Home » అనగనగా ఓ చిట్టెలుక- తెలుగు కథలు

అనగనగా ఓ చిట్టెలుక- తెలుగు కథలు

by Manasa Kundurthi
0 comments

చిన్నారి చిట్టెలుకకి సాహసాలు చెయ్యడమంటే – భలే ఇష్టం. ఎప్పుడూ ఏవో తలకు మించిన సాహసాలు, అల్లరి పనులు చేయడం, పీకల మీదకి తెచ్చుకోవడం…! తల్లి అనేక విధాలుగా చెప్పి చూసింది. సాహసాల జోలికి పోకుండా. బుద్ధి కలిగి ఉండమని హెచ్చరించేది. తల్లి చెప్పినంతసేపు ఊ కొట్టి తలాడించేది చిన్నారి చిట్టెలుక. కాసేపయాక మళ్లీ మామూలే. తన తోవ తనదే. తన ధోరణి తనదే. తల్లి ఎలుక చెప్పి చెప్పి విసిగిపోయింది. చిట్టెలుక చేసే సాహస కృత్యాలు చిన్నవేమీ కావు. వొళ్లు గగుర్పొడిచే పనులు. ఎత్తుల మీదనుండి దుమికేది. మంటల్లో నుండి గెంతేది. కౄర జంతువులకు కోపం తెచ్చేలా వాటి జోలికి వెళ్లి అల్లరి పెట్టేది. ఏనుగుని వెక్కిరించేది. సింహం జూలు పట్టుకుని లాగేది. నక్కల తోకలు కొరికేది.

‘అన్నిటికన్నా ముఖ్యంగా తమకు సహజ శత్రువులైన పిల్లులను రెచ్చగొట్టి తన వెంట పరుగులు పెట్టించేది. వీటికి దొరకకుండా పరుగు పెడుతూ ఏ తెలుగులోనో దూరిపోతూ ఉండేది. ప్రాణం పణంగా పెట్టి అదే ఈ క్రీడ అంటే దానికి ఎంతో ఇష్టంగా ఉండేది. అందుకే అదంటే అక్కడి పిల్లులన్నింటికీ మంటే.ఎల ఈ భరతం పట్టాలని అవి గట్టిగా తీర్మానించుకున్నాయి.

ఇలా వుండగా ఒకరోజు ఒక గండు పిల్లి తరుముతూండగా ఈ చిట్టెలుక పరుగులు తీసింది. చాలా దూరం పరిగెత్తేక ఒక కొండ కనిపించింది. కొండ మీద ఒక పెద్ద గుహ కనిపిస్తే దానిలోకి దూరింది. ఆ గుహ ఎంత పెద్దదంటే దానికి అంతూపొంతూ కనిపించలేదు. గండుపిల్లి కూడా ఆ గుహలో దూరి ఈ చిట్టెలుక కోసం చాలాసేపు వెతికి అది కనిపించకపోవడంతో వెనుతిరిగింది.

anaganaga o chitteluka telugu story

చిట్టెలుక ఆ గుహలో చాలా దూరమే తిరిగింది కానీ, ఆ గుహలోంచి బయటపడేందుకు దానికి దారే దొరకలేదు. పైగా చాలా సేపట్నుంచి పరిగట్టడం వల్లనేమో దాహం కూడా వేయసాగింది. గొంతు తదుపుకోడానికి కాసిన్ని మంచినీళ్లెక్కడ కనిపిస్తాయాని వెతకసాగింది. ఆ గుహలో ప్రశాంతంగా జపం చేసుకుంటున్న ముని కనిపించాడు దానికి.

ఆయన ముందున్న కమండలం కూడా కనిపించింది. ఇకనేం, ప్రాణం లేచొచ్చినట్టయింది చిట్టెలుకకి. ఎలాగైనా ఆ కమండలంలోని నీళ్లతో దాహం తీర్చుకోవాలని దాని ఆలోచన. మెల్లిగా వెళ్లి ఆ కమండలం పైకెక్కి దాన్ని పడగొట్టే ప్రయత్నం చేయసాగింది. ఈ అలికిడికి కాస్తా జపం చేసుకుంటున్న ముని మెల్లిగా కళ్లు తెరిచాడు. తన తపోభంగానికి కారణమెవరాని చూసిన మునికి కమండలంపైనున్న చిట్టెలుక కనిపించింది. మునికి ఆగ్రహం కలగకపోగా ఆ చిట్టెలుక కదలికలూ, నీళ్ల కోసం అది చేసే ప్రయత్నమూ ముచ్చటగొలిపింది. ఇది బహు చిలిపిదనీ, సాహసాల ఎలుకనీ, ఆయన దివ్యదృష్టికి తెలిసిపోయింది. వెంటనే ఆ ముని కమండలంలోని నీరు దానిపై చల్లి ఏవో మంత్రాలు చదివాడు. అమాంతం ఆ చిట్టెలుక కాస్తా అందమైన రాకుమారుడిగా మారిపోయి, ముని ముందు చేతులు జోడించి నిలబడ్డాడు.

anaganaga o chitteluka telugu story

అప్పుడు ముని ఇలా చెప్పాడు. ” ఓయీ, నాకు నీ సాహసాల సంగతంతా తెలుసు. సామాజిక ప్రయోజనాల్లేని సాహసాలకు సార్ధకత ఉండదు. ఈ దేశపు రాజుకు పుత్రసంతానం లేదు. సాహసవీరుడికి తమ ఏకైక కుమార్తెనిచ్చి వివాహం చేసి రాజ్యపాలననూ రాజుగారి ఆలోచన. నీవెళ్లి రాజుగారికి కనిపించి, సహజమైన నీ ధైర్యసాహసాలనూ, మా అనుహ్రంతో బుద్ధిబలాన్నీ ప్రదర్శించు. “రాజుగారి మెప్పునీ, రాజకుమారినీ నీ సొంతం చేసుకో ” అంటూ ఆశీర్వదించి పంపాడు. ఉత్సాహంగా బయల్దేరిన ఆ యువకుడు, ముని చెప్పినట్టే చేసి, అనతికాలంలోనే గొప్ప రాజయ్యాడు.

ఇలాంటి మరిన్ని కథలకుతెలుగు రీడర్స్ని సందర్శించండి.

You may also like

Leave a Comment