ఒకానొక ఊరిలో రాజు అనే బాలుడు ఉండేవాడు, అతడికి పెయింటింగ్ వేయడమంటే చాల ఇష్టం దాంతో పాటు చాల కోపం కూడా ఎక్కువగా ఉండేది. ఎప్పుడూ ఎవరొకరితో గొడవపడుతూ ఉండేవాడు. ఒక రోజు రాజు అల్లరిని భరించలేక వారి తల్లితండ్రులు అతడిని మందలించారు. అప్పుడు రాజు తన తల్లితండ్రుల మీద కోపంతో అడవిలోకి వెళ్ళిపోయాడు. అలా అడవిలో తిరుగుతున్న రాజుకి ఒక పొదలలో మెరుస్తూ ఉన్న ఒక వెలుగు కనిపించింది. అప్పుడు రాజు దగ్గరికెళ్లి భయపడుతూ ఏంటా అని చూడగా అది ఒక పెయింట్ బ్రష్ అని గుర్తించాడు. ఆ బ్రష్ యొక్క హ్యాండిల్ బాగా మెరుస్తూ ఉంది.
ఇదేంటి వింతగా అని పిస్తుంది అని మనసులో అనుకుంటూ సరే ఈ బ్రష్ తో ఏదైనా పెయింటింగ్ వేద్దామని అనుకుని ఒక చిన్న మొక్క బొమ్మను రాయి మీద వేసాడు. అలా వేసిన బొమ్మ పూర్తవగానే ఆ మొక్క బొమ్మ కదలడం రాజు గమనించి ఆశ్చర్యపోయాడు. అప్పుడు రాజు చాల సంతోషించి ఆ బ్రష్ ని తీసుకుని ఇంటికి బయలు దేరాడు.
ఇంటికి చేరుకున్న రాజు తన ఇంటి పెరటిలో ఏర్పాటు చేసుకున్న పెయింట్ బోర్డు దగ్గరకు వెళ్లి పెయింటింగ్ చేయడం ప్రారంభించాడు. అతను ఒక అందమైన ఉద్యానవనం బొమ్మను వేసాడు. అందులో పువ్వులు, సందడి చేసే తేనెటీగలు, ప్రకాశవంతమైన సూర్యుడు వంటివి వేసాడు. పెయింటింగ్ పూర్తి అవగానే ఉద్యానవనం బొమ్మ ప్రాణం పోసుకుంది. అందులో ఉండే పువ్వులు వికసించాయి, తేనెటీగలు సందడి చేశాయి, ఇంకా రాజు ముఖంపై వెచ్చని సూర్యుడు కూడా ప్రకాశించాడు.
తన మొఖం మీద ఎండ పడడం రాజుకి నచ్చలేదు, వెంటనే మ్యాజిక్ పెయింట్ బ్రష్ తీసుకుని ఒక పెద్ద, బూడిద రంగు మేఘాన్ని సూర్యుడు కనపడకుండా ఆ బొమ్మ లో చిత్రించాడు. ఆ బూడిద మేఘం సూర్యుడిని కప్పివేయడంతో కొద్దీ రోజులకు తోట ఎండిపోవడం ప్రారంభించింది, పువ్వులు కూడా వాడి పోయాయి, తేనెటీగలు ఎగిరిపోయాయి.
ఇదంతా తన పెరటి సమీపంలోని చెట్టుపై కూర్చున్నరామచిలుక చూసి అటుగా వెళుతున్న రాజుని ఇలా అడిగింది, “రాజు , మేఘాన్ని ఎందుకు చిత్రించావు?” అని అడిగింది. దానికి రాజు బదులిస్తూ, “అది నేను చిత్రించిన బొమ్మ నేను ఏదైనా చేస్తాను” అని చెప్పాడు. రాజు మాటలు విన్న చిలుక ఇలా అంది ” అయితే పెరటిలోకి వెళ్లి నువ్వు చిత్రించిన బొమ్మ లోని తోటకు ఏమి జరిగిందో చూడు” అంది. వెంటనే రాజు అక్కడకు వెళ్లి వాడిపోతున్న పూలను, ఎండిపోయిన తోటను, తేనెటీగలను చూసి బాధపడ్డాడు.
అప్పుడు ఇదంతా గమనిస్తున్న రామచిలుక ఇలా అంది “ మనం చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మార్చేలా ఉండాలి” అని చెప్పింది. ఆ మాటలు విన్న రాజు ఒక విలువైన పాఠాన్ని నేర్చుకున్నాడు. తను చేసిన తప్పును గుర్తించి బాధ్యతతో, రాజు ఆ నీలి మేఘాన్ని తీసేసి తోటను దాని పూర్వ సౌందర్యానికి పునరుద్ధరించాడు. దీంతో పువ్వులు మళ్లీ వికసించాయి, తేనెటీగలు తిరిగి వచ్చాయి, వెచ్చని సూర్యుడు ప్రకాశించాడు.
ఆ రోజు నుండి రాజు ప్రవర్తన పూర్తిగా మారి పోయింది. అతడి ప్రవర్తన చూసి అతడి తల్లితండ్రులు చాల సంతోషించారు.కాలక్రమేణా మ్యాజిక్ పెయింట్ బ్రష్ సహాయంతో రాజు గొప్ప పెయింటర్ గా ప్రసిద్దికెక్కాడు.
నీతి: మన చర్యలు ఇతరులకు ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు, ఇతరులకు మేలు చేసేవిగా ఉండాలి.
మరిన్ని ఇటువంటి నీతికథల కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.