హైదరాబాద్‌లో పిల్లలు, పెద్దవాళ్లు చూసి ఆనందించగల 11 బెస్ట్ ప్రదేశాలు

by Lakshmi Guradasi

Places to visit Hyderabad in telugu: హైదరాబాద్‌ రాజధాని కావడంతో అందరికి ఆకర్షణగా మారింది. పల్లె ప్రాంతాల్లో ఉండే మన తెలుగు ప్రజలు కూడా ఒకసారి ఈ నగరానికి వచ్చి, ఇక్కడి అందాలు, చరిత్ర, ఆధునికతను ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటారు. ఉద్యోగాలు, చదువు, వ్యాపార అవకాశాల కోసం హైదరాబాదు పేరు ముందే వస్తుంది. కానీ ఈ పెద్ద నగరంలో ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నా వాటి గురించి చాలామందికి తెలియదు; కొంతమంది మాత్రమే ప్రసిద్ధ ప్రదేశాలను మాత్రమే తెలుసుకుంటారు.

మీ ప్రయాణాన్ని మరింత సులభం చేసుకోవడానికి, హైదరాబాద్‌లోని ముఖ్యమైన, ఆసక్తికరమైన పర్యాటక ప్రదేశాల జాబితాను మీకోసం సిద్ధం చేసాం. ఈ ప్రదేశాలు మీకు నగర సంస్కృతి, చరిత్ర, ప్రకృతి అందాలను ఒకేసారి ఆస్వాదించే అవకాశం ఇస్తాయి. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఈ ప్రదేశాలకు వెళ్లి, హైదరాబాద్‌ అనుభూతిని మరింత ఆనందించండి.

1. చార్మినార్ (Charminar)

Places to visit Hyderabad

హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది చార్మినార్! ఇది కేవలం ఒక కట్టడం కాదు, మన నగరానికి ఓ ప్రత్యేకమైన గురుతు. 1591లో కులీ కుతుబ్ షా అనే రాజుగారు ప్లేగు వ్యాధి తగ్గిపోయిన ఆనందంలో దీన్ని కట్టించారట. అందుకే ఇది మనకు ఎంతో ప్రత్యేకం. చార్మినార్ అంటే నాలుగు స్తంభాలు అని అర్థం. ఇది 56 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఒక్కో స్తంభం దాదాపు 49 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పైకి వెళ్లడానికి 147 మెట్లు ఉన్నాయి. అక్కడ ఒక మసీదు కూడా ఉంది, ఇప్పటికీ ప్రార్థనలు చేస్తారు.

చార్మినార్ చుట్టూ లాడ్ బజార్ అని ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది. అక్కడ గాజులు, బట్టలు, నగలు అన్నీ దొరుకుతాయి. హైదరాబాద్ వచ్చిన ఎవరైనా సరే, చార్మినార్ చూసి తీరాల్సిందే. ఇది మన సంస్కృతికి, చరిత్రకు నిదర్శనం. ఇక్కడ ఈద్, ఉల్ఫితర్ పండుగలు చాలా బాగా చేస్తారు. చార్మినార్ చూస్తూ, ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే హైదరాబాద్ సంస్కృతిని మనసారా ఆస్వాదించవచ్చు.

2. గోల్కొండ కోట (Golconda Fort)

Places to visit Hyderabad

గోల్కొండ కోట గురించి వినగానే చప్పట్లు గుర్తొస్తాయి కదూ! చాలా సినిమాల్లో చూసుంటాం, అక్కడ చప్పట్లు కొడితే పైకి వినిపిస్తుందని చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు సందడి చేస్తుంటారు. హైదరాబాద్‌లో చూడదగిన ప్రదేశాల్లో గోల్కొండ కోటకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు ఇది కాకతీయుల నుండి కుతుబ్ షాహీల వరకు ఎంతోమంది రాజుల పాలనా కేంద్రంగా విలసిల్లింది. అంతేకాదు, కోహినూర్, హోప్ డైమండ్ లాంటి ఎన్నో విలువైన వజ్రాలు ఇక్కడే దొరికాయట!

ఈ కోట దాదాపు 7 కిలోమీటర్ల పొడవునా పెద్ద గోడలతో, 8 ప్రవేశ ద్వారాలతో ఎంతో పటిష్టంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కోట మెయిన్ గేట్ దగ్గర చప్పట్లు కొడితే ఆ శబ్దం చాలా దూరం వరకు వినిపిస్తుంది. పూర్వం దీన్ని సైనికులు ఏదైనా ప్రమాదం వస్తే ఒకరికొకరు సంకేతంగా వాడుకునేవారట. సాయంత్రం వేళల్లో లైటింగ్తో కోట మరింత అందంగా మెరిసిపోతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ చప్పట్ల మ్యాజిక్ చూసి, అలా కూర్చుని సేద తీరుతుంటే ఆ అనుభూతే వేరు కదా!

