Home » మాల్దీవ్స్ (Maldives) స్వర్గసమానమైన దీవుల దేశం సందర్శించవలసిన ప్రదేశాలు

మాల్దీవ్స్ (Maldives) స్వర్గసమానమైన దీవుల దేశం సందర్శించవలసిన ప్రదేశాలు

by Lakshmi Guradasi
0 comments
Top Places to Visit in Maldives

Places to Visit in Maldives: మాల్దీవ్స్ (Maldives) గురించి చెప్పాలంటే, ఇదొక స్వర్గం లాంటిది. స్ఫటికంలా క్రిస్టల్ క్లియర్ నీరు, నున్నని తెల్లని ఇసుక తీరాలు, పచ్చని కొబ్బరి చెట్లు – ఈ అందమైన దృశ్యాలు చూస్తే ఎవరైనా ముగ్దులవ్వాల్సిందే. మాల్దీవ్స్ పర్యాటకుల కలల ప్రదేశం. 

ఇక్కడ ప్రతి రిసార్ట్ ఒక ప్రత్యేక ద్వీపంలో ఉంటే, ఆ ప్రైవసీ ఎలాంటి ప్రశాంతత ఇస్తుందో ఊహించుకోండి! పర్యాటకులు అక్కడ ఏకాంతంగా, హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, స్వేచ్ఛను అనుభవించవచ్చు.

అలాగే, మాల్దీవ్స్ కేవలం హనీమూన్ కపుల్స్ మాత్రమే కాకుండా, ప్రయాణ కోరిక ఉన్న వారికీ, సాహసికులకు, కుటుంబాలకూ ఒక బెస్ట్ డెస్టినేషన్. ఇక్కడి స్థానిక సంప్రదాయాలు, సాంప్రదాయ సంగీతం, డాన్సులు, సువాసనభరితమైన సంప్రదాయ భోజనాలు కూడా మీ ప్రయాణాన్ని మరింత అద్భుతంగా మారుస్తాయి.

మాల్దీవ్స్ ఎందుకు చూడాలి?

మాల్దీవ్స్ అంటే కేవలం బీచ్లు, రిసార్ట్‌లతోనే కాకుండా, సాహసికులకు కూడా స్వర్గం. ఇక్కడ స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్, జెట్ స్కీయింగ్ వంటి సాహస క్రీడలు ఆడొచ్చు. నీలి సముద్రం లోతుల్లో ముత్యాల మణులు లాంటి ప్రవాళాలు, రంగురంగుల చేపలు, షార్కులు కనిపించడం ఒక అద్భుత అనుభవం.

మరొక వైపు, తాబేళ్ల రక్షణ కోసం నిర్వహించే ‘సేవ్ ఎ టర్టిల్’ వంటి కార్యక్రమాల్లో పర్యాటకులు ప్రయాణికులు పాల్గుంటు సముద్ర జీవులకు సహాయం చేస్తారు. సముద్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తాబేళ్లకు ఇబ్బందిగా మారుతున్న సమయంలో, ఈ చిన్న చిన్న పనులు బాగా ఉపయోగపడతాయి.

అలాగే, మాలే విమానాశ్రయం నుంచి రిసార్ట్‌లకు సీ ప్లేన్ లేదా పడవ ప్రయాణం చేసే సమయంలో కనిపించే సముద్రపు నీలి నీరు, తేలియాడే చిన్న దీవులు, రంగుల రీఫ్‌లు చూడటానికి పర్వత శిఖరాల అందం మించిన అనుభవాన్ని ఇస్తుంది.

మాల్దీవ్స్ సందర్శించడానికి ఉత్తమ సమయం:

మాల్దీవులకు వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే, నవంబర్ నుండి ఏప్రిల్ వరకు వెళ్లడం మంచి ఆలోచన. ఈ కాలంలో అక్కడ వాతావరణం చాలా హాయిగా ఉంటుంది. గాలులు తక్కువగా ఉంటాయి, సముద్రం ప్రశాంతంగా, నీలి నీళ్లు స్ఫటికంలా స్పష్టంగా ఉంటాయి. దాంతో డైవింగ్, స్నార్కెలింగ్ లాంటి జలక్రీడలు మరింత ఆనందంగా ఉంటాయి.

