దక్షిణ భారతంలో ఉన్న ఆలయ సంపదలో కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక స్థానం దక్కించుకున్నది. శిల్పకళ, స్థలపురాణం, భక్తి పరాకాష్టతో ఈ క్షేత్రం భక్తులను ఆకర్షించడంలో ముందుంటుంది. శ్రీ పరమేశ్వరుడు మామిడి చెట్టు కింద పార్వతీదేవితో కలిసి స్వయంభుగా కొలువై ఉన్న ఈ ప్రదేశానికి వేలాది ఏళ్ల నాటిది చరిత్ర. పంచభూత లింగాలలో భూమిని ప్రతినిధించేదిగా పృథ్విలింగంగా ఈ క్షేత్రం మహత్యాన్ని సంతరించుకుంది.
ఈ ఆలయం భౌతికంగా 40 ఎకరాల విస్తీర్ణంలో విరాజిల్లుతూ, చోళులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యాలు నిర్మించిన శిల్పసంపదను మేల్కొలిపేలా ఉంది. మామిడి చెట్టు కింద మట్టి లింగాన్ని కౌగిలించి భక్తిశ్రద్ధలతో పార్వతీదేవి చేసిన తపస్సు ఈ స్థలానికి అపూర్వమైన పవిత్రతను అందించింది. మల్లె తైలంతో మాత్రమే అభిషేకం చేసే ప్రత్యేక లింగరూపం, కామాక్షిగా వెలసిన దేవి, శతాబ్దాల నాటిది బ్రహ్మోత్సవాలు—ఇవన్నీ కలసి ఈ ఆలయాన్ని శైవ సాంప్రదాయానికి నిలువెత్తు చిహ్నంగా నిలబెట్టాయి.
ఏకాంబరేశ్వర స్వామి ఆలయం స్థల పురాణం విశేషాలు:
సత్యయుగం లో శివపార్వతులు పాచికలు ఆడిన తర్వాత ఇస్టోక్తులు సరస సల్లాపాల వేళ ఈశ్వరుడి కళ్ళను పార్వతి దేవి ముసిందట. లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్య చంద్రులైన ఆ నేత్రాలను మూయడం వలన అంతట అధికారం అలుముకున్నదట. చిలిపి చేష్ట అయినా లోకాలకు హాని చేసేది కావడం వలన మహేశ్వరుడు ఆమెను చీకటితో సమానమైన నల్లని శరీర వర్ణం ధరించి భూలోకంలో శరీర ఛాయ తిరిగి గత వర్ణం సంతరించుకునేంత వరకు తపమాచరించమని ఆదేశించారట. అప్పుడు ఆ జగదాంబ తన తప్పును తెలుసుకొని భర్తను ప్రార్ధించగా, అయన జాలి పడి శాప విమోచన మార్గం చెప్పేడట దింతో భూలోకంలో ఏడాదిపాటు ఒకే ఒక్క పండు మాత్రమే కాసే మామిడి చెట్టు కింద కూర్చుని మట్టి లింగాన్ని పూజించడం ప్రారంభించింది.
శివుడు పార్వతిదేవిని పరీక్షించదలచి తన జటాజూటంలో నుంచి గంగను అమితవేగంగా పరేటట్టు జారవిడిచడంట. ఉదృతంగా పొర్లుకొస్తున్న ఆ ప్రవాహానికి పార్వతి దేవి శివలింగాన్ని గట్టిగ కౌగిలించుకొని నిర్భయంగా ఉండిపోయిందట. దింతో సంతృప్తి చెందిన ఈశ్వరుడు ఆమెకు శాపవిమోచనం కలిగించాడు. ఆ తర్వాత పార్వతి దేవి కోరిక మేరకు శివయ్య ఇక్కడి మామిడి చెట్టు కిందే స్వయంభువుగా ఉండిపోయాడట. అందుకే శివయ్యకు ఏకాంబ్రనాథుడు అనే పేరు వచ్చింది. అలాగే ఇక్కడ నూతన సౌందర్యంతో వెలసిన ఈ పార్వతి దేవికి కన్నులు ఆకర్షణీయంగా ఉండటంతో ఈమెకి కామాక్షి అని పేరు వచ్చింది.