3. సాలార్ జంగ్ మ్యూజియం (Salar Jung Museum)

Places to visit Hyderabad
Places to visit Hyderabad

మ్యూజియం అంటే మన చరిత్ర, సంస్కృతి, కళలను ఒక చోట సేకరించి, భవిష్యత్ తరాలకు చూపించే ప్రదేశం. అక్కడ పాత శిల్పాలు, అరుదైన పుస్తకాలు, ఖడ్గాలు, పాత పరికరాలు ఉంటాయి. వాటిని చూసేటప్పుడు మనం ఆ కాలపు జీవితం, ఆచారాలు, కళలు ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ఈ అర్ధం చేసుకునే శక్తి కూడా ఒక ప్రత్యేక కళే.

హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియం అలాంటి అద్భుత సేకరణలతో నిండిన ప్రదేశం. ఈ మ్యూజియం మొత్తం సేకరణ సాలార్ జంగ్ III గారు తన జీవితకాలంలో జాగ్రత్తగా సేకరించారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఇక్కడ 50,000కి పైగా పుస్తకాలు, రాజ వంశాలకు చెందిన ఖడ్గాలు, విలక్షణ ఆభరణాలు, పెయింటింగ్స్, శిల్పాలు, సిరామిక్స్, మాన్యుస్క్రిప్ట్స్ వంటి 43,000కి పైగా వస్తువులు ఉన్నాయి. మొత్తం 38 గ్యాలరీలు ఉన్నాయి, వాటిలో యూరోపియన్, ఆసియా, భారతీయ కళలు ప్రదర్శించబడ్డాయి. ముఖ్యంగా ఆరోనోఫానా క్లాక్ (The Musical Clock) చాలా ప్రత్యేకం. ప్రతి గంటకు మ్యూజిక్ వింటూ, చిన్న వ్యక్తి బయటికి వచ్చి గంటలు కొడతాడు, ఇది సందర్శకులకు ఎంతో ఇష్టమైన ఆకర్షణ.

సాలార్ జంగ్ మ్యూజియం ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది, శుక్రవారం మరియు ప్రభుత్వ సెలవుదినాలు మినహా. టిక్కెట్లు మీరు ఆన్‌లైన్ లేదా మ్యూజియం వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్లి మన చరిత్రను, కళలను దగ్గరగా చూసి, అనుభవించండి!

4. హుస్సేన్ సాగర్ (Hussain Sagar)

Places to visit Hyderabad

హుస్సేన్ సాగర్‌ సరస్సు గురించి మాట్లాడితే, ముందుగా మనకు గుర్తుకు వచ్చే దృశ్యం హైదరాబాద్ వినాయకుని నిమర్జన వేడుకలు. ఈ సరస్సు మధ్యలో 18 మీటర్ల ఎత్తుతో నిలబెట్టిన పెద్ద బుద్ధ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. 450 టన్నుల బరువున్న తెల్లటి గ్రానైట్ రాతితో 40 మంది శిల్పులు రెండేళ్ల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. 1992లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. హుస్సేన్ సాగర్‌లో బోటింగ్, స్పీడ్ బోట్ రైడ్ వంటి వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి, అందువల్ల ఇక్కడికి కుటుంబంతో, స్నేహితులతో వచ్చి సరదాగా గడపొచ్చు.

సరస్సు చుట్టూ ఉన్న టాంక్ బండ్ రహదారి సాయంత్రం వేళ ప్రయాణికులు, సందర్శకులతో నిండిపోతుంది. ఇక్కడి ప్రకృతి అందాలు, శాంతమైన వాతావరణం మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే, సరస్సు పక్కనే ఉన్న నెక్లెస్ రోడ్ రాత్రి లైట్లతో మెరిసిపోతుంది. ఆ ప్రాంతంలో మంచి ఫుడ్ జాయింట్లు, రెస్టారెంట్లు ఉండటం వల్ల రాత్రి వేళ ఇక్కడ సందడి చాలా ఉంటుంది. హుస్సేన్ సాగర్‌ అంటే కేవలం ఒక సరస్సు కాదు, హైదరాబాద్‌ జీవనశైలి, సాంస్కృతిక హృదయం కూడా. కుటుంబంతో సేదతీరడానికి, స్నేహితులతో కలిసి సాయంత్రం గడపడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం.