మరోవైపు, జూన్ నుండి అక్టోబర్ వరకు అక్కడ విపరీతమైన వర్షాలు పడతాయి. అలాగని చూడరానిదేమీ లేదు గానీ, సముద్రం కొంచెం కఠినంగా మారుతుంది. కాబట్టి ఈ సమయానికి ప్లాన్ చేసేటప్పుడు కాస్త ఆలోచించండి.

మాల్దీవులలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు:

మాలే అటాల్ (Malé Atoll):

Grand Friday Mosque

మాలే అటాల్ మాల్దీవ్స్ పర్యటనకు వెళ్ళే ప్రతి ఒక్కరి లిస్టులో ఉండాల్సిన ప్రత్యేక ప్రదేశం. ఇది మాల్దీవ్స్ రాజధాని మాలే నగరానికి నిలయం. ఈ అటాల్ రెండు భాగాలుగా విభజించబడింది – ఉత్తర మాలే అటాల్ మరియు దక్షిణ మాలే అటాల్. మాలేలో గ్రాండ్ ఫ్రైడే మసీదు (Hukuru Miskiy), నేషనల్ మ్యూజియం, మాలే ఫిష్ మార్కెట్, ఆర్టిఫిషియల్ బీచ్ లాంటి ప్రదేశాలు చూడాల్సినవే. అలాగే, వీధుల వెంట రకరకాల మార్కెట్లు, కేఫ్‌లు, రెస్టారెంట్లు ఉండటంతో స్థానిక రుచులను, వాసనలను, జీవనశైలిని దగ్గరగా చూడవచ్చు.

ఇక జలక్రీడల ప్రేమికులకు ఈ అటాల్ ఒక స్వర్గం లాంటిది. స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్, అండర్ వాటర్ స్కూటర్లు – ఇవన్నీ ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఉత్తర మాలే అటాల్ లోని మాంటా రీఫ్, బనానా రీఫ్ వంటి ప్రదేశాలు డైవింగ్ ప్రేమికులకు అత్యంత ప్రసిద్ధి చెందినవి.

మాలే అటాల్ సందర్శించడానికి నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఉత్తమ సమయం, ఎందుకంటే ఈ సమయంలో సముద్రం ప్రశాంతంగా, నీరు స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంటుంది. మాలే అటాల్ అనేది కేవలం బీచ్‌లు మాత్రమే కాదు, మాల్దీవ్స్ చరిత్ర, ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించడానికి ఒక అద్భుతమైన కేంద్రం.

సన్ ఐలాండ్ (Sun Island):

sun island maldives

సన్ ఐలాండ్, సౌత్ అరిఅటోల్ లో ఉన్న నలగురైధూ (Nalaguraidhoo Island) అని కూడా పిలువబడే ఒక అందమైన ద్వీపం. ఈ దీవి గురించి చెప్పాలంటే, టర్క్వాయిజ్ రంగు సముద్ర జలాలు, మెత్తని తెల్లని ఇసుక బీచ్‌లు, పచ్చని వనాలు కలిపిన పర్యాటక స్వర్గం. దాదాపు 1.6 కిలోమీటర్లు పొడవు, 440 మీటర్లు వెడల్పు ఉన్న ఈ దీవి, ప్రకృతి ప్రేమికులు, హనీమూన్ జంటలు, అడ్వెంచర్ తరహా పర్యాటకులకు ఒక ఆదర్శ ప్రదేశం.

