Home » ఇంట్లోనే మామిడి తాండ్ర తయారీ – సింపుల్ స్టెప్స్‌

ఇంట్లోనే మామిడి తాండ్ర తయారీ – సింపుల్ స్టెప్స్‌

by Vinod G
0 comment
91

వేసవి కాలం అనగానే మనకు బాగా గుర్తుకు వచ్చే పండు మామిడి పండు. ఈ పండును ఇష్టపడని వారుండరు, పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడుతుంటారు. ప్రతిఒక్కరు వేసవిలో ఈ పళ్ళను ఆస్వాదిస్తుంటారు. అయితే వేసవిలో విస్తృతంగా కనిపించే మామిడి పండ్లు వేసవి తరువాత ఇక కనిపించవు. వేసవి తరువాత మామిడి పండ్లు లేకపోయినా ఏడాదంతా వాటి రుచిని ఆస్వాదించేందుకు ఓ మార్గం ఉంది, అదే మామిడి తాండ్ర. మామిడి పండ్ల గుజ్జుతో తయారు చేసే ఈ మామిడి తాండ్రాను పిల్లలు, పెద్దలతో సహా చాలా మంది ఇష్టంగా తింటారు. కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యానికి కూడా మామిడి తాండ్రా ఎంతగానో ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా ఈ మామిడి తాండ్రాలో విటమిన్లు, ఖనిజాలు, లవణాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా దీనివల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. మామిడి తాండ్ర ప్రస్తుతం అన్ని రకాల దుకాణాల్లో అందుబాటులోకి వస్తున్నాయి. బడా కంపెనీలు సైతం వీటిని తయారు చేస్తున్నాయి. అయితే ఇంట్లోనే ఎంచక్కా తక్కువ ఖర్చులో మామిడి తాండ్రను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా.? ఇంతకీ మామిడి తాండ్రాను తయారు చేసుకోవడానికి ఏయే వస్తువులు కావాలి.? తయారీ విధానం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • బాగా పండిన రెండు మామిడి పండ్లు.
  • చక్కెర ఒక కప్పు.
  • ఒక టేబుల్‌ స్పూన్ నిమ్మరసం.
  • ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి.

తయారీ విధానం:

మామిడి తాండ్ర తయారీ చేయడానికి ముందుగా బాగా పండిన రెండు మామిడి పండ్లను తీసుకోండి. తరువాత ఆ పండ్లలోని గుజ్జును ఒక కప్పులోకి తీసుకోవాలి. ఆ తరువాత తీసిన ఆ గుజ్జులో తీపికి సరిపడా పంచదార వేసి బాగా కలపుకోవాలి. ఈ విధంగా చేసిన తరువాత తయారైన మిశ్రమాన్ని 30 నిమిషాలు పాటు పక్కను పెట్టుకోవాలి. అనంతరం ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆ తరువాత ముందు గా సిద్ధం చేసుకున్న మామిడి గుజ్జును పాన్‌లో వేసి బాగా కలుపుకోవాలి. గుజ్జు పూర్తిగా వేడెక్కిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి, మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అనంతరం చల్లారిన మిశ్రమాన్ని తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో నిమ్మరసం పిండుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. చివరిగా ఆ గుజ్జును ఒక ప్లేట్‌లో పోసి సమానంగా పరచాలి. ఆ తర్వాత తాండ్రను ఎండలో 3 నుంచి 4 రోజుల పాటు ఎండబెట్టాలి. తాండ్ర పూర్తిగా ఎండిన తర్వాత చిన్న, చిన్న ముక్కలుగా చేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం చాల సులభంగా ఇంట్లోనే మామిడి తాండ్రను చేసుకోవచ్చు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ ని సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version