5. బిర్లా మందిరం (Birla Mandir)

Places to visit Hyderabad

హైదరాబాద్‌కి వచ్చినవారు బిర్లా మందిరం చూడకుండా వెళ్లిపోతే పెద్ద తప్పు చేస్తారు. ఈ ఆలయం అందించే ప్రశాంతత, శాంతి అనుభూతి ఇక్కడి ప్రత్యేకత. బిర్లా కుటుంబం మద్దతుతో 1976లో నిర్మించిన ఈ మందిరంలో ప్రధానంగా శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, ఇది తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని పోలి ఉంటుంది. ఆలయ గోడలపై రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి పురాణ కథల శ్లోకాలు నక్కబడి ఉండటం, ఆ కథలలోని సందేశాలను ప్రత్యక్షంగా మనసుకు తాకేలా చూపించడం అందరికీ ఆకర్షణగా ఉంటుంది.

ఇక్కడ గణేశుడు, శివుడు, దుర్గాదేవి వంటి ఇతర ప్రముఖ హిందూ దేవతలకు కూడా ప్రత్యేక మందిరాలు ఉన్నాయి, అందువల్ల ఒకే చోటే పలు దేవతల పూజలు చేయవచ్చు. బిర్లా మందిరం ఎత్తైన తెల్లటి శిల్పాలతో, చక్కటి నిర్మాణంతో, నగరానికి ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల అక్కడి నుంచి హైదరాబాద్‌ నగరానికి అందమైన దృశ్యం కూడా చూడవచ్చు. ఈ ఆలయం కేవలం పూజ స్థలం మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక శాంతి కోసం వచ్చినవారికి ఒక ఆశ్రయం లాంటిది. అందుకే హైదరాబాద్‌ సందర్శించేప్పుడు ఇక్కడి సందర్శన తప్పనిసరి.

6. రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)

Places to visit Hyderabad
Places to visit Hyderabad

మన తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకునే ప్రతి నటుడికి రామోజీ రావు ఫిల్మ్ సిటీ ఒక మొదటి మెట్టు లాంటిది. ఇక్కడే వారు తమ ప్రతిభను చూపిస్తూ, కష్టపడుతూ పెద్ద తెరపై నిలబడేందుకు ప్రయత్నిస్తారు. 1996లో రామోజీ రావు గారు స్థాపించిన ఈ ఫిల్మ్ సిటీ, ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. హైదరాబాద్‌లో 2000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి, ఇది కేవలం సినిమా షూటింగ్ కోసం మాత్రమే కాకుండా, పర్యాటకులకు కూడా అనేక థీమ్ గార్డెన్స్, షోలు, వినోద కార్యక్రమాలతో ఆకర్షణీయంగా నిలిచింది.

రామోజీ ఫిల్మ్ సిటీలో అమితాబ్ బచ్చన్ గార్డెన్స్, జపనీస్ గార్డెన్స్, ముగల్ గార్డెన్స్ వంటి అందమైన ప్రదేశాలు సందర్శకులను మంత్రముగ్ధుల చేస్తాయి. ముఖ్యంగా రామోజీ ఫెస్ట్ వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రదేశం మరింత చక్కగా అలంకరించబడుతుంది. పండుగ సీజన్లో జరిగే స్పెషల్ షోలు, వేడుకలు సందర్శకులకు మరపురాని అనుభూతులను ఇస్తాయి. రామోజీ ఫిల్మ్ సిటీ అంటే కేవలం సినిమా ప్రపంచమే కాదు, ఒక సంపూర్ణ వినోద ప్రపంచం అని చెప్పొచ్చు.

7. శిల్పారామం (Shilparamam)

Places to visit Hyderabad
Places to visit Hyderabad

శిల్పారామం అంటే మట్టి బొమ్మలతో, గ్రామీణ జీవనశైలితో నిండిన ఒక ప్రత్యేక సాంస్కృతిక ఊరు లాంటిది. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో ఉన్న ఈ ప్రదేశం, నగర జీవితం నుంచి కొంతసేపు దూరంగా, మన పల్లె సంస్కృతిని, ఆచారాలను నేరుగా అనుభవించాలనుకునే వారికి ఒక శాంతి వేదికగా ఉంటుంది. ఇక్కడి మట్టి బొమ్మలు, రాతి శిల్పాలు ఎంతో నైపుణ్యంతో తయారు చేసి ప్రదర్శిస్తారు, అవి మన ప్రాచీన భారతీయ కళారూపాల ప్రతిబింబాలుగా నిలుస్తాయి.