ఇక్కడి లగ్జరీ రిసార్టులు సముద్రానికి సమీపంలో ఉండటంతో, ప్రతి ఉదయం నీలిరంగు సముద్ర దృశ్యాలను ఆస్వాదించవచ్చు. కేవలం రెస్ట్ తీసుకోవడం మాత్రమే కాకుండా, డైవింగ్, విండ్సర్ఫింగ్, జెట్ స్కీయింగ్, కేనోయింగ్, స్నోర్కెలింగ్ వంటి సాహస క్రీడలు కూడా చేయవచ్చు. వీటిలో నైపుణ్యం లేకపోయినా, ఇక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్ సెంటర్ లో ప్రొఫెషనల్ సిబ్బంది ద్వారా ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు.

సాయంత్రం సముద్ర తీరంలో సంగీతం, బార్లు, రొమాంటిక్ డిన్నర్లు, ప్రకృతి అందాలను చూసే వసతులు పర్యాటకులను మరింత ఆకట్టుకుంటాయి. ఈ దీవి అంటే కేవలం సౌకర్యాలే కాదు – అది ప్రశాంతత, సాహసం, ప్రకృతితో కనెక్ట్ అయ్యే ఒక ప్రత్యేక అనుభవం. 

బనానా రీఫ్ (Banana Reef):

banana reef maldives

మాల్దీవ్స్‌లో ఉత్తర మాలే అటాల్ లో ఉన్న బనానా రీఫ్ అనేది డైవింగ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరి డ్రీమ్ ప్లేస్. ఈ రీఫ్ తన అరటి ఆకారంతో మాత్రమే కాకుండా, అద్భుతమైన సముద్ర జీవ వైవిధ్యంతో కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు రంగురంగుల కొరల్స్, గుహలు, కేన్యాన్లు వంటి ఆకర్షణలను చూస్తూ, సముద్ర లోకంలో అద్భుతమైన అనుభవాన్ని పొందవచ్చు.

మాంటా రేలు, షార్కులు, బరాకుడాలు, గ్రూపర్లు వంటి పెద్ద చేపలు, చిన్న మత్స్యకారులు కలిసి ఈ రీఫ్‌కు ప్రత్యేకతని ఇస్తాయి. ఇక్కడి నీరు చాలా స్వచ్ఛంగా ఉండటంతో, 30 మీటర్ల వరకు స్పష్టత పొందడం సాధ్యమే. ఇదే కారణం ఇక్కడ ప్రొఫెషనల్స్ మాత్రమే కాకుండా, మొదటి సారి డైవ్ చేసే వారు కూడా ధైర్యంగా సముద్ర లోకాన్ని అన్వేషించడానికి ఇష్టపడతారు.

బనానా రీఫ్‌లో డైవింగ్ లోతు సుమారు 4 మీటర్ల నుంచి 30 మీటర్ల వరకు ఉంటుంది, కాబట్టి నవంబర్ నుండి ఏప్రిల్ వరకు వెళ్లడం ఉత్తమం, ఎందుకంటే ఈ కాలంలో సముద్రం ప్రశాంతంగా, నీరు పూర్తిగా స్వచ్ఛంగా ఉంటుంది. హుల్హుమాలే నుంచి స్పీడ్ బోట్ లో కేవలం 15 నిమిషాల దూరంలో ఉండే ఈ రీఫ్, డైవింగ్ మరియు స్నోర్కెలింగ్ చేయాలనుకునే వారికీ తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం. ఒకసారి ఇక్కడ డైవింగ్ చేస్తే, మీ మనసులో సదా నిలిచి పోయే జ్ఞాపకాల్ని సొంతం చేసుకోవడం ఖాయం.

అలిమతా దీవి (Alimatha Island):

మాల్దీవ్స్‌లోని వావు అటాల్ లో ఉన్న అలిమతా దీవి అంటే ప్రకృతి ప్రేమికులు తప్పక చూడాల్సిన ప్రదేశం. తెల్లని ఇసుక తీరాలు, స్వచ్ఛమైన నీలిరంగు సముద్రం, మెరిసే కొరల్ రీఫ్‌లు – ఇవన్నీ ఈ దీవిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. డైవింగ్, స్నోర్కెలింగ్ వంటి జలక్రీడల కోసం ఇక్కడి నీటి లోతులు సరిగ్గా సరిపోతాయి. సముద్రంలో పచ్చని చేపలు, పెద్ద తాబేలు, రేలు వంటి అనేక జలజీవులను ఇక్కడ దగ్గరగా చూడవచ్చు.

