ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడూ అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి…”అబ్బా ఎంత తెల్లగా, అందంగా ఉందీ హంస. దీనంత సంతోషంగా మరే పక్షీ ఉండదు. నేనూ ఉన్నాను ఎందుకు?” అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది. అప్పుడు హంస “నేనూ అలానే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో ఎంత బావుంటుందో కదా చిలుక” అంది హంస.
ఆ మాటలు విన్న కాకి చిలుక దగ్గరకు వెళ్లి హంస అన్న మాటల్ని చెప్పింది. అప్పుడు చిలుక “అవును హంస చెప్పి నట్లూ నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అని పించింది. నాకు రెండు రంగులే ఉన్నాయి. నెమలికి ఎన్ని రంగులో…” అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది. దానివద్దకెళ్లి “పక్షులన్నింటిలో అందమంటే నీదే. మనుషులకీ నువ్వంటే ఎంతి ష్టమో”’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది.
కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి “నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకూ వేటగాళ్లకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ల చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికొచ్చాక “కాకి కంటే స్వేచ్ఛా జీవి మరొకటి లేదు కదా” అనిపిస్తోంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్నీ బందీలుగా పెట్టారు… ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్చగా తిరిగేదాన్ని కదా! అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచీ మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలు పెట్టింది.
నీతి: వేరేవాళ్లతో మనల్ని పోల్చుకొని లేని దాని కోసం ఆరాటపడడం కంటే, మన దగ్గర ఉన్నదేంటో తెలుసుకుని దాని వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుంటే మంచిది.
మరిన్ని ఇటువంటి నీతికథల కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.