాన్ని తీయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యాడు. దాంతో ఆ లింగంతోపాటు మరికొన్ని దివ్య లింగాలు ఏర్పడినట్లు పురాణం చెబుతోంది:
క్షేత్రం పేరు | ఏర్పడిన విధానం |
సజ్జేశ్వర లింగం | పెట్టెను ఉత్తరం వైపు లాగినప్పుడు పడింది |
గుణేశ్వర లింగం | పెట్టె మూతపడిన చోట వెలసింది |
మురుడేశ్వర లింగం | ఆత్మలింగంపై కప్పిన వస్త్రం పడిన స్థలంలో |
దారేశ్వర లింగం | తాళ్లు పడిన చోట |
మహాబలేశ్వర లింగం | మిగతా నాలుగు మధ్యలో వెలసిన ప్రధాన లింగం |

ఈ ఐదు క్షేత్రాలను కలిపి “శైవ పంచ క్షేత్రాలు”గా పిలుస్తారు. ఇవి గోకర్ణం పరిసరాల్లో దర్శించదగిన ముఖ్యమైన దేవాలయాలు.
గోకర్ణం అనే పేరుకు మరో భావన:
ఇంకొక కథనం ప్రకారం పాతాళ లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నపుడు భూమాత గో రూపం ధరించిందట, ఆ గోవు చెవి నుంచి పరమేశ్వరుడు బయటికి రావడంతో ఈ క్షేత్రానికి “గో” అంటే ఆవు , “కర్ణం” అంటే చెవి = “గోకర్ణం” అనే పేరు ఏర్పడిందట.
పురాతన ప్రాశస్త్యం – గోకర్ణ క్షేత్ర విశిష్టత:
దక్షిణకాశి, భూకైలాసం అని పిలువబడే గోకర్ణ క్షేత్రం భారతీయ తత్వపరంపరలో అపారమైన ప్రాశస్త్యాన్ని కలిగిన ప్రదేశం. ఇది శైవ భక్తుల కొరకూ మాత్రమే కాదు, చరిత్ర, శిల్పకళ, పురాణగాథల మీద ఆసక్తి ఉన్న వారికీ ప్రేరణగా నిలుస్తోంది.
చరిత్రలో గోకర్ణ ప్రస్తావన:
కాళిదాసు తన ‘రఘువంశం’ కావ్యంలో గోకర్ణాన్ని పేర్కొన్నాడు. క్రీ.శ. 7వ శతాబ్దంలో హర్షవర్ధనుడు ‘నాగానంద’ నాటికలో ఈ క్షేత్రం ప్రాశస్త్యాన్ని వివరించాడు. కదంబ రాజవంశీయుడైన మయూరశర్మ ఇక్కడ నిత్యపూజలకు ఏర్పాట్లు చేశాడు. చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు పరిపాలనలో విశ్వేశ్వరాయుడు నిర్మించిన చంద్రశాల, నందిమంటపాలు గోకర్ణంలో చిహ్నాలుగా నిలిచాయి. అనంతరం విజయనగర సామ్రాజ్యం ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసింది. ఛత్రపతి శివాజీ 1665లో ఈ క్షేత్రానికి వచ్చి స్వయంగా పూజలు చేశాడన్నది చరిత్రలో లభ్యమవుతున్న విశేషం.
కోటితీర్థం – పవిత్ర స్నానయోగ్య స్ధలం:
గోకర్ణ మహాబలేశ్వరాలయాన్ని దర్శించేముందు భక్తులు తప్పనిసరిగా కోటితీర్థంలో స్నానం చేస్తారు. ఈ స్నానము ఆరోగ్యాన్ని కలిగించేదిగా, పాపాలను పోగొట్టేదిగా విశ్వసిస్తారు. దీనిలో స్నానం చేసి సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో స్నానం చేయడం ద్వారా పూర్వజన్మ పాపాలనూ నివారించవచ్చని భక్తులు నమ్ముతారు. కోటితీర్థానికి దక్షిణంగా ఉన్న వరటేశ్వరలింగాన్ని మహర్షి అగస్త్యుడు ప్రతిష్ఠించినట్లు ప్రాచీన శాసనాలు తెలుపుతున్నాయి.