ఇక్కడి లగ్జరీ రిసార్ట్లు, బీచ్ బంగలాలు, ఓవర్ వాటర్ విల్లాలు – ఇవన్నీ కేవలం హనీమూన్ జంటలకు మాత్రమే కాకుండా, కుటుంబాలు, ఒంటరి ప్రయాణికులకు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. టెలిఫోన్ లేదా టీవీ వంటి డిజిటల్ డిస్ట్రాక్షన్‌లు లేకుండా, పూర్తిగా ప్రకృతిలో లీనమవడానికి ఈ దీవి బాగా ఉపయోగపడుతుంది.

దీవికి సమీపంలో ఉన్న మియారు కండు (Miyaru Kandu) అనే ప్రసిద్ధ డైవింగ్ ఛానెల్ కూడా ఉంది. దీనిని షార్క్‌ల సముద్రం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున షార్కులు కనిపిస్తాయి. దీని వల్ల అలిమతా దీవి, డైవింగ్ ప్రేమికులకు ఒక రహస్య, ఆహ్లాదకరమైన గమ్యస్థలంగా నిలుస్తుంది.

ఆర్టిఫిషియల్ బీచ్ (Artificial Beach):

మాల్దీవ్స్ రాజధాని మాలే నగరంలోని తూర్పు తీరంలో ఉన్న ఆర్టిఫిషియల్ బీచ్ అనేది ఓ ప్రత్యేక ప్రదేశం. ఇది కేవలం సహజ సౌందర్యమే కాకుండా, మానవ నిర్మిత ప్రకృతి రమణీయత కూడా కలిపిన ఒక అందమైన బీచ్. సముద్రం నుండి భూమిని తిరిగి పొందడం ద్వారా సృష్టించిన ఈ బీచ్, స్థానికులు, పర్యాటకులు ఇద్దరికీ ప్రియమైన విశ్రాంతి స్థలంగా మారింది.

ఇక్కడ మృదువైన తెల్లటి ఇసుక, తాటి చెట్లు, స్వచ్ఛమైన సముద్ర జలాలు కలిసి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. సూర్యకాంతి ని ఆస్వాదించడానికి, ఈత, జలక్రీడలు వంటి రకరకాల యాక్టివిటీలకు ఇది బెస్ట్ ప్లేస్. మాలే నగరంలోని హడావిడి నుండి కాస్తంత దూరంగా, ప్రశాంతంగా టైమ్ స్పెండ్ చేయాలనుకునేవారికి ఇది ఒక అద్భుతమైన చోటు.

ఇక్కడ వాలీబాల్ కోర్టులు, ఫుట్సాల్ టర్ఫ్ వంటి క్రీడా వేదికలు కూడా ఉన్నందున, స్పోర్ట్స్ లవర్స్, కుటుంబాలు సంతోషంగా సమయం గడుపుతారు. కేవలం క్రీడలు మాత్రమే కాదు, బీచ్ సమీపంలో క్యాఫేలు, రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్లు కూడా ఉండటం మరో అదనపు ఆకర్షణ. సాయంత్రం వేళల్లో జరిగే సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక ఉత్సవాలు ఈ బీచ్‌కు మరింత ప్రత్యేకతని తెస్తాయి. మాలే నగరంలో సులభంగా చేరుకోవచ్చని, అన్ని వయసుల వారికీ సరైన గమ్యస్థలమని చెప్పొచ్చు.

