తెలుగు రైమ్స్ అంటే పిల్లల మనసులో ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల కోసం తెలుగు రైమ్స్ (telugu rhymes for kids) మాత్రమే కాకుండా తెలుగు నర్సరీ రైమ్స్ (telugu nursery rhymes), తెలుగు చిన్నపిల్లల పాటలు (telugu baby songs) వంటి పాటలు పిల్లల మనసును ఆకట్టుకుంటూ వారిలో వినడానికి, గుర్తుపెట్టడానికి, మాట్లాడడానికి ప్రేరణనిస్తాయి.
ఈ ఆర్టికల్‌లో మీరు చిట్టి చిలకమ్మా, వానా వానా వల్లప్పా లాంటి సంప్రదాయ తెలుగు రైమ్స్ ను ఆస్వాదించవచ్చు. కొన్ని పాటలు నైతిక గుణాలు నేర్పే పాటలు, కొన్ని జంతువుల కథలమీద ఆధారపడి ఉంటే, మరికొన్ని నిద్రకు ముందు వినే పాటలు (telugu lullabies for kids) లాగా ఉంటాయి.
1. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా
తోటకెళ్ళావా పండు తెచ్చావా
గూట్లో పెట్టావా గుటుక్కు మింగావా
గూట్లో పెట్టావా గుటుక్కు మింగావా
గుటుక్కు మింగావా..
2. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు క్రింద పోసి
పుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి
బొమ్మరింట్లో పిల్ల పుడితే
బొమ్మ తలకు నూనె లేదు
అల్లవారింటికి చల్లకు పోతే
అల్లవారి కుక్క భౌవ్ భౌవ్ మన్నది
నా కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లు మన్నవి
చంకలో పాప క్యారు క్యారు మన్నది
పుట్టలో పాము బుస్ బుస్ మన్నది
3. పొద్దున్నే మనం లేవాలి
పళ్ళను బాగా తోమాలి
గ్లాసుడు పాలు తాగాలి
స్నానం చక్కగా చెయ్యాలి
తలను నున్నగా దువ్వాలి
చక చక బడికి వెళ్ళాలి
గురువుకు దన్నం పెట్టాలి
చదువులు బాగా చదవాలి
అమ్మ నాన్న మెచ్చలి..
4. ఏనుగమ్మ ఏనుగు – నాలుగుకాళ్ళ ఏనుగు
ఏ ఊరొచ్చింది ఏనుగు – మా ఊరు వచ్చింది ఏనుగు
ఏం చేసింది ఏనుగు – నీళ్లు తాగింది ఏనుగు
ఏనుగు ఏనుగు నల్లన – ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు – ఎంతో చక్కని దేవుడు
5. బావ బావ పన్నీరు
బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు
వీసెడు గంధం పూసేరు
పట్టె మంచం వేసేరు
పాతిక గుద్దులు గుద్దేరు
నులక మంచం వేసేరు
నూరు గుద్దులు గుద్దేరు
బావ బావ పన్నీరు
బావకు మరదలు బంగారు
6. చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగు పూలు తెవే
బండెక్కి రావే బంతి పూలు తెవే
తేరు మీద రావే తేనె పట్టు తెవే
పల్లకిలో రావే పాలు పెరుగు తెవే
ఆడుకుంటూ రావే అరటి పండు తెవే
అన్నిటిని తెవే మా అబ్బాయి కియ్యవే
7. బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది
పడమటింటి కాపురం చేయనన్నది
అత్త తెచ్చిన కొత్త కొక కట్టనన్నది
మామ తెచ్చిన మల్లె మొగ్గ ముడవనన్నది
మొగుని చేత మొట్టికాయ తింటానన్నది..