అమ్మవారు తయారు చేసిన లింగాన్ని మహా లింగంగా భావించి పూజిస్తారు. ఈ శివలింగానికి మల్లెల తైలంతో మాత్రమే అభిషేకం చేస్తారు. మిగతా అభిషేకాలన్నీ పక్కనే ఉన్న మరో శివలింగానికి చేస్తారు.
శివలింగాన్ని ఆలింగనం చేసిన కామాక్షి:
గర్భాలయంలో ఏకాంబ్రశ్వర స్వామి లింగానికి నిత్య పూజలు వైభవంగా జరుపుతారు, వేలాది సంవత్సరాల నుండి ఏకాంబ్రశ్వరుడి దివ్య లింగం ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉండడం నిజంగా మహేశ్వరుడి మహిమకు నిదర్శనం. కామాక్షి రూపంలో ఉన్న పార్వతి శివలింగాన్ని కౌగలించుకొని ఉండటం వలన శివలింగం పై పార్వతి గాజులతో పాటు మేడలో ఆభరణాల గుర్తులు ఇప్పటికి స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పృథ్వి లింగాన్ని దర్శించడం ద్వారా తీరని కోర్కెలు తీరడంతో పాటు జీవితంలో లేమి చూపదని, ముతైదు భాగ్యాలకు లోటు ఉండదని, సంతాన సౌభాగ్యం సిద్దూస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
కాంచీపురం మహిమ:
ఒక్కప్పుడు చోళ, పల్లవ, విజయనగర సామ్రాజ్యాల సార్వభౌమత్వాన్ని చూసిన మహిమాన్వితమైన నగరం కంచి. అద్వైత తత్వానికి జ్యోతి ప్రజ్వలన చేసిన ఆదిశంకరాచార్యులు పవిత్రమైన శ్రీచక్రాన్ని ప్రతిష్టించిన భూమి ఈ కంచిపురం.
తమిళనాడులోని కాంచీపురం జిల్లా శివకంచి క్షేత్రం అంటేనే ఆలయాలకు పుట్టింటి పేరు. పృథ్వి లింగం, తేజో లింగం, ఆకాశలింగం, జల లింగం, వాయులింగం పంచభూత లింగాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో ఒక్క వాయు లింగం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో ఉంటె, మిగిలిన అన్ని పంచభూత లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. వాటిలో పృథ్వి కాంచీపురం క్షేత్రంలో కొలువై విరాజిల్లుతుంది
ఆలయ విశేషాలు:
ఏకాంబ్రనాథ స్వామి కాంచీపురం లో క్రీస్తు శకం 6 వ శతాబ్దం నుండి పూజలు అందుకుంటున్నారు. కంచికి ఆగ్నేయంలో పరాశక్తి మహారుద్రమూర్తిగా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని శివక్షేత్రంగా రుద్రశాల అని పిలుస్తారు. ఈ క్షేత్రానికి రుద్రకోటి, కైలాస, ఏకాంబ్ర, మహా స్మశానం అనే ఐదు పేర్లు ఉన్నాయంటారు. ఆ మహేశ్వరున్ని పార్వతీదేవి స్వయంగా కొలిచిన దివ్య స్థలి కాచిపురం ఏకాంబ్రనాథ స్వామి క్షేత్రం.
ఏకాంబ్రం అంటే ఒక్క మామిడి చెట్టు అని అర్ధం ఏకాంబ్రశ్వరుడు అంటే ఒక్క మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్ధం. ఏకామ్రేశ్వరుడు భూమిని సూచించే లింగం కాబట్టి పృథ్వి లింగం అయింది. ఈ ఆలయాన్ని చోళులు విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవంగా ఏకాంబ్రశ్వరుడు మట్టి లింగంగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడ మూల స్దాన లింగం పార్వతి దేవి స్వహస్తాలతో చేసిందేనంటారు. ప్రధాన లింగంతో పాటు ఉత్సవ విగ్రహాలు రెండు మట్టివేనని ప్రతీతి.