ఫిహల్హోహి దీవి (Fihalhohi Island):

ఫిహల్హోహి దీవి అనేది మాల్దీవ్స్‌లోని మాలే అటాల్‌లో ఉన్న ఒక అద్భుతమైన, శాంతియుత దీవి. ఈ దీవి అందమైన హౌస్ రీఫ్‌ కి దగ్గరగా ఉన్నందున, రంగురంగుల చేపలు, కొరల్స్, కప్పలు, మాంటా రేలు వంటి సముద్ర జీవులను దగ్గరగా చూడడానికి ఇది పరిపూర్ణమైన ప్రదేశం. ప్రకృతి ప్రేమికులు మరియు జలక్రీడల అభిరుచిగల వారు ఇక్కడకి రావడం ద్వారా అనేక అనుభవాలను పొందవచ్చు. ఈ దీవిలో సౌమ్య వాతావరణం ఉండడం వలన, పర్యాటకులకు స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్, జెట్ స్కీయింగ్, బనానా బోట్ రైడ్స్ వంటి సాహస క్రీడలను ఆస్వాదించడానికి మంచి ప్రదేశం.

ఫిహల్హోహి దీవి మాల్దీవ్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది, మరియు స్పీడ్ బోట్ ద్వారా సుమారు 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ దీవి లో లగ్జరీ విల్లాలు, స్పా సౌకర్యాలు, మరియు అద్భుతమైన ప్రకృతి సౌందర్యం పర్యాటకులను విశ్రాంతి, సాహసం, మరియు రొమాంటిక్ అనుభవాలకు దారి తీస్తాయి.

అదేవిధంగా, సాంస్కృతిక పర్యటనలు, డాల్ఫిన్ సఫారీలు, సూర్యాస్తమయ ఫిషింగ్ ట్రిప్‌లు వంటి ఆకర్షణలు పర్యాటకులకి మరింత మధురమైన అనుభవాలను అందిస్తాయి. ఫిహల్హోహి దీవి అనేది మాల్దీవ్స్‌లో ఒక స్మరణీయమైన, స్వర్గసమాన సెలవుల గమ్యస్థలం.

వెలిగండు దీవి (Veligandu Island):

Veligandu Island Maldives

వెలిగండు దీవి మాల్దీవ్స్‌లోని ఉత్తర అరిఅటాల్ లో, రాస్దూఅ అటాల్ తూర్పు అంచులో ఉన్న ఒక అద్భుతమైన స్వర్గధామం. ఈ దీవి 22 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి, 600 మీటర్ల పొడవు మరియు 150 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. తెల్లటి ఇసుక బీచ్‌లు, ఆకుపచ్చ కొబ్బరి చెట్లు, మరియు టర్క్వాయిజ్ లగూన్ ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన అందాన్ని ఇచ్చి, ప్రకృతి ప్రేమికులు మరియు విశ్రాంతి కోరుకునే వారికి ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అందిస్తాయి.

వెలిగండు దీవి మొత్తం ఒక రిసార్ట్‌గా పనిచేస్తుంది, అందువల్ల ఇక్కడ పెద్దగా జనసాంద్రత లేకుండా, మీరు ఒంటరిగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఓవర్ వాటర్ విల్లాలు, లగ్జరీ సౌకర్యాలు, మరియు సముద్రపు అందాలు కలిపి, ఈ దీవి రొమాంటిక్ సెలవుల కోసం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది.

వెలిగండు దీవిలో మీరు స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్, కయాకింగ్, విండ్సర్ఫింగ్, జెట్ స్కీయింగ్ వంటి అనేక జలక్రీడలు ఆస్వాదించవచ్చు. దీవి చుట్టూ ఉన్న హౌస్ రీఫ్ స్నోర్కెలింగ్ మరియు డైవింగ్ కోసం అద్భుతమైన ప్రదేశం. అదేవిధంగా, బీచ్ వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి ల్యాండ్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ దీవి స్పా, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ షోలు వంటి సౌకర్యాలతో కూడిన ఒక సంపూర్ణ సెలవుదిన అనుభవం మీకు అందిస్తుంది. మాల్దీవ్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 20 నిమిషాల సీ ప్లేన్ ప్రయాణం ద్వారా ఈ దీవికి సులభంగా చేరుకోవచ్చు.

