అనగనగా ఒక అడవి. ఆ అడవికి సింహం రాజు. అది జంతువుల విషయంలో సమన్యాయం పాటించేది. దానికో మరో సంతానం. పేరు రుద్రం. తల్లిదండ్రుల అతిగారాబంతో అది అల్లరిగా తయారైంది. చిన్న చిన్న జంతువులను బాగా ఏడిపించేది. ఆ ఆగడాలు భరించలేక, జంతువులన్నీ… ‘ప్రభూ… విద్య నేర్చుకునేందుకు రుద్రాన్ని గురుకులానికి పంపండి’ అని కోరాయి. ‘రుద్రం ఇంకా చిన్నపిల్లే. అప్పుడే చదువేంటి? అయినా పిల్లలు. కాకపోతే పెద్దలు అల్లరి చేస్తారా ఏంటి?’ అని కొట్టిపారేసిందా సింహం. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు జంతువులన్నీ రాజు దగ్గరకి వచ్చి ‘మృగరాజా! ఒక చిన్న జంతువు చేసిన అల్లరి పనికి జింక కొమ్ములు విరిగిపోయాయి. కుందేలు కాలికి దెబ్బ తగిలింది’ అని ఫిర్యాదు చేశాయి. ‘అసలేం జరిగింది?’ అని రాజు ప్రశ్నించడంతో… ‘ఆ చిన్న జంతువు గొయ్యి తవ్వి, దానిపైన ఆకులతో కప్పేసింది. పరుగున వస్తున్న కుందేలు, జింక అందులో పడిపోయాయి’ అని చెప్పాయవి.
“జంతువు చిన్నదైనా, పెద్దదైనా ‘ఒకే న్యాయం… ఒకే శిక్ష’. ఇంతకూ ఆ పని చేసింది ఎవరు?” అడిగింది సింహం. ‘మరెవరో కాదు… రుద్రం’ అంది ఎలుగుబంటి. సింహం గతుక్కుమంది. ఏం చేయాలో అర్థంగాక మంత్రి ఏనుగు వైపు దీనంగా చూసింది. ‘మృగరాజా… మన అడవిలో తెలియక తప్పు చేసిన చిన్న జంతువులకు నిర్బంధ విద్య అమలు చేస్తున్నాం. ఆ మేరకు యువరాజును ఆరు నెలలపాటు ఎలుగుబంటి దగ్గరకు పంపాల్సి ఉంటుంది’ అంది ఏనుగు. ఆరు నెలల తర్వాత… బుజ్జి సింహాన్ని తీసుకెళ్లేందుకు వెళ్లిన మృగరాజుతో… ‘ప్రభూ… రుద్రం అల్లరి తగ్గిపోయింది. తెలివితేటలు నేర్చుకుంది. ఆరోజు మీ బిడ్డ గొయ్యి తీసి, ఆకులు కప్పటం వరకు నిజమే కానీ, అందులో జింక, కుందేలు పడలేదు. దానిలో మార్పు తీసుకురావాలనే మీకు అబద్ధం చెప్పాం’ అందా ‘అయితే… మీరు రుద్రానికి కాదు, నాకు బుద్ధి వచ్చేలా చేశారు’ అంది సింహం నవ్వుతూ…
ఇలాంటి మరిన్ని తెలుగు కథల కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.