శిల్ప వైభవం:
శివకంచిగా ప్రఖ్యాతి చెందిన కంచి ఏకాంబ్రనాథ ఆలయ ప్రాగణం దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆలయం మొత్తాన్ని విహంగా వీక్షణంగా చూస్తే నాలుగు వైపులా అందంగా ఆవిష్కృతమైన నాలుగు గాలి గోపురాలు వేళ ఏళ్ళనాటి శిల్పకళ వైభవంతో కళాత్మకతను మనోహరంగా ప్రకటిస్తున్నాయి. ఒక్కో గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు ఉంటుంది. దేవాలయం లోపల 1000 స్థంబాల కళ మండపంతో పాటు ఎన్నో శిల్పకళ నైపుణ్యానికి దర్పణం పట్టేలా నాటి కట్టడాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
ఏకాంబ్రశ్వరుడు కొలువైన ప్రగణంలో వరుసగా 1008 శివలింగాలు ప్రతిష్ఠితమై దర్శనమిస్తాయి. శైవ సాంప్రదాయ విస్తృతికి వ్యాప్తికి భక్తి ప్రపత్తులతో విశేషంగా కృషి చేసిన నయనార్ల ప్రతిమలు సైతం ఒకే క్రమంలో వరుసగా కనిపిస్తాయి.
చరిత్ర లో అడుగుజాడలు;
పల్లవుల తరువాత చోళులు 10 శతాబ్దం నుండి 13 వ శతాబ్దం వరకు పరిపాలించారు. అనంతరం విజయనగం రాజులు 14 శతాబ్దం నుండి 17 వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఏకాంబ్రశ్వర ఆలయంలోని 192 అడుగుల గాలి గోపురం, 1000 స్థంబాల మండపం, వరదరాజ స్వామి ఆలయంలోని శిల్పాలు, విజయనగర కాలంలోనే నిర్మితమైనట్టు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.
మామిడి చెట్టు మహిమ:
ఈ క్షేత్రంలో 3500 సంవత్సరాల మామిడి చెట్టు కాండాన్ని అద్దాల పెట్టెలో పెట్టి భద్రరపరిచారు. దీనికి రజత కవచం కూడా ఏర్పాటు చేసారు. ఆ మామిడి స్థానంలో నూతనంగా మరో మామిడి చెట్టును నాటారు. ఆ చెట్టు నాలుగు శాఖలను నాలుగు వేదాలుగా భావిస్తారు. నాలుగు కొమ్మలకు చెందిన కాయలు, నాలుగు రకాల రుచులను కలిగి ఉంటాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు నుండి పండిన పండును తింటే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ మామిడి చెట్టు కింద పార్వతి పరమేశ్వరులు వధువరులుగా దర్శనమిస్తారు.
ప్రత్యేక పూజలు:
- పృథ్విలింగ ధామంలో మాఘమాసంలో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. పాల్గుణ మాసంలో పణగుణ ఉత్తిరం అనే ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయి.
ఇక్కడ అమ్మవారి ప్రత్యేక ఆలయం లేదు. పక్కనే ఉన్న శ్రీ కామాక్షి దేవి ఆలయంనే అమ్మవారి సన్నిధిగా భావిస్తారు.
దర్శన సమాచారము:
- ఆలయ దర్శన వేళలు: ఉదయం 6.00 – 12.30, సాయంత్రం 4.00 – 8.30
- ప్రయాణ మార్గం: హైదరాబాద్ నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడ నుండి కోయంబేడు బస్టాండ్ నుండి కంచికి బస్సు ద్వారా చేరుకోవొచ్చు. తిరుపతి నుండి కూడా నేరుగా బస్సు సౌకర్యం లభిస్తుంది. దేశంలోని ప్రధాన విమానాశ్రమం నుండి చెన్నై విమానాశ్రమం చేరుకోవచ్చు. అక్కడ నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా కంచికి సులభంగా చేరుకోవచ్చు.
మరిన్ని ఇటువంటి ఆలయాల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