అడ్డు అటాల్ (Addu Atoll):

అడ్డు అటాల్ మాల్దీవ్స్‌లోని దక్షిణ తీరంలో ఉన్న అత్యంత దూర ప్రాంత అటాల్ గా ప్రసిద్ధి చెందింది. ఇది మాలే నగరానికి సుమారు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఈ అటాల్‌లో అడ్డు సిటీ ఉంది, ఇది మాల్దీవ్స్‌లోని నాలుగు ప్రధాన నగరాల్లో ఒకటి.

అడ్డు అటాల్‌లోని హుల్హుదూకు, మీధూ, మరధూ, ఫేయ్దూ, హిత్దూ వంటి సహజ దీవులు ఈ ప్రాంతాన్ని మరింత అందమైనదిగా తీర్చిదిద్దాయి. అడ్డు అటాల్ ప్రత్యేకత, ఇతర మాల్దీవ్ అటాల్‌లతో పోలిస్తే, ఈ అటాల్‌కు సహజ లగూన్ మరియు నాలుగు సహజ చానెల్‌లు ఉన్నాయి, ఇవి సముద్ర నౌకలకు ఎప్పుడూ సురక్షితమైన, శాంతమైన స్థలం అందిస్తాయి.

చరిత్రలో అడ్డు అటాల్ బ్రిటిష్ రాయల్ నేవీ సెక్రెట్ బేస్‌గా ఉపయోగించబడింది, దీనికి HMS Haitian అనే పేరు ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇక్కడ ఆయిల్ ట్యాంకులు, స్టోరేజ్ సదుపాయాలు, ఎయిర్ స్ట్రిప్, మరియు ఫ్లయింగ్ బోట్ బేస్ నిర్మించబడ్డాయి. ఈ బేస్ 1976లో మూసివేయబడినప్పటికీ, గాన్ దీవిలో ఉన్న గాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ద్వారా ఈ ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు.

ఉతేేము గందువారు (Utheemu Ganduvaru):

Utheemu Ganduvaru Maldives

ఉతేేము గందువారు మాల్దీవ్స్‌లోని హా అలిఫ్ అటాల్ లో ఉన్న ఒక ప్రాచీన చారిత్రక ప్రదేశం. ఇది సుల్తాన్ మొహమ్మద్ తాకురుఫాను జన్మస్థలం మరియు ఆయన బాల్య కాలపు నివాసం. సుల్తాన్ తాకురుఫాను, 16వ శతాబ్దంలో పోర్చుగీస్ ఆక్రమణ నుంచి మాల్దీవ్స్‌ను స్వాతంత్ర్యం వైపు నడిపిన మహానాయకుడు. ఈ ప్యాలెస్, మాల్దీవియన్ సంప్రదాయ చెక్క నిర్మాణం మరియు సాంస్కృతిక శిల్ప కళను ప్రతిబింబించే అత్యంత బాగుగా సంరక్షించబడిన నిర్మాణాల్లో ఒకటి.

ఈ ప్రదేశం, ఆ కాలంలో తాకురుఫాను మరియు ఆయన కుటుంబం ఎలా జీవించేవారో, వారి సామాన్య జీవన శైలి, స్వాతంత్ర్య పోరాట వ్యూహాలు, మరియు సముద్ర యుద్ధాల ప్రణాళికలను తేటతెల్లం చేస్తుంది. ఉతేేము గందువారు సందర్శకులకు మాల్దీవ్స్ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, మరియు జాతీయ గర్వం గురించి లోతుగా అర్థం చేసుకునే అద్భుత అవకాశం ఇస్తుంది. ఇప్పటికీ, ఈ ప్రదేశం మాల్దీవ్స్ స్వాతంత్ర్య పోరాట ఆత్మను ప్రతిబింబించే ప్రతీకగా నిలుస్తోంది, ప్రతి సందర్శకుడికి ఆ కాలపు జీవనశైలిని సజీవంగా చూపిస్తోంది.