8. కాకమ్మ నలుపు కారుమబ్బు నలుపు
కాకమ్మ నలుపు కారుమబ్బు నలుపు
కొంగమ్మ తెలుపు కోడిగుడ్డు తెలుపు
కొంగమ్మ తెలుపు కోడిగుడ్డు తెలుపు
చిలకమ్మ పచ్చనా చెట్లన్నీ పచ్చనా
చిలకమ్మ పచ్చనా చెట్లన్నీ పచ్చనా
దాసాని ఎరుపు దానిమ్మ ఎరుపు
దాసాని ఎరుపు దానిమ్మ ఎరుపు
9. చెట్టు మీద కాకమ్మ కావ్ కావ్ కావ్
కొమ్మ మీద కోయిలమ్మ కూ కూ కూ
ఇంటిలోన పిచ్చుక పిల్ల కీచుక్ కీచుక్ కీచుక్
ఆకుచాటు రామచిలుక రామ రామ
ఉట్టి మీద పిల్లి పిల్ల మీయం మీయం మీయం
వీధిలోన కుక్క పిల్ల భౌ భౌ భౌ
ఉయ్యాల్లో బుల్లి పాప క్యార్ క్యార్ క్యార్
గోడ మీద గడియారం టిక్ టిక్ టిక్
10. వాన వాన వల్లప్పా వాకిలి తిరుగు చెల్లప్ప
వాన వాన వల్లప్పా వాకిలి తిరుగు చెల్లప్ప
తిరుగు తిరుగు తిమ్మప్పా తిరగలేనే నరసప్పా
తిరుగు తిరుగు తిమ్మప్పా తిరగలేనే నరసప్పా
తిరగలేనే నరసప్పా
11. ఛుక్ ఛుక్ రైలు వస్తోంది
దూరం దూరం జరగండి
ఆగినాకా ఎక్కండి
జోజో పాప ఏడవకు
లడ్డు మిఠాయి కొనిపిస్తా
చల్లని పాలు తాగిస్తా
12. దాగుడుమూత దండాకోర్
పిల్లి వచ్చే ఎలుక దాగే
ఎక్కడి దొంగలు అక్కడే
గప్ చిప్ సాంబార్ బుడ్డి
13. ఒప్పులకుప్పా వయ్యారి భామ
సన్నబియ్యం ఛాయాపప్పు
బావిలో కప్పా చేతిలో చిప్పా
రోట్లో తవుడు నీ మొగుడేవారు ?
గూట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్
14. చెమ్మ చెక్క చేరడేసి మొగ్గ
అట్లుపోయంగా ఆరగించంగా
ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేయంగా
రత్నాల చెమ్మ చెక్క రంగులేయంగా
పగడాల చెమ్మ చెక్క పదిరేయంగా
పందిట్లో మా బావ పెళ్లి చేయంగా
సుబ్బారాయాడు పెండ్లి చూచి వద్దాం రండి
మా వాళ్ళింట్లో పెండ్లి, మళ్ళి వద్దాం రండి
15. తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్
తప్పెట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుడిలో మేళాలోయ్
పళ్ళు ఫలము దేవుడికోయ్
పాలు నెయ్యి పాపాయికోయ్
పప్పు బెల్లం దేవుడికోయ్
పాలు నెయ్యి పాపాయికోయ్
16. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు పట్టు దట్టి
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు పట్టు దట్టి
సంది తాయెత్తులు సిరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు
సంధి తాయెత్తులు సిరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు
17. రింగు రింగు బిళ్ళ – రూపాయి దండ
దండ కాదురా – తామర మొగ్గ
మొగ్గ కాదురా – మోదుగ నీడ
నీడ కాదురా – నిమ్మల బావి
బావి కాదురా – బచ్చలి కూర
కూర కాదురా – కుమ్మరి మెట్టు
మెట్టు కాదురా – మేదర సిబ్బి
సిబ్బి కాదురా – చీపురు కట్ట
కట్ట కాదురా – కావడిబద్ద
బద్ద కాదురా – బారెడు మీసం
మీసం కాదురా – మిరియాలపొడుం
పొడుం కాదురా – పోకిరి బావ
18. దోసెమ్మ దోస వేడి వేడి దోస
నాన్నకు ఐదు అమ్మకు నాలుగు
అన్నకు మూడు అక్కకు రెండు
పాపాయి కొకటి నాకేమి లేవు
దోసెమ్మ దోస వేడి వేడి దోస
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ కిడ్స్ ను చూడండి.