శ్రీ మహాబలేశ్వర ఆలయం – ఆత్మలింగ ప్రతిష్ఠిత క్షేత్రం:
ఈ ఆలయం గోపురం గొప్ప వైభవంతో భక్తులను ఆహ్వానిస్తుంది. ఇక్కడి ప్రధాన ఆలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఆలయ ప్రాంగణం ఎంతో విశాలంగా ఉంటుంది. ఇక్కడ శివలింగం పైన భక్తులు నీళ్లు పోసి స్వయంగా పూజించవచ్చు. ఇది దేశంలో అరుదైన అవకాశం. రావణుడి ధాటికి లింగం కొంతభాగం భూమిలోకి వెళ్లిపోయింది, పైభాగం మాత్రం సన్నగా ఉంది – ఇది భక్తుల విశ్వాసం. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ‘పుష్కర ఉత్సవం’ జరగుతుంది. అప్పుడే నిజమైన ఆత్మలింగాన్ని బయటకు తీసి ప్రత్యేక పూజలు చేస్తారు. దీనిని పుష్కర ఉత్సవంగా వ్యవహరిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలకు హాజరవుతారు.
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడురోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. రథోత్సవం ప్రత్యేక ఆకర్షణ. ఆలయంలో మధ్యాహ్నం 12:30 నుంచి రాత్రి 8:30 వరకు మంగళహారతి నిర్వహిస్తారు. భక్తులు చొక్కా విప్పి, భుజాలపై కండువాతో స్వామిని దర్శించాలి.
తామ్రగౌరీ ఆలయం – మహాబలేశ్వరుని భార్య ఆలయం:
ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిశలో ఉంది. తామ్రగౌరీ దేవి బ్రహ్మదేవుని కుడిచేయి నుండి ఉద్భవించి, తపస్సు చేసి రుద్రునితో వివాహం చేసుకుంది అన్నది పురాణగాథ. ఆలయం ఉదయం 6 నుంచి 12:30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 వరకు భక్తులకు తెరిచి ఉంటుంది.
మహాగణపతి ఆలయం – ఆత్మలింగ యాత్రలో కీలకమైన కథ:
పై కధనం లో చెప్పిన విధంగా రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తుండగా గణపతి రూపంలో వచ్చిన బాలుడు రావణుని దారిని అడ్డుకుని లింగం కిందపెట్టేస్తాడు. దీనితో ఆత్మలింగం భూమిపై స్థిరపడింది. ఈ ఘటనను గుర్తు చేసుకునే ఆలయం ఇది. మహాబలేశ్వర దర్శనానికి ముందు భక్తులు ఇక్కడ గణపతిని దర్శిస్తారు. ఆలయం ఉదయం 6 నుంచి 1:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది.
ఇతర ఆలయాలు – భద్రకాళి, శ్రీకృష్ణ, నరసింహ, కాలభైరవ:
ఈ క్షేత్ర పరిధిలో భద్రకాళి ఆలయం ప్రధానంగా నిలుస్తుంది. నేత్రాసురుని సంహారార్థం త్రిమూర్తుల శక్తుల ద్వారా ఈ అమ్మవారు ఆవిర్భవించారు. అమృతమధనం సమయంలో దేవతలు ఇక్కడికి వచ్చి పూజలందించారని ప్రతీతి.
గోకర్ణానికి చుట్టుపక్కల ఉన్న పవిత్ర క్షేత్రాలు:
- ధారేశ్వర ఆలయం – గోకర్ణానికి 45 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం చాళుక్య–హోయిసల శైలిలో నిర్మించబడింది. ఇది కూడా ఆత్మలింగ భాగంగా పరిగణించబడుతుంది.
- ఓం బీచ్, హాఫ్ మూన్ బీచ్ – ప్రసిద్ధ పర్యాటక తీరప్రాంతాలు
- కోటితీర్థం – పవిత్ర స్నాన ఘాట్
- పర్వతీశ్వర ఆలయం, తామ్రగౌరి దేవాలయం – గోకర్ణలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయాలు
- గుణవంతేశ్వర ఆలయం – గోకర్ణానికి 60 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయం శివభక్తులకు పునీతంగా నిలుస్తుంది.
- మురుడేశ్వర ఆలయం – పంచలింగాల క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం గోకర్ణం నుండి 70 కి.మీ దూరంలో ఉంది. మహా శివమూర్తి విగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ దేవస్థానం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంది.
యాత్రికుల కొరకు సమాచారం:
గోకర్ణం బెంగళూరు నుండి సుమారు 450 కి.మీ దూరంలో ఉంది. హుబ్లీ, ఉడుపి, మంగళూరు, బెల్గాం నుండి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కొంకణ్ రైలు మార్గంలో గోకర్ణ రోడ్ స్టేషన్ నుండి ఆలయం సుమారు 5 కి.మీ దూరంలో ఉంటుంది. బసకు అనేక హోటళ్లతో సౌకర్యం ఉంది.
గోకర్ణ ఆత్మలింగ క్షేత్రం గూగుల్ మ్యాప్ లొకేషన్:
మరిన్ని ఇటువంటి ఆలయాల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.