శిల్పారామం 1992లో స్థాపించబడింది, ఇది భారతీయ హస్తకళలకు, సాంప్రదాయ నృత్యాలకు, సంగీతానికి ఒక కేంద్రంగా మారింది. ఇక్కడ కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్యాలు, సాంప్రదాయ గర్బా, దాండియా రాస్ ప్రదర్శనలు జరుగుతుంటాయి. గ్రామీణ మ్యూజియం ద్వారా మన పల్లె జీవితం, సంప్రదాయాలను దగ్గరగా చూడవచ్చు. ఇక్కడికి వచ్చి కొంతసేపు గడిపితే, మనసుకు ఒక ప్రశాంతి, సంతృప్తి లభిస్తుంది. శిల్పారామం అంటే కేవలం ఒక ప్రదర్శన స్థలం కాకుండా, మన సంస్కృతిని, కళలను జీవింపజేసే ఒక జీవంత వేదిక అని చెప్పొచ్చు.

8. నెహ్రూ జూలాజికల్ పార్క్ (Nehru Zoological Park)

Places to visit Hyderabad
Places to visit Hyderabad

డిస్కవరీ ఛానల్‌లో చూసే జంతువులను దగ్గరగా చూడాలని ఉందా? అయితే హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు రండి! ఇక్కడ సింహం, పులి, ఏనుగు, జిరాఫీ, జెబ్రా వంటి ఎన్నో రకాల జంతువులను చూడవచ్చు. వాటిని చూసేందుకు మనకు ఫ్లెన్చు అడ్డుగా ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 160 జాతులకు చెందిన 1,500 పైగా జంతువులు ఉన్నాయి.

సఫారీ రైడ్‌లో సింహాలు, పులులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, మనం జీప్‌లో సురక్షితంగా వాటిని చూడవచ్చు. చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ట్రైన్ రైడ్ పార్క్ మొత్తం తిరుగుతూ జంతువుల గురించి వివరిస్తుంది. జంతువులను ఇష్టపడేవారికి, పిల్లలతో సరదాగా గడపాలనుకునే కుటుంబాలకు ఇది ఒక మంచి ప్రదేశం. ఇక్కడ జంతువులను చూస్తూ, ఆడుకుంటూ పిల్లలు ఎంతో ఆనందిస్తారు. మీరు కూడా మీ కుటుంబంతో కలిసి తప్పకుండా ఈ పార్క్‌ను సందర్శించండి.

9. చౌమహల్లా ప్యాలెస్ (Chowmahalla Palace)

Places to visit Hyderabad
Places to visit Hyderabad

చౌమహల్లా ప్యాలెస్‌ అంటే నిజాముల వైభవాన్ని ప్రత్యక్షంగా చూడగలిగే ఒక అద్భుతమైన రాజభవనం. హైదరాబాద్‌ను పాలించిన ఆసిఫ్ జాహీ రాజుల అధికార కార్యాలయం, వేడుకల స్థలం ఇది. “చౌమహల్లా” అంటే నాలుగు మహల్లులు అని అర్థం, అంటే నాలుగు పెద్ద భవనాల కలయిక. ఈ ప్యాలెస్ నిర్మాణం 1750లలో ప్రారంభమై, 1869లో పూర్తయింది. ప్యాలెస్ మధ్యలో ఉన్న పెద్ద పచ్చని తోటలు, అందమైన ఫౌంటెన్లు ఈ ప్రదేశానికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి.

ప్యాలెస్‌లోని మ్యూజియంలో నిజాములు ఉపయోగించిన దుస్తులు, ఆయుధాలు, రాజ కుటుంబానికి చెందిన పెయింటింగ్స్ చూడవచ్చు. ప్రతి మూలలో రాజ వైభవం, కళా నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది. బెలీజియం నుంచి తెప్పించిన శాండెర్లు, అద్భుతమైన శిల్పాలు మిమ్మల్ని మంత్రముగ్ధులుగా చేస్తాయి. చౌమహల్లా ప్యాలెస్‌ మంగళవారం నుండి ఆదివారం వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశ రుసుములు భారతీయులు, విదేశీ పర్యాటకులకు వేర్వేరు ఉంటాయి. హైదరాబాద్‌కి వచ్చినప్పుడు ఈ రాజభవనం తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. అక్కడి వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి, పూర్వ రాజుల జీవనశైలిని అనుభవించవచ్చు.