హువాహెంధూ దీవి (Huvahendhoo Island):

హువాహెంధూ దీవి మాల్దీవ్స్‌లోని సౌత్ అరిఅటాల్ లో ఉన్న ఒక స్వర్గధామం. ఈ దీవి తన తెల్లటి ఇసుక బీచ్‌లు, నీలి సముద్రం, మరియు సముద్ర జీవ వైవిధ్యంతో పర్యాటకులను అలరిస్తోంది. హువాహెంధూ దీవికి దగ్గరలో ఉన్న లిలీ బీచ్ రిసార్ట్ & స్పా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లగ్జరీ రిసార్ట్, ఇక్కడి స్పష్టమైన నీటిలో స్నోర్కెలింగ్ చేయడం ద్వారా రంగురంగుల కొరల్స్, తిమింగలాలు, రేలు, మరియు ఇతర సముద్ర జీవాలను సమీపంగా చూడవచ్చు. ఈ దీవి ప్రేమికులు, హనీమూన్ జంటలు, మరియు కుటుంబాల కోసం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది.

ఈ దీవిలో పర్యాటకులకు అనేక రకాల సౌకర్యాలు మరియు వినోద కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. లిలీ బీచ్ రిసార్ట్ లోని రీస్టారెంట్లు, స్పా, జెట్ స్కీ, గ్లాస్ బాటమ్ కెనూ, మరియు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ వంటి వినూత్న అనుభవాలు పర్యాటకులను మరింత ఆకర్షిస్తాయి. సాయంత్రం లైవ్ మ్యూజిక్, సాంస్కృతిక కార్యక్రమాలు, మరియు సముద్ర తీర పండుగలు పర్యాటకుల రాత్రులను మరింత ఆహ్లాదకరంగా మార్చుతాయి. 

మాలే అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు 25 నిమిషాల సీ ప్లేన్ ప్రయాణంలో ఈ దీవికి చేరుకోవచ్చు. ప్రకృతి అందాలు, లగ్జరీ, మరియు ప్రశాంతత కోరుకునే వారికి హువాహెంధూ ఒక పరిపూర్ణ గమ్యస్థలం.

ఇతర ముఖ్య ప్రదేశాలు:

మాఫుషి (Maafushi) – బడ్జెట్ ట్రావెలర్లకు అనుకూలమైన దీవి

గ్రాండ్ ఫ్రైడే మసీదు (Grand Friday Mosque) – మాల్దీవ్స్‌లో అతిపెద్ద మసీదు

ఫిష్ మార్కెట్ (Fish Market) – మాలేలోని ప్రసిద్ధ మార్కెట్

మిరిహి (Mirihi) – డిజిటల్ డిటాక్స్ కోసం ప్రసిద్ధి

బరోస్ దీవి (Baros Island) – సుందరమైన బీచ్‌లు మరియు లగ్జరీ రిసార్ట్లు

గుల్హి బీచ్ (Gulhi Beach) – పచ్చని సముద్రం మరియు తెల్లటి ఇసుక

లగ్జరీ రిసార్ట్‌లకు ఉత్తమ అటాల్స్:

మాల్దీవ్స్‌లో అత్యంత లగ్జరీ రిసార్ట్లు ఉత్తర మాలే అటాల్ (North Malé Atoll) మరియు దక్షిణ మాలే అటాల్ (South Malé Atoll)లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అందమైన బీచ్‌లు, ఓవర్ వాటర్ విల్లాలు, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన రిసార్ట్లు పర్యాటకులకు ప్రత్యేక అనుభవాన్ని ఇస్తాయి. బా అటాల్ (Baa Atoll) యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్‌గా గుర్తింపు పొందింది, ఇక్కడి సహజ వనరుల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. లావియాని అటాల్ (Lhaviyani Atoll) హనీమూన్ జంటలకు స్వర్గసమానమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.