10. లంబిణి పార్క్ (Lumbini Park)

Places to visit Hyderabad
Places to visit Hyderabad

హుస్సేన్ సాగర్ సరస్సు పక్కన ఉన్న లంబిణి పార్క్‌ అంటే నిజంగా ఒక అందాల వేదిక. ముఖ్యంగా రాత్రి వేళ ఇక్కడ జరిగే లేజర్ షో చూసేందుకు రెండు కళ్ళు కూడా తక్కువటు అనిపిస్తుంది! బుద్ధ విగ్రహం, తెలంగాణ సంస్కృతి, భారతదేశ చరిత్రతో పాటు సంగీతం, రంగుల ఆడంబరాలు కలిసి ఈ షోని మరింత మాయాజాలంగా మార్చేస్తాయి. ఇది దేశంలోనే ప్రసిద్ధి చెందిన లేజర్ షోలలో ఒకటి. సాయంత్రం మ్యూజికల్ ఫౌంటెన్‌ ప్రదర్శన చూస్తూ నీరు సంగీతానికి తగ్గట్టుగా ఎలాగే కదలుతుందో చూడటం ఎంతో ఆహ్లాదకరం.

Places to visit Hyderabad

ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంది, అందుకే సరస్సులో బుద్ధ విగ్రహం దగ్గరికి బోటు తీసుకుని వెళ్లి ఆ అందాలను మరింత దగ్గరగా ఆస్వాదించవచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆట స్థలాలు, చిన్న రైడ్లు, వినోద కార్యక్రమాలు కూడా ఉండటం వల్ల కుటుంబంతో వచ్చే వారికి ఇది ఒక పరిపూర్ణ స్థలం. వీకెండ్స్, పండుగ రోజుల్లో ఇక్కడ సందర్శకులు చాలా ఉంటారు, అందుకే ముందుగా ప్లాన్ చేసుకుని రాకపోతే కొంత గందరగోళం ఉండొచ్చు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉండటం వలన మీరు మీ సౌకర్యానికి తగిన సమయానికే వచ్చి సేదతీరవచ్చు.

11 . స్నో వరల్డ్ (Snow World)

హైదరాబాద్‌లోని స్నో వరల్డ్ అనేది దేశంలోనే మొదటి, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఇండోర్ స్నో థీమ్ పార్క్. ఇది సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది మరియు ఇక్కడ ఉష్ణోగ్రతను -5°C నుంచి 0°C మధ్య నిలుపుతూ, నిజమైన మంచు ప్రపంచాన్ని అనుభవించవచ్చు. ఇక్కడ మీరు స్నో స్లైడ్స్, ఐస్ స్కేటింగ్, స్నో బాల్ ఫైట్స్, స్నో వాలీబాల్, స్నో డ్యాన్సింగ్ వంటి విభిన్న ఆటలు, వినోదాలను ఆస్వాదించవచ్చు. పిల్లల కోసం ప్రత్యేక స్నో ప్లే ఏరియా, మంచుతో తయారు చేసిన ఇగ్లూలు, ఐస్ స్కల్చర్స్ కూడా ఉన్నాయి. పార్క్‌లో వచ్చే ప్రతి రోజు సుమారు 3 టన్నుల తాజా మంచు జతచేస్తారు, అందువల్ల ఎప్పుడూ మంచు తాజాగా ఉంటుంది. సందర్శకులకు ఉష్ణోగ్రత తట్టుకునేందుకు ఉష్ణ దుస్తులు, గ్లౌజులు, షూస్ అందజేస్తారు, అందుకే మీరు చల్లదనం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

స్నో వరల్డ్ రోజంతా 11 AM నుండి 9 PM వరకు తెరిచి ఉంటుంది. టికెట్ ధరలు పెద్దల కోసం సుమారు ₹600-₹750, పిల్లల కోసం ₹350-₹650 వరకు ఉంటాయి, విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు కూడా ఉన్నాయి. పార్క్ హుస్సేన్ సాగర్ సరస్సు సమీపంలో, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ వద్ద ఉంది, ఇది మెట్రో స్టేషన్ మరియు బస్ స్టాప్‌ల నుంచి సులభంగా చేరుకోవచ్చు. సందర్శకులు కెమెరాలు తీసుకురావడం అనుమతించబడదు, అందుకే అందమైన అనుభూతులను మైండ్‌లో నిలుపుకోవాలి. స్నో వరల్డ్‌లో గడిపే సమయం సుమారు 1-2 గంటలు ఉంటుంది, ఇది వేసవి వేడిని తప్పించుకుని కుటుంబంతో, పిల్లలతో కలిసి సరదాగా గడపడానికి అద్భుతమైన ప్రదేశం.

హైదరాబాద్‌ లో ఇలాంటి అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ సందర్శించి నగర చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి!

మరిన్ని ఇటువంటి విహారి ల కోసం తెలుగు రీడర్స్ విహారి ను చూడండి.

You may also like