మాల్దీవులలో ప్రత్యేక అనుభవాలు:

మాల్దీవ్స్‌లో అండర్ వాటర్ డైనింగ్ మరియు ఓవర్ వాటర్ విల్లాలు అనేవి ప్రపంచంలోనే అరుదైన అనుభవాలు. ఇక్కడ ప్రైవేట్ ఐలాండ్ హాపింగ్ ద్వారా అనేక చిన్న, అందమైన దీవులను సందర్శించవచ్చు. రంగురంగుల కొరల్ రీఫ్‌లలో స్నోర్కెలింగ్, స్కూబా డైవింగ్ అనుభవాలు అందుబాటులో ఉన్నాయి. జెట్ స్కీయింగ్, విండ్సర్ఫింగ్ వంటి థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్ కూడా పర్యాటకుల ఇష్టమైనవి. అలాగే డాల్ఫిన్, తిమింగలాల వీక్షణ కూడా మాల్దీవ్స్‌లో ప్రత్యేక ఆకర్షణ.

సాంస్కృతిక మరియు చారిత్రక ఆకర్షణలు:

మాల్దీవ్స్ చరిత్రను ప్రతిబింబించే ప్రదేశాలలో పాత ఫ్రైడే మసీదు (Hukuru Miskiy) అత్యంత ప్రసిద్ధి. ఇది 1656లో నిర్మించబడిన పురాతన ఇస్లామిక్ మసీదు. మాల్దీవ్స్ జాతీయ మ్యూజియం (National Museum)లో దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, పురాతన వస్తువులు ప్రదర్శించబడుతున్నాయి. ఉతేేము గందువారు (Utheemu Ganduvaru) చారిత్రక చెక్క ప్యాలెస్, సుల్తాన్ మొహమ్మద్ తాకురుఫాను జన్మస్థలం, మాల్దీవ్స్ స్వాతంత్ర్య పోరాట చరిత్రకు ముఖ్యమైన ప్రదేశం.

మాల్దీవ్స్ ప్రయాణ సూచనలు:

మాల్దీవ్స్ ట్రిప్ కోసం సరైన ప్యాకింగ్ చాలా ముఖ్యం. సూర్యరశ్మి నుండి రక్షణకు సన్‌స్క్రీన్, హ్యాట్, సన్నని దుస్తులు తీసుకెళ్లాలి. బడ్జెట్ ప్రయాణం మరియు లగ్జరీ ట్రావెల్ మధ్య తేడాలను ముందుగానే అర్థం చేసుకోవడం మంచిది. స్థానిక సంప్రదాయాలు, ఆచారాలు గౌరవించడం, మసీదు సందర్శన సమయంలో సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం ప్రయాణాన్ని సాఫీగా చేస్తుంది.

మాల్దీవ్స్ ఎందుకు తప్పనిసరి గమ్యస్థలం?

ప్రపంచంలోని అందమైన సముద్రతీరాలు, అద్భుతమైన ప్రకృతి, వినూత్న జలక్రీడలు, సాంస్కృతిక వారసత్వం మాల్దీవ్స్‌ను ప్రత్యేకంగా చేస్తాయి. హనీమూన్, కుటుంబ సెలవులు, అడ్వెంచర్ ట్రావెల్ కోసం ఇది ఒక పరిపూర్ణ గమ్యస్థలం. సముద్ర మట్టం చాలా తక్కువగా ఉండటం వలన సముద్రం మధ్యలో ఉన్నట్లు అనిపించే ఈ దేశం ప్రతి పర్యాటకుడి కలల గమ్యం. మాల్దీవ్స్ సందర్శించడం మరువలేని అనుభవంగా మారుతుంది.

మరిన్ని ఇటువంటి ప్లచెస్ కోసం తెలుగు రీడర్స్ విహారి ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.